భార్యపై కోపం.. మహిళలపై ద్వేషం!

ABN , First Publish Date - 2022-08-17T10:05:26+05:30 IST

భార్య చేసిన తప్పు వల్ల.. మహిళలపై ద్వేషం పెంచుకున్న ఓ వ్యక్తి ఉన్మాదిలా తయారయ్యాడు.

భార్యపై కోపం.. మహిళలపై ద్వేషం!

  • అపార్టుమెంట్లలో కాపలా కుటుంబాలపై దాడి
  • తలపై ఇనుపరాడ్‌తో కొట్టి దారుణంగా హత్య
  • వారం రోజుల వ్యవధిలోనే మూడు హత్యలు
  • సీరియల్‌ కిల్లర్‌ అరెస్టు.. హత్యాయుధం స్వాధీనం
  • వివరాలు వెల్లడించిన విశాఖ సీపీ శ్రీకాంత్‌


విశాఖపట్నం, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): భార్య చేసిన తప్పు వల్ల.. మహిళలపై ద్వేషం పెంచుకున్న ఓ వ్యక్తి ఉన్మాదిలా తయారయ్యాడు. విశాఖ నగర శివారు పెందుర్తి ప్రాంతంలో కలకలం సృష్టించిన సీరియల్‌ కిల్లర్‌ మిస్టరీని పోలీసులు ఛేదించారు. వారం రోజుల వ్యవధిలో ముగ్గురిని హత్యచేసిన నిందితుడిని అరెస్టు చేశారు. మంగళవారం విలేకరుల సమావేశంలో పోలీస్‌ కమిషనర్‌ సీహెచ్‌ శ్రీకాంత్‌ ఆ వివరాలను వెల్లడించారు. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం ధర్మసాగరం గ్రామానికి చెందిన చందక రాంబాబు (49)కి పద్దెనిమిదేళ్ల వయస్సులో రాజమండ్రికి చెందిన వీర్రాజుతో పెళ్లి జరిగింది. వారికి ప్రస్తుతం 27 ఏళ్ల వయసున్న కుమారుడు, 26 ఏళ్ల కుమార్తె ఉన్నారు. పెళ్లి తర్వాత రాంబాబు రాజమండ్రి వెళ్లి  జీవనం సాగించాడు. 2006లో కుటుంబంతో సహా హైదరాబాద్‌ వలసవెళ్లాడు. 2016లో భార్య ఇంటి యజమానితో సన్నిహితంగా కనిపించడంతో ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. 2018లో విడాకులు తీసుకున్నారు. పిల్లలు కూడా భార్యతోనే ఉండిపోవడంతో రాంబాబు ఒంటరిగా మిగిలిపోయాడు. 2021 అక్టోబరులో పెందుర్తి ప్రశాంతినగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని ఒంటరిగా పూజలు చేస్తూ దేవుడు వస్తున్నాడంటూ కేకలు వేసేవాడు. దీంతో ఇంటి యజమాని ఖాళీ చేయించాడు. అప్పటినుంచి బస్టాపులు, ఫంక్షన్‌హాళ్లు, ఆలయాల వద్ద తిరుగుతూ కాలం గడుపుతున్నాడు. 


తాను ఈ పరిస్థితికి చేరుకోవడానికి భార్యే కారణమంటూ నిత్యం రగిలిపోయేవాడు. ఈ క్రమంలో మహిళలంటేనే ద్వేషం పెంచుకున్నాడు. జూలై 7న బృందావన్‌ గార్డెన్స్‌లో నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్న తోట నల్లమ్మ(50)పై ఇనుపరాడ్డుతో హత్యాయత్నం చేశాడు. ఆమె కేకలు వేయడంతో ఆమె కుమారుడు రావడంతో అక్కడ నుంచి పారిపోయాడు. ఈ నెల 6న రాత్రివేళ చినముషిడివాడ సప్తగిరి నగర్‌లో నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న సుతారి అప్పారావు (72), సుతారి లక్ష్మి (62)లను రాడ్డుతో తలపై కొట్టి హత్య చేశాడు. ఈ కేసు దర్యాప్తులో ఉండగానే ఈనెల 14న సుజాతనగర్‌ నాగమల్లి లేఅవుట్‌లో నిర్మాణంలో ఉన్న భవనంలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న అప్పికొండ లక్ష్మిని రాడ్డుతో కొట్టి చంపేశాడు. హత్య అనంతరం పోలీసులు పరిసర ప్రాంతాల్లో గాలిస్తుండగా రాంబాబు అనుమానాస్పదంగా కనిపించాడు. అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించడంతోపాటు హత్యకు ఉపయోగించి సమీపంలో పడేసిన రాడ్‌ను చూపించాడు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్టు సీపీ తెలిపారు. 


చోరీచేసిన రాడ్‌తోనే హత్యలు

పెందుర్తిలోని స్ర్కాప్‌ దుకాణంలో అడుగున్నర పొడవున్న ఇనుపరాడ్డును రాంబాబు దొంగిలించాడు. ఆ రాడ్డుకు చివరన చిన్న రంధ్రం చేసి, తాడు కట్టాడు. హత్య చేసేందుకు వెళ్లే సమయంలో తాడుతో ఆ రాడ్‌ను భుజాన వేలాడదీసుకుని, పైన షర్టు తొడిగేవాడు. దీంతో ఎవరికీ అనుమానం వచ్చేది కాదు.

Updated Date - 2022-08-17T10:05:26+05:30 IST