ప్రజలపై పెనుభారం మోపారు...

ABN , First Publish Date - 2022-04-06T14:08:11+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఆస్తిపన్ను పెంచినందుకు నిరసనగా ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే మంగళవారం ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించింది. చెన్నైలో జరిగిన

ప్రజలపై పెనుభారం మోపారు...

- ఆస్తి పన్ను పెంపునకు వ్యతిరేకంగా అన్నాడీఎంకే రాష్ట్రవ్యాప్త ఆందోళన

- చెన్నైలో ఓపీఎస్‌, తిరుచ్చిలో ఈపీఎస్‌


చెన్నై: రాష్ట్ర ప్రభుత్వం ఆస్తిపన్ను పెంచినందుకు నిరసనగా ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే మంగళవారం ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించింది. చెన్నైలో జరిగిన ఆందోళనకు అన్నాడీఎంకే సమన్వయకర్త ఒ.పన్నీర్‌సెల్వం, తిరుచ్చిలో ఉపనసమన్వయకర్త, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వం వహించారు. కోవై సహా పలు నగరాల్లో జరిగిన నిరసన ప్రదర్శనల్లో వేలాదిమంది కార్యకర్తలు పాల్గొన్ని డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన మేరకు రాష్ట్రంలో ఆస్తి పన్ను పెంచుతున్నట్లు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కార్పొరేషన్లు,, మున్సిపాలిటీల్లో ఈ ఆస్తిపన్నును 150 శాతం వరకు పెంచారంటూ ప్రధాన ప్రతిపక్ష నేత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు అన్నాడీఎంకే పిలుపునివ్వడంతో మంగళవారం ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకో జరిగాయి.


వళ్ళువర్‌కోట్టం వద్ద..

స్థానిక వళ్లువర్‌ కోట్టం వద్ద అన్నాడీఎంకే సమన్వయకర్త ఒ.పన్నీర్‌సెల్వం నేతృత్వంలో జరిగిన ఆందోళళలో ఎనిమిది జిల్లాల నాయకులు,  వేలాదిమంది కార్యకర్తలు తరలివచ్చారు. జిల్లా నాయకులు వీఎన్‌ రవి, వెంకటేశ్‌బాబు, ఆర్‌ఎస్‌ రాజేశస్‌, టి.నగర్‌ సత్యా, వేళచ్చేరి అశోక్‌, కేపీ కందన్‌, ఆదిరాజారామ్‌ ధర్నాలో పాల్గొన్నారు. ఈ ధర్నాను  పన్నీర్‌సెల్వం ప్రారంభించి మాట్లాడుతూ కరోనా వైరస్‌ పూర్తిగా కట్టడి అయ్యేంతవరకూ ఆస్తి పన్ను పెంచబోమంటూ ప్రకటించిన డీఎంకే ప్రభుత్వం ప్రస్తుతం 150 శాతం వరకూ ఆస్తిపన్నును అధికం చేసి ప్రజలపై పెనుభారాన్ని మోపిందని ఆరోపించారు. అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో ఓ సారి ఆస్తిపన్నును పెంచినప్పుడు స్టాలిన్‌ నిరసన వ్యక్తం చేస్తే ఆ ప్రతిపాదనను తాము ఉపసంహరించుకున్నామని, ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే కోరికమేరకు ఆస్తిపన్ను పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటారా అని ఆయన ప్రశ్నించారు. ఈ ధర్నాలో అఖిలభారత ఎంజీఆర్‌ మండ్రం నాయకుడు తమిళ్‌మగన్‌ హుసేన్‌, మాజీ ఎంపీలు ఎస్‌ఆర్‌ విజయకుమార్‌, డాక్టర్‌ జయవర్థన్‌, పార్టీ ప్రముఖులు రాయపురం మనోహర్‌, మహిళావిభాగం నాయకురాలు వలర్మతి, వ్యవస్థాపక కార్యదర్శి గోకుల ఇందిరా, జేసీడీ ప్రభాకరన్‌, నటి వింధ్యా తదితరులు పాల్గొన్నారు.


తిరుచ్చిలో...

తిరుచ్చినగరంలో ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలో భారీ స్థాయిలో ధర్నా నిర్వహించారు. సుమారు రెండువేలమంది కార్యకర్తలు డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎడప్పాడి మాట్లాడుతూ రెండేళ్లుగా రాష్ట్ర ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో సతమవుతున్నారని, ఈ పరిస్థితులలో ఆస్తిపన్నును పెంచి వారిపై అదనపు వ్యయభారాన్ని మోపడం గర్హనీయమన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో అక్రమపద్ధతుల్గో గెలిచిన డీఎంకే ..తమ ప్రభుత్వానికి ప్రజలు మద్దతిచ్చారని గొప్పలు చెప్పుకుంటూ వారిపై ఆస్తి పన్నుల భారం మోపడం న్యాయమేనా అని ఎడప్పాడి ప్రశ్నించారు. 



Updated Date - 2022-04-06T14:08:11+05:30 IST