thefting: అన్నాడీఎంకే కార్యాలయ పత్రాలు, దస్తావేజుల చోరీ

ABN , First Publish Date - 2022-07-24T13:45:14+05:30 IST

స్థానిక రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం ‘ఎంజీఆర్‌ మాళిగై’ వద్ద జరిగిన కార్యకర్తల ఘర్షణ సందర్భంగా ఆ కార్యాలయపు భవనాని

thefting: అన్నాడీఎంకే కార్యాలయ పత్రాలు, దస్తావేజుల చోరీ

- జయ కానుక వస్తువులు, ఆర్సీ బుక్‌లు మాయం 

- పోలీసులకు సీవీ షణ్ముగం ఫిర్యాదు


చెన్నై, జూలై 23 (ఆంధ్రజ్యోతి): స్థానిక రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం ‘ఎంజీఆర్‌ మాళిగై’ వద్ద జరిగిన కార్యకర్తల ఘర్షణ సందర్భంగా ఆ కార్యాలయపు భవనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌(Registration) పత్రాలు, పలు నగరాల్లోని పార్టీ కార్యాలయాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ పత్రాలు చోరీకి గురైనట్లు ఆ పార్టీకి చెందిన ఎంపీ, మాజీ మంత్రి(Former Minister) సీవీ షణ్ముగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 11న మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, అధ్యక్షతన వానగరంలో సర్వసభ్యమండలి సమావేశం జరుగుతున్న సమయంలో మరో మాజీ ముఖ్యమంత్రి ఒ. పన్నీర్‌సెల్వం రాయపేటలోని పార్టీ కార్యాలయానికి వెళ్ళారు. ఆ సందర్భంగా ఓపీఎస్‌(Ops) వర్గానికి చెందిన కార్యకర్తలు పార్టీ కార్యాలయం, గదుల తలుపులను ఇనుపరాడ్లతో తాళాలను పగులగొట్టి తెరిచారు. కార్యకర్తలంతా కార్యాలయంలోని గదుల్లో బీభత్సకాండ నిర్వహించారు. ఆ సందర్భంగా ఈపీఎస్‌, ఓపీఎస్‌ వర్గాలకు చెందిన కార్యకర్తలు ఘర్షణపడటంతో ఆ కార్యాలయానికి రెవెన్యూ(Revenue) అధికారులు పెట్టిన సీలును హైకోర్టు ఉత్తర్వు ప్రకారం తొలగించి పార్టీ తాళాలను ఈపీఎస్‌ వర్గీయులకు అందజేసిన విషయం తెలిసిందే. రెండు రోజులకు ముందు సీవీ షణ్ముగం ఆ కార్యాలయం లోపలకు వెళ్ళి చూసినప్పుడు అన్ని గదుల్లో బీరువాలు, ఫర్నీచర్‌ ధ్వంసమై ఉన్నాయి. అంతే కాకుండా పార్టీ కార్యాలయం పైఅంతస్తు గదిలో భద్రపరచిన మాజీ ముఖ్యమంత్రి జయలలిత(Jayalalita)కు సంబంధించిన కానుక వస్తువులైన వెండి రాజదండం, శూలాయుధం తదితర విలువైన వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈపీఎస్‌ ఆదేశం ప్రకారం సీవీ షణ్ముగం శనివారం ఉదయం రాయపేట పోలీసుస్టేషన్‌కు వెళ్ళి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో గుర్తుతెలియని దుండగులు పార్టీ కార్యాలయంలోని బీరువాలను పగులగొట్టి వాటిలో భద్రపరచిన అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం రిజిస్ట్రేషన్‌ పత్రం (మూల పత్రం), కోయంబత్తూరు, తిరుచ్చి, పుదుచ్చేరి నగరాల్లోని పార్టీ కార్యాలయాల రిజిస్ట్రేషన్‌ పత్రాలు, రూ.31 వేల నగదు, రెండు కంప్యూటర్‌లు, వెండి శూలాయుధం, వెండి రాజదండం తదితర విలువైన కానుకలు, స్వాతంత్య్ర సమరయోధుడు ముత్తురామలింగదేవర్‌ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ధరింపజేసే బంగారు కవచాలకు సంబంధించిన దస్తావేజులు చోరీకి గురైనట్లు పేర్కొన్నారు. ఇదే విధంగా పార్టీ నాయకులు, నిర్వాహకులు ఉపయోగిస్తున్న 37 వాహనాలకు సంబంధించిన ఆర్‌సీ బుక్కులు, వాటి కొనుగోలు పత్రాలు, అన్నా కార్మికవర్గం ట్రస్టు పత్రాలు సహా పలు కీలకమైన దస్తావేజులన్నీ చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేశారు. వీటన్నింటినీ ఓపీఎస్‌ వర్గీయులే దోచుకెళ్ళారని సీవీ షణ్ముగం ఆ ఫిర్యాదులో ఆరోపించారు.

Updated Date - 2022-07-24T13:45:14+05:30 IST