అంగన్‌వాడీ టీచర్‌ కన్నుమూత

ABN , First Publish Date - 2021-02-11T05:29:38+05:30 IST

అంగన్‌వాడీ టీచర్‌ కన్నుమూత

అంగన్‌వాడీ టీచర్‌ కన్నుమూత

కొవిడ్‌ టీకా వికటించటం వల్లేనని కుటుంబసభ్యుల ఆరోపణ

ఇతర ఆరోగ్య సమస్యలే కారణమంటున్న వైద్యాధికారులు

అశ్వారావుపేట రూరల్‌, ఫిబ్రవరి 10: ఓ అంగన్‌వాడీ ఉపాధ్యాయురాలి మృతి వివాదాస్పదమైంది. కరోనా టీకా వికటించటం వల్లే ఆమె మృతి చెందిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తుండగా.. వారి ఆరోపణలను వైద్యవర్గాలు ఖండిస్తున్నాయి. అశ్వారావుపేట మండలం నందిపాడు గ్రామంలో అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్న పద్దం నాగమణి(37) గత నెల 21న వినాయకపురం పీహెచ్‌సీలో కొవిడ్‌ టీకా తీసుకున్నారు. ఆ టీకా తీసుకున్న తరువాత నాగమణికి జ్వరం, ఒళ్లు నొప్పులు, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో కుటుంబసభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా.. రెండు మూడు రోజుల్లో ఆరోగ్యం కుదుటపడగా.. వారం తరువాత మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆమెను భద్రాచలంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. నాగమణి ఆరోగ్యం మరింత క్షీణించటంతో వైద్యుల సూచనల మేరకు మంగళవారం ఖమ్మంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించి.. చికిత్స అందించేలోపే నాగమణి కన్నుమూశారు. అయితే కరోనా టీకా వికటించటం వల్లే తన భార్య నాగమణి మృతిచెందిందని, నాగమణికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని భర్త, విద్యావలంటీర్ల సంఘం మండల అధ్యక్షుడు శ్రీను కన్నీటిపర్యంతమయ్యారు. అయితే దీనిపై వినాయకపురం వైద్యుడు రాంబాబు మాట్లాడుతూ నాగమణికి లివర్‌ సంబంధ సమస్య ఉన్నట్టు తెలిసిందని, రక్తకణాల సంఖ్య కూడా తగ్గటం వల్ల ఆమె మృతిచెందిందన్నారు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్నామన్నారు. నాగమణికి ఇంటర్‌ చదివుతున్న ఓ కుమార్తె, 8వ తరగతి చదువుతున్న ఓ కుమారుడు ఉన్నారు. నాగమణి మృతితో గ్రామంలో విషాఽదఛాయలు అలుముకున్నాయి. అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, ఐసీడీఎస్‌, విద్యాశాఖ అధికారులు, సిబ్బంది నాగమణి మృతదేహానికి నివాళులర్పించారు. అయితే అంగన్‌వాడీ టీచర్‌ నాగమణి మృతిచెందడానికి కరోనా టీకా వికటించడమే కారణమన్న వార్తలతో అనేకమందిలో ఆందోళన మొదలైంది. కానీ టీకా వేయించుకున్నవారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, టీకా వేసుకున్న తర్వాత ఒకట్రెండురోజులు జ్వరం, ఒళ్లు నొప్పులు సహజంగానే వస్తాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. 

 

 


Updated Date - 2021-02-11T05:29:38+05:30 IST