- ఎంజీఆర్ సమాధి వద్ద అన్నాడీఎంకే నేతల శపథం
- పురట్చి తలైవర్‌కు నివాళి
చెన్నై: వచ్చే యేడాది ఫిబ్రవరిలో జరుగనున్న కార్పొరేషన్, మునిసిపాలిటీ ఎన్నికల్లో కలసికట్టుగా ఘనవిజయం సాధించేందుకు కార్యకర్తలంతా కృషి చేయాలని అన్నాడీఎంకే నేతలు శపథం చేశారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్ 34వ వర్థంతి సందర్భంగా శుక్రవారం ఉదయం ఆయన సమాధి వద్ద పార్టీ నేతలు ఎడప్పాడి పళనిస్వామి, ఒ.పన్నీర్‌సెల్వం తదితరులు పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఈ కార్యక్రమం కోసం ఎంజీఆర్ సమాధిని పూలతో అలంకరించారు. వేలాదిమంది పార్టీ కార్యకర్తలతో పార్టీ నేతలు సమాధి వద్దకు వెళ్ళి ఘననివాళులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రిసీడియం చైర్మన్ తమిళ్‌మగన్ హుసేన్, డిప్యూటీ సమన్వయకర్తలు కేపీ మునుసామి, వైద్యలింగం, మాజీ మంత్రులు కేఏ సెంగోట్టయ్యన్, డి.జయకుమార్, నత్తం విశ్వనాధన్, సెల్లూరు రాజు, వేలుమణి, తంగమణి, వలర్మతి, గోకుల ఇందిరా, బెంజమిన్, మాఫాయ్ పాండ్యరాజన్, ఓఎస్ మణియన్, మనోజ్‌పాండ్యన్, పార్టీ జిల్లా శాఖల నాయకులు బాలగంగా, వెంకటేష్‌బాబు, ఆదిరాజారామ్, వీఎన్ రవి, ఆర్‌ఎస్ రాజేష్, కేపీ కందన్, అశోక్, మాజీ శాసనసభ్యుడు వి.అలెగ్జాండర్ తదితరులు ఎంజీఆర్ సమాధి వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంజీఆర్ సమాధి ప్రాంగణం సమీపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేకవేదిక వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఎంజీఆర్ కీర్తి ప్రతిష్టలను పెంపొందించేందుకు పాటుపడదామని, ఎంజీఆర్ అడుగుజాడలలో నడిచి ఆయన ఆశయాలను నెరవేరుద్దామని మాజీ మంత్రి వైగై సెల్వన్ ప్రతిజ్ఞ చేయించారు.
శశికళ, దినకరన్ నివాళి...
అమ్మామక్కల్ మున్నేట్ర కళగం నాయకుడు టీటీవి దినకరన్ రాయపేటలోని పార్టీ కార్యాలయంలో జరిగిన పెరియార్, ఎంజీఆర్ వర్థంతి నివాళి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇరువురు దివంగత నేతల చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. శశికళ టి.నగర్ నివాసగృహంలో ఎంజీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు ఎస్.తిరునావుక్కరసర్ మెరీనాబీచ్‌లో ఎంజీఆర్ సమాధి వద్ద నివాళులర్పించారు.
ఇవి కూడా చదవండి
