అన్నా డీఎంకేలో అదే స్తబ్దత!

ABN , First Publish Date - 2022-06-18T13:57:09+05:30 IST

ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకేలో ఏకనాయకత్వంపై చెలరేగిన వివాదం ఇంకా కొనసాగుతూనే వుంది. పార్టీలో తనకు తగినంత బలంలేకపోవడంతో

అన్నా డీఎంకేలో అదే స్తబ్దత!

                             నేడు జిల్లా నేతలతో ఈపీఎస్‌, ఓపీఎస్‌ వేర్వేరు మంతనాలు


చెన్నై, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకేలో ఏకనాయకత్వంపై చెలరేగిన వివాదం ఇంకా కొనసాగుతూనే వుంది. పార్టీలో తనకు తగినంత బలంలేకపోవడంతో ‘జోడు పదవులే’ మంచిదని అన్నాడీఎంకే సమన్వయకర్త ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్‌) చెబుతుండగా, పార్టీపై పూర్తి పట్టు సాధించిన ఉపసమన్వయకర్త ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌) మాత్రం ఏకనాయకత్వమే కావాలంటూ అధినేతగా ఎదిగేందుకు తహతహలాడుతున్నారు. అందుకే ఎవరికి వారు తమ వ్యూహం ఫలించేలా ఎత్తులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఈపీఎస్‌, ఓపీఎస్‌ శనివారం వేర్వేరుగా తమ అనుయాయులుగా ముద్రపడిన జిల్లా కార్యదర్శులతో సమావేశం కానున్నారు. ఓ వైపు ఈ నెల 23న నిర్వహించనున్న పార్టీ సర్వసభ్య మండలి సమావేశానికి పార్టీ సీనియర్‌ నేతలంతా ఏర్పాట్లు చేస్తున్నారు.


జిల్లా నేతలకు పిలుపు...

అన్నాడీఎంకే పార్టీ నేతలు ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్‌సెల్వం జిల్లా కార్యదర్శులను నగరానికి రమ్మంటూ వేర్వేరుగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. నాలుగు రోజుల క్రితం జిల్లా కార్యదర్శులంతా పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశానికి హాజరై స్వస్థలాలకు తిరిగి వెళ్ళారు. కానీ ఇంతలోనే నగరానికి రమ్మంటూ నాయకులిద్దరూ వేర్వేరుగా ఆహ్వానించడంతో జిల్లా శాఖ కార్యదర్శులు అయోమయంలో పడిపోయారు. శనివారం వివిధ జిల్లాల నుంచి జిల్లా కార్యదర్శులు నగరానికి విచ్చేయనున్నారు. వీరిలో పన్నీర్‌సెల్వంకు మద్దతునిస్తున్న జిల్లా కార్యదర్శులు నగరంలోని ప్రైవేటు గెస్ట్‌హౌస్ లో సమావేశమవుతారు. ఎడప్పాడి వర్గానికి చెందిన జిల్లా కార్యదర్శులు ఆయన నివాసగృహంలో సమావేశం కానున్నారు.


తంబిదురై రాయబారం...

పార్టీలో ఏకనాయకత్వ వివాదంపై అన్నాడీఎంకే సమన్వయకర్త ఒ.పన్నీర్‌సెల్వం శుక్రవారం ఉదయం తన మద్దతుదారులతో మంతనాలు జరిపారు. మూడు రోజులుగా ఆయన మద్దతుదారులతో చర్చలు జరుపుతూనే ఉన్నారు. శుక్రవారం జరిగిన చర్చల్లో పార్టీ నేతలు వైద్యలింగం, మైత్రేయన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత వైద్యలింగం విలేఖరులతో మాట్లాడుతూ.. ఏకనాయకత్వంపై సాగుతున్న వివాదం త్వరగా సమసిపోవాలనే అందరూ కోరుకుంటున్నారని చెప్పారు. పన్నీర్‌సెల్వం తన నిర్ణయాన్ని ప్రకటించడంతో ఎడప్పాడి కూడా తన మనసులోని మాటను త్వరలో వెల్లడిస్తారని ఆశిస్తున్నామని చెప్పారు. పన్నీర్‌సెల్వం సంతకం లేకుండా పార్టీ పదవుల్లో ఎలాంటి మార్పులు చేయలేరని పరోక్ష హెచ్చరిక చేశారు. ఇదిలా వుండగా ఎడప్పాడి, పన్నీర్‌సెల్వం మధ్య రాజీ కుదిర్చేందుకు మాజీ ఎంపీ తంబిదురై రంగంలోకి దిగారు. గురువారం సేలంలో ఎడప్పాడి పళనిస్వామిని కలుసుకుని చర్చలు జరిపారు. వీలయినంత త్వరగా ఏకనాయకత్వంపై సాగుతున్న వివాదానికి స్వస్తి పలకాలని తంబిదురై ఎడప్పాడికి సూచించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తంబిదురై శుక్రవారం గ్రీన్‌వేస్ రోడ్డులోని పన్నీర్‌సెల్వం నివాసగృహానికి చేరుకున్నారు. వీరిరువురూ ప్రత్యేకంగా సమావేశమై పార్టీలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై సమగ్రంగా చర్చించినట్లు సమాచారం. 


ఆగని పోస్టర్ల యుద్ధం...

ఏకనాయకత్వంపై చెలరేగుతున్న వివాదాన్ని పరిష్కరించేందుకు సీనియర్లు ప్రయత్నిస్తుండగా రాష్ట్రంలో శుక్రవారం ఎడప్పాడి, పన్నీర్‌సెల్వం వర్గీయులు అంటించిన పోస్టర్లు సంచలనం సృష్టిస్తున్నాయి. ఎడప్పాడి పార్టీ ప్రధాన కార్యదర్శి అంటూ ముద్రించిన పోస్టర్లు తిరువణ్ణామలై జిల్లా అంతటా వెలిశాయి. తిరువణ్ణామలై జిల్లా ఆరణిలోని ఓ ఆలయ కుంభాభిషేకంలో పాల్గొనేందుకు వెళ్ళిన ఎడప్పాడిని స్వాగతిస్తూ అతికించిన బ్యానర్లు, పోస్టర్లలో ఆయనను ప్రధాన కార్యదర్శిగానే ముద్రించారు. ఇదిలా ఉండగా కొన్ని చోట్ల పన్నీర్‌సెల్వంకు మద్దతుగా అతికించిన పోస్టర్లను గుర్తు తెలియని వ్యక్తులు చింపివేయడం పట్ల ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఇద్దరూ తప్పుకుంటే సరి - మాజీ ఎమ్మెల్యే

అన్నాడీఎంకేలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభానికి పార్టీ నేతలు ఎడప్పాడి, పన్నీర్‌సెల్వం కారణమని, ఆ ఇద్దరూ పదవుల నుంచి తప్పుకుంటే మంచిదని ఆ పార్టీ మాజీ శాసనసభ్యుడు ఆరుకుట్టి అన్నారు. కోయంబత్తూరులో శుక్రవారం ఉదయం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ... అన్నాడీఎంకే నాయకులు ఇద్దరూ పట్టింపులకు పోకుండా పార్టీ కాపాడే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. పార్టీ అధ్యక్షపదవి, ప్రధాన కార్యదర్శి పదవి పార్టీ కార్యకర్తల నిర్ణయం మేరకే జరుగుతుందని ఎడప్పాడి, పన్నీర్‌సెల్వం ప్రకటించడం వింతగా ఉందన్నారు. పార్టీలో సమన్వకర్త, ఉప సమన్వయకర్త పదవులను వీరిద్దరూ కార్యకర్తల అభిప్రాయం మేరకే పొందారా.. అని ఆయన ప్రశ్నించారు. పార్టీ శ్రేయస్సు దృష్ట్యా వీరిద్దరూ తప్పుకుంటేనే మంచిదని అన్నారు. 



Updated Date - 2022-06-18T13:57:09+05:30 IST