వానాకాలం వరికి ఆంక్షల్లేవ్‌!

ABN , First Publish Date - 2022-04-09T07:24:05+05:30 IST

యాసంగి సీజన్‌లో వరి సాగుపై నియంత్రణ విధించిన రాష్ట్ర

వానాకాలం వరికి ఆంక్షల్లేవ్‌!

  • రైతుల ఇష్టానికే వదిలేయాలని వ్యవసాయశాఖ నిర్ణయం..
  • పంటల ప్రణాళికలు రూపొందించే పనిలో నిమగ్నం
  •  పత్తి, కంది సాగు విస్తీర్ణం గణనీయంగా పెంచాలనే యోచన


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): యాసంగి సీజన్‌లో వరి సాగుపై నియంత్రణ విధించిన రాష్ట్ర ప్రభుత్వం... వచ్చే వానాకాలంలో ఎలాంటి అంక్షలు విధించకూడదని నిర్ణయం తీసుకుంది. నియంత్రిత వ్యవసాయం పేరుతో ఓసారి, సన్నా లు వేయాలని మరోసారి, వరి వేస్తే ఉరి వేసుకు న్నట్లేనని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా ప్రకటించి వివాదాస్పదమయ్యారు. దీంతో ఈ వానాకాలంలో మాత్రం రైతుల ఇష్టానికే సాగును వదిలేయాలని నిర్ణయించి, వ్యవసాయశాఖకు మౌఖి క ఆదేశాలు జారీచేసినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. అదేక్రమంలో పత్తి, కంది సాగు విస్తీర్ణాన్ని గణనీయం గా పెంచాలని వ్యవసాయశాఖ ప్రణాళికలు రచిస్తోంది.


వచ్చే వానాకాలం(2022- 23) సీజన్‌కు వ్యవసాయశాఖ ప్రణాళికలు తయారుచేసే పని ప్రారంభించింది. ఈసారి ప్రధానంగా మూ డు పంటలపై దృష్టి సారించనున్నారు. వరి సాగును రైతుల ఇష్టానికి వదిలేయాలని, పత్తి, కంది విస్తీర్ణం మాత్రం పెంచాలని, మొక్కజొన్న విషయంలో తటస్థంగా వ్యవహరించాలని వ్యవసాయశాఖకుప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వచ్చాయి. పూర్తిగా రైతులను నియంత్రించే పద్ధతిలో కాకుండా, కేవలం సూచనలు చేయాలని, రైతుల్లో అవగాహన కలిగించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉండటం గమనార్హం. పైపెచ్చు వానాకాలంలో ఉత్పత్తి అయ్యే రా రైస్‌ తీసుకోవటానికి ‘ఎఫ్‌సీఐ’ సిద్ధంగా ఉంటుంది. రైతులు ఆహార అవసరాలకు, విత్తనాలకు నిల్వచేసుకున్న తర్వాతే... మిగిలిన ధాన్యాన్ని విక్రయిస్తారు. ఎఫ్‌సీఐ కూడా వానాకాలంలో పరిమితులు లేకుండా ధాన్యం కొంటోంది. ఈ పరిస్థితుల్లో వరి సాగు పెరిగినా ఆందోళన చెం దాల్సిన అవసరం లేదని సర్కారు భావిస్తోంది.


గతేడాది వానాకాలంలో రికార్డుస్థాయిలో 61.95 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగుచేశారు. ఈసారి కూడా 60 లక్షల ఎకరాలకు మించి వరి సాగవుతుందనే అంచనాలున్నాయి. పైగా గత యాసంగి లో  వరి వద్దని ప్రభుత్వం చెప్పినందున కొందరు రైతులు  భూమి ని పడావుగా వదిలేశారు. గడిచిన వానాకాలంతో పోలిస్తే 26 లక్షల ఎకరాలు, 2020- 21 యాసంగితో పోలిస్తే 16.49 లక్షల ఎకరాలు తక్కువగా వరి సాగుచేశారు. ఈసారి మాత్రం వరి సాగు తగ్గే పరిస్థితి కనిపించటంలేదని, నిరుటి కంటే ఎక్కువ విస్తీర్ణం పెరుగుతుందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.



పత్తి, కంది విస్తీర్ణం మరింత పెరగాల్సిందే!

రెండేళ్లుగా పత్తి సాగు విస్తీర్ణం పెంచటానికి ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేస్తోంది. రెండేళ్ల క్రితం సీఎం కేసీఆర్‌... 70 లక్షల ఎకరాల్లో పత్తిసాగు చేయాలని రైతులకు టార్గెట్‌ పెట్టారు. అప్పుడు 60.53 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగుచేశారు. కానీ అధిక వర్షాల తాకిడికి పత్తి దెబ్బతిని రైతులు నష్టపోయారు. గడిచిన వానాకాలంలో ప్రభుత్వం ఎంత మొ త్తుకున్నా... 49.97 లక్షల ఎకరాల్లో మాత్రమే పత్తి వేశారు. అప్పుడు కూడా వానల తాకిడికి పత్తి దెబ్బతింది. దిగుబడి తగ్గటంతో వ్యాపారులు పత్తి ధర పెంచారు. నిరుటి వరకు సీసీఐ కొనుగోలుచేసింది. ఈసారి ప్రైవేటు ట్రేడర్లే పత్తి కొన్నారు.


వచ్చే వానాకాలంలో మాత్రం పత్తి సాగు విస్తీర్ణాన్ని 80 లక్షల ఎకరాలకు తీసుకెళ్లాలని వ్యవసాయశాఖ ప్రణాళిక తయారు చేస్తోంది. అదేక్రమంలో కంది సాగు విస్తీర్ణం పెంచాలనే ఆలోచన చేస్తున్నారు. 10 లక్షల ఎకరాలకు మించి కంది సాగు చేయించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అదేక్రమంలో పచ్చి రొట్ట విత్తనాలు విరివిగా పంపిణీచేయాలని, ప్రఽ దాన పంటల సాగుకు ముందుగా పచ్చిరొట్ట విత్తనాలు వేసి... దమ్ము చేస్తే మేలు జరుగుతుందని,  ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించవచ్చని  భావిస్తున్నారు. 


Updated Date - 2022-04-09T07:24:05+05:30 IST