అన్నాడీఎంకే చరిత్రలో ఇదే తొలిసారి

ABN , First Publish Date - 2022-07-12T15:41:48+05:30 IST

అన్నాడీఎంకే ఐదు దశాబ్దాల చరిత్రలో పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద ఇంత పెద్ద ఎత్తున హింసాకాండ చోటుచేసుకోవడం ఇదే తొలిసారి. పార్టీలో ఇంతకు ముందు

అన్నాడీఎంకే చరిత్రలో ఇదే తొలిసారి

                    - కార్యకర్తల దాడులతో దద్దరిల్లిన పార్టీ కార్యాలయం


ప్యారీస్‌(చెన్నై), జూలై 11: అన్నాడీఎంకే ఐదు దశాబ్దాల చరిత్రలో పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద ఇంత పెద్ద ఎత్తున హింసాకాండ చోటుచేసుకోవడం ఇదే తొలిసారి. పార్టీలో ఇంతకు ముందు ఎన్నోసార్లు తీవ్ర వివాదాలు చోటుచేసుకున్నప్పటికీ ఒకరినొకరు గాయపడేలా ఘర్షణ పడిన సందర్భాలు లేనేలేవు. ఎంజీఆర్‌ మృతి తర్వాత జయ, జానకి వర్గాలంటూ పార్టీ రెండుగా చీలినప్పుడు కూడా ఇరువర్గాల చెందిన కార్యకర్తలు ఘర్షణకు దిగలేదు. జయలలిత బతికున్నప్పుడు పార్టీ కార్యాలయం వద్ద స్వల్ప ఘర్షణకు కూడా తావులేని విధంగా ఆ చోట కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉండేవి. ప్రస్తుతం పార్టీ సర్వసభ్యమండలి సమావేశానికి పార్టీ సభ్యులంతా వెళ్ళిపోవటంతో అదను చూసి ఓపీఎస్‌ వర్గీయులు పార్టీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించటం తీవ్ర హింసాకాండకు దారితీసింది.


ఏడు సెక్షన్ల కింద కేసు నమోదు

స్థానిక రాయపేటలోని అన్నాడీఎంకే కార్యాలయం వద్ద ఈపీఎ్‌స-ఓపీఎస్‌ మద్దతుదారులు ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకొని ఘర్షణలకు పాల్పడిన సందర్భంగా రాయపేట పోలీసులు ఏడు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. పోలీసు ఇన్‌స్పెక్టర్‌ ఫిర్యాదు మేరకు ఆర్డీవో సాయివర్ధిని వెళ్లి సీలు వేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో విలేఖరులతో మాట్లాడుతూ, అన్నాడీఎంకేలో రెండు వర్గాలు విధ్వంస చర్యలకు పాల్పడడం వల్ల శాంతిభద్రతలు దృష్టిలో ఉంచుకొని ఆ కార్యాలయానికి సీలు వేసినట్లు తెలిపారు. న్యాయస్థానం ఉత్తర్వులు జారీ అయ్యే వరకు ఆ కార్యాలయం తమ స్వాధీనంలో ఉంటుందని, ఉద్రిక్తత కారణంగా 144 సెక్షన్‌ పార్టీ కార్యాలయం ప్రాంతంలో విధించినట్లు పేర్కొన్నారు.



Updated Date - 2022-07-12T15:41:48+05:30 IST