అన్నాడీఎంకేలో ‘గుట్కా’ గుబులు !

ABN , First Publish Date - 2022-07-21T14:06:31+05:30 IST

గుట్కా, పాన్‌ మసాలపై 2013లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయినా రాష్ట్రంలో ఈ వ్యాపారం గుట్టుగా

అన్నాడీఎంకేలో ‘గుట్కా’ గుబులు !

- మాజీ మంత్రులు విజయభాస్కర్‌, రమణలకు బిగుసుకుంటున్న ఉచ్చు

- కేసు నమోదుకు ప్రభుత్వ అనుమతి కోరిన సీబీఐ

 

కొత్త నాయకత్వంలో ముందుకు సాగేందుకు సిద్ధమవుతున్న అన్నాడీఎంకేలో ‘గుట్కా గుబులు’ రేగుతోంది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు మాజీ మంత్రులు నిందితులుగా వున్న గుట్కా కుంభకోణంలో కేసు నమోదు చేసేందుకు అనుమతివ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సీబీఐ రాసిన లేఖ ఆ పార్టీలో ప్రకంపనలు పుట్టిస్తోంది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే, దానిని కేంద్రం కూడా ఆమోదిస్తే మాజీ మంత్రులైన సి.విజయభాస్కర్‌, బీవీ రమణ సహా పలువురు పోలీసు ఉన్నతాధికారుల చుట్టూ ఉచ్చు బిగుసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలిలా...                                   


ప్యారీస్‌(చెన్నై), జూలై 20: గుట్కా, పాన్‌ మసాలపై  2013లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయినా రాష్ట్రంలో ఈ వ్యాపారం గుట్టుగా సాగుతుండడంతో 2016 జూలైలో ఐటీ అధికారులు చెన్నైలోని గుట్కా తయారీదారుల నివాసాలు, గోదాముల్లో తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో కీలకమైన దస్తావేజులు, ఓ డైరీ స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో కీలక పదవుల్లో వున్న కొంతమంది నేతల పేర్లు ఆ డైరీలో కనిపించడంతో ఐటీ శాఖ సైతం దిగ్ర్భాంతి చెందింది. దీంతో ఆ డైరీని రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన ఐటీ అధికారులు.. తగిన చర్యలు చేపట్టాలని సిఫారసు చేశారు. ఈ నేపథ్యంలో గుట్కా అవినీతికి సంబంధించి సీబీఐ విచారణ కోరుతూ మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు కాగా, అందుకు న్యాయస్థానం అంగీకరించింది. ఆ మేరకు సీబీఐ అధికారులు కేసు నమోదు చేసి.. ఐటీ అధికారులు సమర్పించిన డైరీ ఆధారంగా తనిఖీలు కూడా నిర్వహించారు. ఇందులో గుట్కా విక్రయాల ద్వారా వచ్చిన లాభాలు పెద్దల చేతులు మారినట్లు తేలింది. ఈ వ్యవహారంతో మాజీ మంత్రులు సి.విజయభాస్కర్‌, బీవీ రమణ, చెన్నై పోలీసు కమిషనర్లు రాజేంద్రన్‌, జార్జ్‌ తదితరులకూ సంబంధాలున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో సుమారు రూ.40 కోట్లకు పైగా చేతులు మారినట్లు కూడా డైరీ ద్వారా తెలిసింది. దీంతో సీబీఐతో పాటు ఈడీ అధికారులు కూడా రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా గుట్కా తయారీదారుల నివాసాల్లో తనిఖీ జరిపి సుమారు రూ.240 కోట్ల విలువైన ఆస్తులను స్తంభింపజేశారు. అనంతరం 2018లో ఈ కేసులో నిందితులుగా వున్న ఆరుగురిపై సీబీఐ చార్జ్‌షీటు దాఖలు చేసింది. కాగా రెండో చార్జ్‌షీటు దాఖలు చేసేందుకు కూడా సీబీఐ సిద్ధమవుతోంది. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో గత కొన్ని నెలలుగా ఈ కేసులో ఎలాంటి పురోగతి లేకుండాపోయింది. ఈ నేపథ్యంలో సీబీఐ రాష్ట్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాసింది. మాజీ మంత్రులు సి.విజయభాస్కర్‌, బీవీ రమణ, మాజీ పోలీసు కమిషనర్లు జార్జ్‌, రాజేంద్రన్‌ సహా 12మందిపై కేసు నమోదు చేసేందుకు అనుమతి వ్వాలని ఆ లేఖలో కోరింది. దీంతో అన్నాడీఎంకేతో పాటు పోలీసువర్గాల్లోనూ ప్రకంపనలు మొదలయ్యాయి. ఒకవేళ సీబీఐ కేసు నమోదుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తే.. కేంద్రప్రభుత్వం కూడా దానిని పరిశీలించి ఆమోదించాల్సివుంటుంది. కేంద్రం స్పందన మేరకే సీబీఐ తదుపరి చర్యలకు దిగే అవకాశముంది. ఒకవేళ సీబీఐ తదుపరి చర్యలకు దిగితే ఈ మొత్తం నిందితుల మెడకు ఉచ్చు బిగుసుకునే అవకాశముంది.



Updated Date - 2022-07-21T14:06:31+05:30 IST