23న అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం

ABN , First Publish Date - 2022-06-03T14:39:55+05:30 IST

అన్నాడీఎంకే సర్వసభ్య మండలి సమావేశం ఈ నెల 23న జరుగనుంది. ఈ మేరకు ఆ పార్టీ ఉప సమన్వయకర్త, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి

23న అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం

                  - పార్టీ భవిష్యత్‌ కార్యాచరణపై వ్యూహరచన


చెన్నై, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకే సర్వసభ్య మండలి సమావేశం ఈ నెల 23న జరుగనుంది. ఈ మేరకు ఆ పార్టీ ఉప సమన్వయకర్త, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, సమన్వయకర్త ఒ.పన్నీర్‌సెల్వం గురువారం ప్రకటన విడుదల చేశారు. ప్రతియేటా అన్నాడీఎంకే కార్యాచరణ మండలి, సర్వసభ్య మండలి సమావేశాలను నిర్వహించడం ఆనవాయితీ. 2020 డిసెంబర్‌లో ఈ  సమావేశాలు జరిగాయి. ఆ తర్వాత కరోనా లాక్‌డౌన్‌ కారణంగా గతేడాది సమావేశం నిర్వహించలేకపోయారు. గతేడాది జనవరిలో పార్టీ కార్యాచరణ మండలి సమావేశం మాత్రమే జరిపారు. ఈ నేపథ్యంలో పార్టీ సర్వసభ్య మండలి సమావేశాన్ని జరుపుకునేందుకు యేడాది గడువు కోరుతూ అన్నాడీఎంకే అధిష్టానం కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేయగా, కమిషన్‌ అనుమతిచ్చింది.. మూడు నెలల క్రితం సర్వసభ్య మండలి సమావేశాన్ని జరిపేందుకు సిద్ధమవుతుండగా పార్టీ సంస్థాగత ఎన్నికలను జరపాల్సి వచ్చింది. మూడు నెలలుగా పార్టీ సంస్థాగత ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఎడప్పాడి పళనిస్వామి, ఒ.పన్నీర్‌సెల్వంను ఉపసమన్వయకర్త, సమన్వయకర్తలుగా ఎన్నుకున్నారు. ఇదే విధంగా జిల్లా నాయకులు, నగరశాఖల నాయకుల ఎన్నికతో ఇటీవల సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో పార్టీ సర్వసభ్య మండలి, కార్యాచరణ మండలి సమావేశాలు ఈ నెల 23న నగరశివారు ప్రాంతమైన వానగరంలో జరుగుతుందని పార్టీ నేతలు ఈపీఎస్‌, ఓపీఎస్‌ గురువారం సంయుక్తంగా ప్రకటించారు. ఈ సమావేశానికి తాత్కాలిక ప్రిసీడియం చైర్మన్‌ డాక్టర్‌ తమిళ్‌మగన్‌ హుసేన్‌ అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశాలకు 2500 మంది సర్వసభ్య మండలి సభ్యులు, 500 మంది కార్యాచరణ మండలి సభ్యులు, 1000 మంది ప్రత్యేక ఆహ్వానితులు హాజరుకానున్నారు. ఈ సమావేశాల్లో పార్టీ భవిష్యత్‌ కార్యాచరణ ప్రణాళికలపై సమగ్రంగా చర్చించనున్నారు.. ప్రస్తుతం పార్టీలో నాయకుల మధ్య జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలను నిరోఽధించే దిశగా చర్యలు చేపట్టనున్నారు. అదే సమయంలో ఎడప్పాడి, పన్నీర్‌సెల్వంలకు మరిన్ని అధికారాలు కల్పించేందుకు కూడా ఈ సమావేశాల్లో నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. రెండేళ్ల విరామం తర్వాత సర్వసభ్యమండలి సమావేశం జరుగనుండటంతో పార్టీ శ్రేణులలో ఉత్సాహం నెలకొంది.

Updated Date - 2022-06-03T14:39:55+05:30 IST