తొలగిన సీలు

ABN , First Publish Date - 2022-07-22T14:10:09+05:30 IST

స్థానిక రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం ‘ఎంజీఆర్‌ మాళిగై’ భవనానికి వేసిన సీలును హైకోర్టు తీర్పుమేరకు గురువారం ఉదయం

తొలగిన సీలు

- అన్నాడీఎంకే కార్యాలయం గదుల్లో ఫర్నిచర్‌ ధ్వంసం

- వెండి వస్తువుల మాయం?


చెన్నై, జూలై 21 (ఆంధ్రజ్యోతి): స్థానిక రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం ‘ఎంజీఆర్‌ మాళిగై’ భవనానికి వేసిన సీలును హైకోర్టు తీర్పుమేరకు గురువారం ఉదయం అధికారులు తొలగించారు. అన్ని గదులకు సంబంధించిన తాళాలను ఆ కార్యాలయం మేనేజర్‌ మహాలింగం, మాజీ మంత్రి సీవీ షణ్ముగంకు అప్పగించారు. అయితే ఆ కార్యాలయంలోని అన్ని గదుల్లో విధ్వంసకాండ దృశ్యాలను చూసి పార్టీ నేతలు తీవ్ర దిగ్ర్భాంతి చెందారు. ఈ నెల 11న మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి అధ్యక్షతన వానగరంలో సర్వసభ్యమండలి సమావేశం జరుగుతున్న సమయంలో అన్నాడీఎంకే కార్యాలయానికి వద్ద మరో మాజీ ముఖ్యమంత్రి ఒ పన్నీర్‌సెల్వం ఆయన మద్దతు దారులు వెళ్ళినప్పుడు కార్యకర్తలు పరస్పర దాడులకు దిగారు. దీంతో రెవెన్యూ అధికారులు ఆ కార్యాలయ భవనాన్ని మూసి సీలు వేశారు. ఈ నేపథ్యంలో పార్టీ ఆఫీసుకు వేసిన సీలును తొలగించేలా ఉత్తర్వు జారీచేయాలని పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి సతీ్‌షకుమార్‌ సీలును తొలగించి కార్యాలయాన్ని పార్టీ నిర్వాహకులకు అప్పగించాలని బుధవారం  తీర్పు చెప్పారు. పార్టీ కార్యాలయం తాళాలను తన తరఫున కార్యాలయపు మేనేజర్‌ మహాలింగంకు అప్పగించాలని ఎడప్పాడి కోరారు. ఆ మేరకు గురువారం ఉదయం మైలాపూరు తహసీల్దార్‌ జగజ్జీవన్‌రామ్‌ ఇతర అధికారులు అన్నాడీఎంకే కార్యాలయానికి చేరుకుని ప్రధానద్వారం, లోపలి గదులకు వేసిన సీలు తొలగించి తాళాలను మాజీ మంత్రి సీవీ షణ్ముగం, కార్యాలయ  మేనేజర్‌ మహాలింగంకు అప్పగించారు. 


అన్ని గదుల్లో విధ్వంసం...

ఈ నెల 11న జరిగిన కార్యకర్తల ఘర్షణ సందర్భంగా అన్నాడీఎంకే కార్యాలయంలోని అన్ని గదుల్లో దుండగులు చొరబడి నానాబీభత్సం సృష్టించినట్లు గురువారం ఉదయం ఆ గదులను పార్టీ నేతలు తెరచినప్పుడు అక్కడి దృశ్యాల ద్వారా రుజువైంది. కార్యాలయం సీలు తొలగించగానే సీవీషణ్ముగం పార్టీ నేతలు లోపలకు వెళ్ళారు. ప్రతి గదిలోనూ ఫర్నిచర్‌ ఇతర సామగ్రి ధ్వంసమై నేలపై చెల్లాచెదురుగా పడిఉండటాన్ని చూశారు. బల్లలు, కుర్చీలు, కంప్యూటర్లు పగిలి ఉన్నాయి. మొదటి అంతస్థులోని గదిలోని బీరువా పగులగొట్టబడి నేలపై పడి ఉండటం చూసి నాయకులు దిగ్ర్భాంతి చెందారు. ఇదే విధంగా గ్రంథాలయం గది తలుపులు పగిలి, పుస్తకాలన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మూడో అంతస్థులోని గదిలో మాజీ ముఖ్యమంత్రి జయలలితకు కానుకలుగా లభించిన వెండి వస్తువులన్నీ మాయమైనట్లు పార్టీ నాయకులు గుర్తించారు. ఈ విషయమైన కార్యాలయం మేనేజర్‌ మీడియాతో మాట్లాడుతూ కార్యాలయంలోని అన్ని వస్తువులు ధ్వంసమయ్యాయని, ముఖ్యంగా కంప్యూటర్‌లోని హార్డ్‌ డిస్కులు, పార్టీ జమాపద్దులకు సంబంధించి దస్తావేజులు, జయలలితకు కానుకగా లభించిన వెండి వస్తువులు కూడా మాయమయ్యాయని, ఈ విషయాన్ని పార్టీ నేత ఎడప్పాడి పళనిస్వామికి వివరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.



Updated Date - 2022-07-22T14:10:09+05:30 IST