డిష్యూం.. డిష్యూం

ABN , First Publish Date - 2022-07-12T14:07:57+05:30 IST

స్థానిక రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం రణరంగంలా మారింది. ఓపీఎస్‌ వర్గీయుల దాడులు, కార్యకర్తల హాహాకారాలు, వాహనాల

డిష్యూం.. డిష్యూం

- రణరంగంలా అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం

- కార్యకర్తలపై ఓపీఎస్‌ వర్గీయుల దాడి

- రాళ్లు, కట్టెలతో వీరంగం 

- ఈపీఎస్‌ ఫొటోలకు నిప్పు

- కార్యాలయ తలుపులు పగులగొట్టి విధ్వంసం

- పోలీసుల లాఠీచార్జ్‌  

- భవనానికి సీలు


చెన్నై, జూలై 11 (ఆంధ్రజ్యోతి): స్థానిక రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం రణరంగంలా మారింది. ఓపీఎస్‌ వర్గీయుల దాడులు, కార్యకర్తల హాహాకారాలు, వాహనాల విధ్వంసం, పోలీసుల బూట్ల చప్పుళ్లు, అరుపులు, కేకలతో మరుభూమిని తలపించింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జ్‌ చేసి చెదరగొట్టారు. ఈ ఘటనలో పలువురు ఈపీఎస్‌ వర్గీయులతో పాటు ఇద్దరు పోలీసులు కూడా గాయపడ్డారు. కాగా ఆ ప్రాంతంలో ప్రస్తుతం 144 సెక్షన్‌ విధించారు. అంతేగాక ఘర్షణలకు నెలవైన కార్యాలయానికి రెవెన్యూ అధికారులు సీలు వేశారు. స్థానిక వానగరంలో అన్నాడీఎంకే సర్వసభ్యమండలి సమావేశం జరగడంతో నేతలంతా అక్కడికి తరలివెళ్లారు. అయితే కొంతమంది మాత్రం పార్టీ ప్రధాన కార్యాలయం వద్దకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఉదయం 7 గంటల ప్రాంతంలో స్థానిక గ్రీన్‌వే్‌స రోడ్డులోని ఓపీఎస్‌ నివాసం నుంచి సుమారు 500 మంది కార్యకర్తలు అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వద్దకు బయలుదేరారు. వారంతా అక్కడికి చేరుకున్న అనంతరం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఓపీఎస్‌ కూడా ఎన్నికల ప్రచార వాహనంలో పార్టీ కార్యాలయానికి బయలుదేరారు. ఆయన వాహనం వెంట శాసనసభ్యులు వైద్యలింగం, మనోజ్‌పాండ్యన్‌, మాజీ శాసనసభ్యుడు జేసీడీ ప్రభాకరన్‌ కూడా తమ కార్లలో పార్టీ ఆఫీసుకు చేరుకున్నారు. అదే సమయంలో అప్పటికే అక్కడున్న ఓపీఎస్‌ వర్గీయులు సాధారణ కార్యకర్తలపై దాడి మొదలుపెట్టారు. రాళ్లు, కర్రలతో చితగ్గొట్టారు. ఓ కార్యకర్త తల పగలగా, సుమారు 50 మంది గాయపడ్డారు. ఆ సమయంలో అక్కడే వాహనంలో కూర్చునివున్న ఓపీఎస్‌.. ఈ దాడిని చూస్తూవుండిపోయారు తప్ప, కనీసం వారించలేదు. ఆయన అనుచరుల దాడితో ఆ ప్రాంతంలోని కార్యకర్తలంతా కకావికలమైపోయారు. గాయాలతోనే కొంతమంది ఆ ప్రాంతం నుంచి పరుగులుపెట్టారు. అయితే దాడి జరుగుతున్నంతసేపూ పోలీసులు కూడా ప్రేక్షకపాత్ర వహించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. సుమారు అరగంటపాటు సాగిన ఈ దారుణకాండతో కార్యాలయ ప్రాంగణం ఖాళీ అయిందని నిర్ధారించుకున్నాక, ఓపీఎస్‌ తాపీగా వాహనం దిగారు. తన అనుచరులు రెండువైపులా రక్షణగా నిలబడగా పార్టీ కార్యాలయంలోకి అడుగుపెట్టారు. 


నేతల విగ్రహాల వద్ద నివాళి

మాజీ ముఖ్యమంత్రులు జయలలిత, ఎంజీఆర్‌ విగ్రహాలకు ఓపీఎస్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత కార్యాలయం లోపలికి వెళ్ళేందుకు సిద్ధమవుతుండగా కార్యకర్తలు ప్రధాన ద్వారానికి ఉన్న తాళాలను ఇనుపరాడ్లతో పగులగొట్టి తలుపులను తెరచి ఆయనకు స్వాగతం పలికారు. ఓపీఎస్‌, ఆయన మద్దతు దారులు వైద్యలింగం, మనోజ్‌ పాండ్యన్‌, జేసీడీ ప్రభాకరన్‌ తదితర నాయకులు పార్టీ కార్యాలయం లోపలకు వెళ్ళి పై అంతస్తులో ఉన్న హాల్లో ఆశీనులయ్యారు. కార్యాలయంపై అంతస్తు భవనంలోని హాల్లో ఉన్న ఎడప్పాడి ఫొటోలను ఓపీఎస్‌ మద్దతుదారులు తొలగించి వాటిని బాల్కనీ నుంచి కిందకు పారవేశారు. కార్యకర్తలు ఆ ఫొటోలను కాళ్లతోనే ధ్వంసం చేశారు. ఆ తర్వాత ఫొటోలకు నిప్పంటించారు. ఈ దాడిలో ఈపీఎస్‌ వర్గానికి చెందిన ఎంజీఆర్‌ యువజన విభాగం సంయుక్త కార్యదర్శి డాక్టర్‌ సునీల్‌, అమ్మాపేరవై నాయకుడు లోకనాథన్‌ తదితరులు గాయపడ్డారు. దీని గురించి డాక్టర్‌ సునీల్‌ మాట్లాడుతూ.. ప్రణాళికా బద్ధంగానే ఓపీఎస్‌ వర్గీయులు తమపై దాడి చేశారన్నారు. పోలీసులు దాడి చేసే వారిని వదిలేసి, తమపైనే దాడి చేయడం సిగ్గుచేటన్నారు. డీఎంకే పాలనలో ఇంత అన్యాయమా అని నిలదీశారు. ఇదిలా వుండగా ఈ ఘర్షణకు సంబంధించి ఈపీఎస్‌ వర్గానికి చెందిన నాయకులు రాయపేట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. ఆదివారం వరకూ ఆ కార్యాలయం వద్ద పదిమంది పోలీసులు భద్రతా విధుల్లో పాల్గొన్నారు. అయితే సోమవారం ఎనిమిది గంటల నుంచి పార్టీ కార్యాలయం వద్ద కాపలా కాయాల్సిన పోలీసులు పత్తాలేకుండా పోయారు. అయితే హింసాకాండ ముగిసే సమయానికి అక్కడికి చేరుకున్న సుమారు వందమంది పోలీసులు.. అక్కడున్న కార్యకర్తలపై లాఠీచార్జ్‌ చేసి, తరిమికొట్టారు. ఆ ప్రాంతంలో 144 నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.


ఆర్డీవో రాక

అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద ఘర్షణతో ఆర్డీవో సాయివర్ధిని, రెవెన్యూ అధికారి జగజ్జీవన్‌రామ్‌ అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కార్యాలయంలోపలకు వెళ్ళి అన్ని గదులను తనిఖీ చేశారు. సమావేశ హాల్లో ఆశీనులైన ఓపీఎస్‌ వద్దకెళ్లి, ఆఫీసుకు సీలు వేస్తున్నట్లు తెలిపారు. దాంతో కిందకు వచ్చిన ఓపీఎస్‌.. కొంతసేపు ధర్నా చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం అధికారులు.. కార్యాలయంలోని అన్ని గదులకు సీలు వేశారు.  అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం ఉన్న లాయిడ్స్‌రోడ్డులో కార్యకర్తల ఘర్షణ కారణంగా దుకాణాలను మూసివేశారు. దీంతో ఆ ప్రాంతంలో బంద్‌ దృశ్యాలు నెలకొన్నాయి. ఓపీఎస్‌ తరఫు కార్యకర్తలు చేత కట్టెలు, ఇనుపరాడ్లు పట్టుకుని అక్కడికి వరుసగా వస్తుండటాన్ని చూసిన వ్యాపారులు వెంటనే తమ దుకాణాలను మూసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ ఘర్షణలో పార్టీ కార్యాలయం ఎదుట నిలిచి ఉన్న బస్సు, ఓ లగ్జరీకారు ధ్వంసమయ్యాయి. కార్యకర్తలు రాళ్లు రువ్వటంతో ఈ రెండు వాహనాల అద్దాలు పగిలాయి. కాగా అన్నాడీఎంకే పార్టీ కార్యాలయానికి సీలు వేసిన వ్యవహారంపై చర్చించేందుకు ఈ నెల 27న ఓపీఎస్‌, ఈపీఎస్‌ వర్గాలను రావాల్సిందిగా పోలీసులు ఆహ్వానించినట్లు సమాచారం



Updated Date - 2022-07-12T14:07:57+05:30 IST