టీకా వేయించుకున్న అంగన్‌వాడీ మృతి

ABN , First Publish Date - 2021-03-02T07:08:29+05:30 IST

కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్న ఓ అంగన్‌వాడీ కార్యకర్త మృతి చెందింది. టీకా వేయించుకున్నప్పటి నుంచి తీవ్ర అనారోగ్యం పాలైన ఆమె తిరుపతిలోని స్విమ్స్‌లో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచింది.

టీకా వేయించుకున్న అంగన్‌వాడీ మృతి
అంగన్‌వాడి కార్యకర్త నల్లూరి సునీత మృతదేహం

ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని

పలు సంఘాల నేతలు ఆందోళన

సింగరాయకొండ, మార్చి 1 : కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్న ఓ అంగన్‌వాడీ కార్యకర్త మృతి చెందింది. టీకా వేయించుకున్నప్పటి నుంచి తీవ్ర అనారోగ్యం పాలైన ఆమె తిరుపతిలోని స్విమ్స్‌లో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచింది. వివరాల్లోకెళ్తే... మండలంలోని కలికివాయి గ్రామానికి చెందిన నల్లూరి సునీత (39) అదే గ్రామంలో అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేస్తోంది. గత నెల 20న స్థానిక పీహెచ్‌సీలో కరోనా వ్యాక్సిన్‌ వేయించుకుంది. అప్పటి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతోంది. కుటుంబ సభ్యులు ఆమెకు ఒంగోలులోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. నయంకాకపోవడంతో  మెరుగైన వైద్యం కోసం గుంటూరు, తదనంతరం నెల్లూరుకు తీసుకెళ్లారు. పరిస్థితి మెరుగుపడకపోవడతో తిరుపతిలోని స్విమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆమె వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించారు. మృతదేహం సోమవారం మధ్యాహ్నం కలికివాయిలోని ఇంటికి చేరుకుంది. విషయం తెలుసుకున్న అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు, వామపక్ష, ప్రజాసంఘాల నాయకులు భారీగా అక్కడికి చేరుకున్నారు. వ్యాక్సిన్‌ వికటించినందునే సునీత చనిపోయిందని ఆమె కుటుంబ సభ్యులు తహసీల్దార్‌ ఉషారాణి, స్థానిక పీహెచ్‌సీ డాక్టర్‌ హరిత ముందు ఆందోళనకు దిగారు. వ్యాక్సిన్‌ తీసుకోవడానికి ఇష్టపడకపోయినా బలవంతంగా వేశారని అధికారులను నిలదీశారు. ఒకనొక దశలో నష్టపరిహారానికి సంబంధించి అధికారుల నుంచి స్పష్టమైన హామీ రాకపోయేసారికి కుటుంబ సభ్యులు, అంగన్‌వాడీ యూనియన్‌, వామపక్షనాయకులు మృతదేహాన్ని జాతీయ రహదారి మీదకు తరలించే ప్రయత్నం చేశారు. ఈ తరుణంలో ఎస్సై సంపత్‌కుమార్‌, తహసీల్దార్‌ ఉషారాణి, కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. మృతురాలి కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని అధికారులను డిమాండ్‌ చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ మజుందార్‌, కార్యదర్శి శ్రీనివాసులు, అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్రకార్యదర్శి వేమేశ్వరి, సీపీఐ నాయకులు వీరారెడ్డి, ప్రజా సంఘాల నాయకుడు అంబటి కొండలరావు పాల్గొన్నారు. 


స్పందించిన కొండపి ఎమ్మెల్యే స్వామి

స్ధానిక అధికారుల నుంచి స్పష్టమైన హామీ రాకపోయేసరికి కొండపి ఎమ్మెల్యే స్వామి స్పందించి జిల్లా కలెక్టర్‌ పోలా భాస్కర్‌, జిల్లా వైద్యాధికారిణి పి. రత్నావళితో ఫోన్‌లో మాట్లాడారు. మృతురాలు కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు.



Updated Date - 2021-03-02T07:08:29+05:30 IST