Anil Agarwal: అది రాత్రికి రాత్రే తీసుకున్న నిర్ణయం.. అదే ఇవాళ నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది

ABN , First Publish Date - 2022-07-13T19:01:25+05:30 IST

మైనింగ్ మొగల్, వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ ఇటీవల కాలంలో సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. యువతలో స్ఫూర్తి నింపేందుకు తన జీవిత అనుభవాలను ఒక్కొక్కటిగా పంచుకుంటున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేకుండా..

Anil Agarwal: అది రాత్రికి రాత్రే తీసుకున్న నిర్ణయం.. అదే ఇవాళ నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది

ఎన్నారై డెస్క్: మైనింగ్ మొగల్, వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ ఇటీవల కాలంలో సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. యువతలో స్ఫూర్తి నింపేందుకు తన జీవిత అనుభవాలను ఒక్కొక్కటిగా పంచుకుంటున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఆంగ్లం ఒక్క ముక్క రాకుండా ముంబైలో తాను అడుగు పెట్టినప్పటి నుంచి లండన్ వెళ్లి, ఈ రోజు 30 వేల కోట్ల రూపాయల అధిపతిగా మారే వరకు జరిగిన ప్రస్థానాన్ని వివరిస్తున్నారు. తాను కన్న కలలు, వాటిని సాకారం చేసుకోవడంలో ఎదురైన సవాళ్లను, వాటిని తాను అధిగమించిన తీరును తెలుపున్నారు. ఈ క్రమంలో 2003లో లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (LSE)లో తన సంస్థ వేదాంత లిస్ట్ కావడంతో ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా నిలిచారు. ఇది ఎలా సాధ్యమైందనే విషయాన్ని తాజాగా ఆయన పంచుకున్నారు.  


లండన్ వెళ్లాలనే నిర్ణయం రాత్రికి రాత్రే తీసుకుందే..

"గ్లోబల్ కంపెనీలు LSE లో లిస్ట్ అవుతున్నాయి. దాంతో తాను పెట్టబోయే కంపెనీ కూడా భవిష్యత్తులో అందులో ఒకటిగా ఉండాలని కోరుకున్నాను. నిజానికి నేను పెద్ద కలలు కన్నాను. అందుకే నేను లండన్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. అది కూడా రాత్రికి రాత్రే తీసుకున్న నిర్ణయం" అని తెలిపారు.


 ఇక ఈ జర్నీలో తన భార్యను తన అతిపెద్ద సపోర్ట్ సిస్టమ్‌గా పేర్కొన్నారు. ఆమె తమ కుమార్తె ప్రియ పాఠశాలకు ఎలా వెళ్లిందో గుర్తు చేసుకున్నారు. ఇక లండన్ వెళ్లేందుకు తాను పెద్దగా ఏమీ ప్యాక్ చేయలేదు కానీ తల్లిదండ్రుల ఆశీర్వాదాలకు చిహ్నంగా తన అమ్మ గారి పరాఠాలు, తండ్రి శాలువాను తీసుకున్నట్లు అగర్వాల్ చెప్పారు.


ఇక లండన్‌లోని హీత్రో విమానాశ్రయంలో దిగిన తర్వాత తన అనుభవాన్ని మరింత గుర్తు చేసుకున్నారు. "అది వేరే ప్రపంచంలా అనిపించింది. భిన్నమైన వ్యక్తులు, చలి, వర్షపు వాతావరణం, పెద్దపెద్దగా ఉన్న తెల్లని భవనాలు. వాటిని చూసిన తర్వాత స్వదేశంలో నాతో కొందరు చెప్పిన విషయాలు గుర్తుకు వచ్చాయి. అందులో ముఖ్యమైంది ఓ సామెత. 'చోటి చిడియా బడే ఆస్మానో మే నహీ ఉడా' కర్తీ(చిన్న పక్షి పెద్ద ఆకాశంలో ఎగరలేదు అనేది దాని అర్థం). చాలా కాలం తర్వాత నాకు భయం వేసింది." అని అగర్వాల్ రాసుకొచ్చారు.


"నేను లండన్‌ వచ్చిన్నప్పుడు నా వద్ద పెద్దగా ఏమీ లేదు. కానీ నాతో పాటు ఒకటి మాత్రం ఉంది. నా మార్గదర్శకులు.. నా తల్లిదండ్రుల నమ్మకం, ఆశీర్వాదం. కాబట్టి నేను ఇవాళ ఇక్కడ ఉన్నాను. నా పక్కన నా భార్య, పిల్లలతో ఈ కొత్త జీవిత ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నాను." అనిల్ అగర్వాల్ గత నెలలో లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనియన్‌లో విద్యార్థులతో జరిగిన ఒక ఇంటరాక్షన్‌లో తన వ్యవస్థాపక ప్రయాణంలోని ప్రతి విషయాన్ని వారికి తెలియజేశారు. తన ప్రసంగంతో వారిని పెద్ద కలలు కనేలా ప్రేరేపించారు.


"బీహార్‌లోని ఒక చిన్న గ్రామం నుండి లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ వరకు కొనసాగిన నా ప్రయాణం చాలా నేర్పింది. అందులో ఎంతో హార్డ్‌వర్క్ ఉంది. అలాగే ఎంతో ఆత్మవిశ్వాసంతో నిండి ఉంది. విద్యార్థులకు నా చిన్న సలహా. నిర్భయంగా ఉండండి(ఎందుకంటే అదృష్టం ధైర్యవంతులకు అనుకూలంగా ఉంటుంది), వినయపూర్వకంగా ఉండండి, సరళంగా ఉండండి (ఎందుకంటే కృషికి ప్రత్యామ్నాయం లేదు). యువత, సాంకేతికత కలిస్తే ప్రపంచాన్ని కొత్త మార్గాన్ని చూపిస్తుంది" అని అనిల్ అగర్వాల్ చెప్పుకొచ్చారు.




Updated Date - 2022-07-13T19:01:25+05:30 IST