అన్నాడీఎంకే ఎన్నికలపై ‘స్టే’కు Highcourt నిరాకరణ

ABN , First Publish Date - 2021-12-04T15:33:58+05:30 IST

అన్నాడీఎంకే సమన్వయకర్త, ఉప సమన్వయకర్త పదవులకు జరుగనున్న ఎన్నికలపై స్టే విధించాలని కోరుతూ ఆ పార్టీ మాజీ ఎంపీ కేసీ పళనిస్వామి చేసుకున్న అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఆయన పిటిషన్‌ను

అన్నాడీఎంకే ఎన్నికలపై ‘స్టే’కు Highcourt నిరాకరణ

చెన్నై: అన్నాడీఎంకే సమన్వయకర్త, ఉప సమన్వయకర్త పదవులకు జరుగనున్న ఎన్నికలపై స్టే విధించాలని కోరుతూ ఆ పార్టీ మాజీ ఎంపీ కేసీ పళనిస్వామి చేసుకున్న అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఆయన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు అన్నా డీఎంకే సంస్థాగత ఎన్నికలపై స్టే ఉత్తర్వులు విధించేందుకు నిరాకరించింది. అన్నాడీఎంకేలో పార్టీ సమన్వయకర్త, ఉప సమన్వయకర్తకు సర్వాధికారాలు కల్పిస్తూ ఇటీవల జరిగిన ఆ పార్టీ కార్యనిర్వాహక మండలి సమావేశంలో పార్టీ నియమావళిలో పలు సవరణలుచేశారు. ఈ రెండు పదవులను ఐదేళ్లకుపైగా పార్టీ సభ్యత్వం కలిగినవారే ఓటేసి ఎన్నుకోవాలని పార్టీ నియమావళిని సవరించారు. ఆ మేరకు ఈ రెండు పదవులతోపాటు మరిన్ని పదవులకు ఎన్నికలు జరుగుతాయని ఎడప్పాడి పళనిస్వామి, ఒ.పన్నీర్‌సెల్వం ప్రకటించారు. పార్టీ సమన్వయకర్త, ఉప సమన్వయకర్త పదవులకు ఈ నెల 7వ తేదీన ఎన్నికలు జరుగుతాయని, శుక్రవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 2018లో అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన మాజీ ఎంపీ కేసీ పళనిస్వామి అన్నాడీఎంకే ఎన్నికలపై స్టే విధించాలని కోరుతూ శుక్రవారం ఉదయం పిటిషన్‌ దాఖలు చేశారు. అన్నాడీఎంకే నియమ నిబంధనలు ఉల్లఘించి ఎన్నికల ప్రకటన విడుదల చేశారని, తనను పార్టీ నుంచి తొలగించిన తర్వాతే పన్నీర్‌సెల్వం, ఎడప్పాడి పార్టీ నాయకులుగా ఎదిగారని, కనుక తన తొలగింపు చెల్లదంటూ కేసు వేశానని, తనలాగే 27 వేలమంది సభ్యులు ఆ కేసులో పిటిషనర్లుగా చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కేసీ పళనిస్వామి పిటిషన్‌లో వివరించారు. ఆయన తరఫు న్యాయవాది త్యాగేశరన్‌ వాదనలు వినిపిస్తూ.. అన్నాడీఎంకే సంస్థాగత ఎన్నికల ప్రక్రియను ఐదు రోజుల్లోగా ముగించాలని ప్రకటించడం పార్టీ నియమ నిబంధనలకు వ్యతిరేకమన్నారు. అన్నాడీఎంకే తరఫున హాజరైన న్యాయవాదులు విజయ్‌నారాయణన్‌, అరవింద్‌ పాండ్యన్‌, సతీష్‌ పరాశరన్‌ వాదిస్తూ మూడేళ్లుగా పార్టీ సంబంధం లేని కేసీ పళనిస్వామి పార్టీ ఎన్నికలను వ్యతిరేకిస్తూ ఎలా పిటిషన్‌ వేయగలరని ప్రశ్నించారు. అంతే కాకుండా పళనిస్వామి తన తొలగింపును వ్యతిరేకిస్తూ వేసిన పిటిషన్‌ సివిల్‌ కోర్డులో విచారణ పెండింగ్‌లో ఉందని, ఆ కేసులో తొలగింపును రద్దు చేస్తూ కోర్టు తీర్పు వెలువరిస్తే పార్టీపై హైకోర్టులో పిటిషన్‌ వేయడానికి అర్హత కలిగి ఉంటారని వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాద ప్రతివాదనల అనంతరం హైకోర్టు అన్నాడీఎంకే ఎన్నికలపై స్టే విధించ లేమంటూ ప్రకటించి కేసు తదుపరి విచారణను జనవరి ఏడో తేదీకి వాయిదా వేసింది.


కార్యకర్తను తరిమిన నేతలు...

అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద శుక్రవారం ఉదయం నామినేషన్‌ వేయడానికి వెళ్ళి న సీనియర్‌ కార్యకర్తకు చేదు అనుభవం ఎదురైంది. స్థానిక ఓట్టేరికి చెందిన ఓంపొడి సి.ప్రసాద్‌ అన్నాడీఎంకే సమన్వయకర్త పదవికి పోటీ చేయడానికి పార్టీ కార్యాలయానికి వెళ్ళారు. దరఖాస్తు ఫారం కొనుగోలు చేయడానికి కౌంటర్‌ వద్దకు వెళ్లగా ఆయనకు దరఖాస్తు ఇవ్వలేదు. దీంతో ఆగ్రహం చెందిన ఓంపొడి సి. ప్రసాద్‌ పాత్రికేయులతో మాట్లాడుతూ పార్టీ సమన్వయకర్త, ఉప సమన్వయకర్త పదవులకు ఐదేళ్లకు పైగా పార్టీ సభ్యత్వం కలిగినవారు పోటీ చేయవచ్చునని అధిష్టానవర్గం ప్రకటించిందని, అయితే తాను పోటీ చేయడానికి దరఖాస్తు అడిగితే ఇవ్వలేదని, ఈ ఎన్నికలు చట్టవ్యతిరేకంగా జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రసాద్‌ మీడియా ప్రతినిధుల ఎదుట మాట్లాడుతుండటం గమనించిన పార్టీ స్థానిక నేతలు, కార్యకర్తలు కలిసి ఆయనను తరిమికొట్టారు. ఈ సంఘటనపై ఆయన రాయపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.


Updated Date - 2021-12-04T15:33:58+05:30 IST