సమస్యలకు నిలయంగా అంగన్‌వాడీ కేంద్రాలు

Sep 26 2021 @ 22:26PM

- జిల్లాలో పక్కా భవనాలు లేక ఇబ్బందులు

- స్థలం లేక నిర్మాణాలు పూర్తి కాని పరిస్థితి

- అద్దె గదుల్లో అవస్థల మధ్య నిర్వహణ

బెజ్జూరు, సెప్టెంబరు 26: అద్దె భవనాలు.. అరకొర సౌకర్యాలు.. ఇరుకు గదులు.. ఆట స్థలాలు కరువు.. ఇటువంటి అసౌకర్యాల నడుమ జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ కొనసాగుతోంది. సొంత భవనాలు లేక పోవడం.. ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా కట్టేందుకు స్థలాలు లేక పోవడంతో నిర్మాణాలకు మోక్షం లభించడం లేదు. అద్దె భవనాల్లో సరైన సదుపాయాలు లేక పోవడంతో పిల్లలు, గర్భిణులు, బాలింతలు అసౌకర్యానికి గురవుతున్నారు. 

జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు లేకపోవడంతో అరకొర సౌకర్యాల నడుమ కొనసాగుతున్నాయి. అద్దెభవనాల్లో కేంద్రాలను నిర్వహించడం వల్ల తమ పిల్లలకు ఇక్కడ అనుకూలంగా ఉండడం లేదంటూ వారి తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు. దీంతో చాలామంది పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాలకు పంపించేందుకు ఆసక్తి చూపించడం లేదు. జిల్లాలో 973అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వాటిలో పక్కా భవనాలు 303 కేంద్రాలకు ఉన్నాయి. 359 కేంద్రాలను ఆయా గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో ఒకగది తీసుకొని నిర్వహి స్తున్నారు. మరో 311కేంద్రాలు అద్దె భవనాల్లో అసౌకర్యాల నడుమ కొనసాగు తున్నాయి. ప్రభుత్వం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లల కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నప్పటికీ వాటిని అందించే కేంద్రాల్లో మాత్రం సౌకర్యాలు అరకొరగానే ఉన్నాయి. పిల్లలకు పౌష్టికాహారంతో పాటు చదువు చెప్పడం, ఆటలు ఆడించడం, నిద్రపుచ్చడం వంటివి చేయాల్సి ఉంటుంది. అయితే అద్దె భవనాల్లోనే అత్యధిక కేంద్రాలు ఉండడంతో కేంద్రాల నిర్వహణ ఇబ్బందికరంగా మారింది. అర్బన్‌ ప్రాంతాల్లో అద్దె భవనాల్లో నిర్వహించే కేంద్రాలకు భవనం చుట్టు పక్కల ఖాళీ ప్రదేశం లేక పోవడం, చిన్న చిన్న ఇరుకు గదులు కావడంతో పిల్లలు ఉండలేని పరిస్థితి నెలకొంది. అద్దె భవనాలు కావడంతో అంగన్‌వాడీ కేంద్రాల్లో మంచినీరు కూడా దొరకని పరిస్థితి ఉంది. నీటి వసతి లేక ఆయాలు కేంద్రం నుంచి బయటకు వెళ్లి నీటిని తేవాల్సి వస్తోంది. పట్టణ ప్రాంతాల్లో రెండు మూడు రోజులకోసారి నీటిని పట్టుకొని నిలువ ఉంచుకొని వాడుకోవాల్సి వస్తోందని ఆయాలు వాపోతున్నారు. 

భవనాలు మంజూరైనా మోక్షం లేదు..

జిల్లాలో అద్దె భవనాల్లో నిర్వహించే అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం భవనాలు మంజూరు చేసినప్పటికీ వాటిని నిర్మిం చేందుకు మోక్షం కలగడం లేదు. ప్రతి కేంద్రాన్ని ప్రాథమిక పాఠశాల ఆవరణలో నిర్వహించాలని, స్త్రీ, శిశు సంక్షేమశాఖ నిర్ణయించింది. ప్రభుత్వం సైతం ప్రాథమిక పాఠశాలల్లోనే అంగన్‌వాడీ కేంద్రాలను నిర్మించాలని సూచించి, ఉపాధి హామి కింద కొన్ని, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా మరికొన్ని నిధులను విడుదల చేసింది. అయితే పలుకారణాలతో పాఠశాలల్లో భవనాలను నిర్మించలేక పోతు న్నారు. విద్యాశాఖాధికారులు అంగన్‌వాడీ కేంద్రాలను నిర్మించేందుకు పాఠశాలల్లో స్థలాలను చూపించక పోవడంతో భవన నిర్మాణాలు ముందుకు సాగట్లేదు. 

ఏడాది క్రితమే ప్రతిపాదనలు పంపించాం..

- సావిత్రి, డీడబ్ల్యూవో

అంగన్‌వాడీ కేంద్రాలకు పక్కా భవనాల నిర్మాణానికి ఏడాది క్రితమే ప్రతి పాదనలు పంపించాం. జిల్లాలో 279అంగన్‌వాడీ కేంద్రాల భవనాల మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నాం.

Follow Us on: