Advertisement

అందని పౌష్టికాహారం

Apr 22 2021 @ 23:34PM

  • జనవరి, ఫిబ్రవరి, మార్చిలో పాలు బంద్‌ 
  • 2నెలలుగా ఆగిన కంది పప్పు సరఫరా 
  • నాసిరకం పాలతో పౌష్టికాహార లోపం
  • ఇబ్బంది పడుతున్న పేద గర్భిణులు, బాలింతలు


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్‌వాడీ కేంద్రాల్లో అందిస్తున్న పౌష్టికాహారం సరిగా అందడం లేదు. ఈ ఏడాది మూడు నెలలపాటు పాలు ఇవ్వడం నిలిపి వేశారు. ప్రస్తుతం ఇచ్చినా నిలువ ఉన్న వాటిని అందిస్తున్నారు. ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా అందిస్తున్న సరుకుల్లో కూడా ఒకటి అందితే మరొకటి అందడం లేదు. ప్రతి నెలా ఏదో ఒకటి ఇవ్వడం లేదు. దీంతో గర్భిణులు, బాలింతలు, పిల్లలు పౌష్టికాహార లోపానికి గురవుతున్నారు.


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : పుట్టిన బిడ్డకి తల్లిపాలు ఎంతో శ్రేష్ఠం. ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టాలంటే నవమాసాలు తల్లి మంచి పౌష్టికాహారం తీసుకోవాలని అందరికీ తెలిసిన విషయమే. పేద, మధ్యతరగతి గర్భిణుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం అందిస్తున్నాయి. ఇది రంగారెడ్డి జిల్లాలో సరిగా అమలుకావడం లేదు. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో పాలు పంపిణీ నిలిపివేశారు. అలాగే మార్చి, ఏప్రిల్‌ నెలలో కందిపప్పు పరిస్థితి అంతే. ఈ నెల నుంచి పాలు సరఫరా చేస్తున్నారు. కానీ.. నిలువ ఉన్న పాల ప్యాకెట్లను సరఫరా చేస్తున్నారు. పాలు నిలవ కోసం అందులో కెమికల్స్‌ వాడుతున్నారు. ఇవే పాలను గర్భిణులు, బాలింతలు, పిల్లలకు అందిస్తున్నారు. దీంతో పౌష్టికాహారం లోపిస్తుంది. పిల్లల్లో ఎదుగుదల సరిగ్గా ఉండటం లేదు. మాతా శిశు మరణాలకు అడ్డుకట్ట వేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. ఐసీడీఎస్‌ పర్యవేక్షణలో నడుస్తున్న అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు క్షేత్రస్థాయిలో అస్తవ్యస్తంగా మారింది. కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు నెలవారీగా చేరాల్సిన పౌష్టికాహారం సక్రమంగా చేరడం లేదు. ఒకవేళ చేరినా అవి నాసిరకంగా ఉంటున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం అందించాలనే ప్రతీ ఏటా పోషణ్‌ అభియాన్‌ పేరిట ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా ఫలితం లేకుండా పోతుంది. 


ఇంటికే సరుకులు

ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా గర్భిణి, బాలింతలకు అన్నం, ఆకుకూర పప్పు, కూర, సాంబార్‌తో ఒకపూట సంపూర్ణ భోజనం అందించేవారు. కరోనా నేపథ్యంలో గతేడాది మార్చి 22 నుంచి లబ్ధిదారులకు ఇంటికే సరుకులు పంపిణీ చేస్తున్నారు. నెలలో సెలవులు మినహా మిగతా రోజులకు సంబంధించి గుడ్లు పంపిణీ చేస్తున్నారు. గర్భిణి, బాలింతలకు ఒకరోజు 150 గ్రాముల బియ్యం, 30 గ్రాముల పప్పు, 16 గ్రాముల నూనె, 200 ఎంఎల్‌ పాలను అందిస్తున్నారు. ఆకు కూరలు మినహా మిగతా సరుకులను నెలకు సరిపడా అందిస్తున్నారు. అందిస్తున్న వాటిలో ప్రతినెలా ఏదో ఒకటి ఇవ్వడం లేదని గర్భిణులు, బాలింతలు చెబుతున్నారు. ఇక ఒక పిల్లాడికి రోజుకు 75 గ్రాముల బియ్యం, 15 గ్రాముల పప్పు, 5 గ్రాముల నూనె, 20 గ్రాముల మురుకులు ఇస్తున్నారు. 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకు బాలామృతం, నెలకు 16 గుడ్లు అందిస్తున్నారు. ఇందులో కూడా కొన్ని అందడం లేదు.


రెండు నెలలుగా జీతాల్లేవ్‌..

రంగారెడ్డి జిల్లాలో ఏర్పడిన అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు సంబంధించిన ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేసింది. కొత్తగా వచ్చిన వారికి రెండు నెలలుగా జీతాలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. త్వరగా వేతనాలు ఇప్పించాలని వేడుకుంటున్నారు. 


మూడు నెలలుగా పాలు ఇవ్వడం లేదు

అంగన్‌వాడీ కేంద్రంలో మూడు నెలలుగా పాలు ఇవ్వడం లేదు. ప్రతినెలా ఏదో ఒకటి మిస్‌ చేస్తున్నారు. ఈ నెలలో పాలు ఇచ్చారు. కానీ.. నిలువ ఉన్న ప్యాకెట్లు ఇస్తున్నారు. నిలువ పాలలో కెమికల్‌ ఉంటుందంటున్నారు. కానీ తప్పని పరిస్థితుల్లో వాటినే తాగుతున్నాం. అధికారులు స్పందించి రోజూ తాజా పాలు ఇప్పించాలి.

 - పి.వెన్నెల, గర్భిణి, పోచారం 


రంగారెడ్డి జిల్లాలో పిల్లల వివరాలు

అంగన్‌వాడీ సెంటర్లు : 1600

7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలు : 58,140

3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లలు : 28,467

గర్భవతులు, బాలింతలు : 24,896

సరైన బరువు ఉన్న పిల్లలు (5 నెలలు) : 1,08,619

సాధారణ బరువు ఉన్నవారు : 92,736

తక్కువ బరువు ఉన్నవారు 14,828

అతి తక్కువ బరువు ఉన్న పిల్లలు : 1,055

Follow Us on:
Advertisement