విషాదంలో ఓదార్పుగా...

ABN , First Publish Date - 2021-04-28T05:30:00+05:30 IST

రెండుసార్లు కొవిడ్‌ బారిన పడి కోలుకున్న అన్నా మోరిస్‌కు బాధితులు మానసికంగా ఎంత నరకం అనుభవిస్తారో తెలుసు. ఆ మహమ్మారితో పోరాడి ప్రాణాలు పోగొట్టుకున్న వారి కుటుంబాలు

విషాదంలో ఓదార్పుగా...

రెండుసార్లు కొవిడ్‌ బారిన పడి కోలుకున్న అన్నా మోరిస్‌కు

 బాధితులు మానసికంగా ఎంత నరకం అనుభవిస్తారో తెలుసు. 

ఆ మహమ్మారితో పోరాడి ప్రాణాలు పోగొట్టుకున్న వారి కుటుంబాలు 

ఎంతగా తల్లడిల్లుతాయో ఆమె అర్థం చేసుకోగలదు.

అందుకే... కొవిడ్‌తో పోరులో ‘నేను సైతం’ అంటూ బెంగళూరులోని ఒక శ్మశాన వాటికలో స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నారామె. బాధిత కుటుంబాలకు ఓదార్పు అందిస్తూ, 

వారిలో స్థైర్యం నింపుతున్న ఆమె సేవా ప్రయాణమిది...


దేశంలో కరోనా మరణాలు ఎక్కువగా సంభవిస్తున్న రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. ప్రధానంగా బెంగళూరు నగరంలో కరోనా మరణాల సంఖ్య రోజూ వందకు పైనే. ఒకవైపు ఆత్మీయులను కోల్పోయిన బాధ, మరోవైపు అంత్యక్రియల్ని సరిగ్గా చేయలేకపోతున్నామనే ఆవేదన బాధిత కుటుంబాలను కుదిపేస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ఆ బాధిత కుటుంబాలకు బాసటగా నిలిచి, ఓదార్పును అందిస్తున్నారు అన్నా మోరిస్‌.


జంతు ప్రేమికురాలు

బెంగళూరుకు చెందిన నలభై మూడేళ్ళ అన్నా మోరిస్‌ శునకాల శిక్షకురాలు. వీఽధి జంతువులకూ, గాయపడిన జంతువులకూ ఆశ్రయం కల్పించే ఒక సంస్థతో కలిసి ఆమె చాలాకాలంగా పని చేస్తున్నారు. ఇప్పుడు బెంగళూరులోని శాంతినగర్‌లో ఉన్న ఇండియన్‌ క్రిస్టియన్‌ సెమెట్రీలో స్వచ్ఛందంగా సేవలందిస్తున్నారామె. ‘‘కిందటి ఏడాది కొవిడ్‌ వ్యాప్తి మొదలైన తరువాత ఎన్నో విషాదకరమైన పరిస్థితులను స్వయంగా చూశాను. అంతేకాదు, ఇప్పటికే నాకు రెండు సార్లు కోవిడ్‌ వచ్చి తగ్గింది. నా నోటికి రుచి తెలియలేదు. చాలా నీరసంగా అనిపించింది.


హోమ్‌ క్వారంటైన్‌లో ఉండి, జాగ్రత్తలు పాటించి కోలుకున్నాను’’ అని తన కరోనా అనుభవం చెబుతారామె. ఆ సమయంలోనే కొవిడ్‌ బాధితులకు తన వంతుగా సహకారాన్ని ఆన్నా అందిస్తూ వచ్చారు. ‘‘ఇంకా ఏదైనా చెయ్యగలనా?’’ అని ఆలోచిస్తున్నప్పుడు... కొవిడ్‌ మృతుల కుటుంబాలు ఆమె కళ్ళముందు మెదిలాయి. వెంటనే ఇండియన్‌ క్రిస్టియన్‌ సెమెట్రీ నిర్వాహకులతో మాట్లాడారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఆ సెమెట్రీలో స్వచ్ఛందంగా సేవలు అందించడం మొదలుపెట్టారు. ఖననాలకు అవసరమైన రాతకోతలు చూసుకోవడం, అక్కడ సిబ్బందికి సూచనలు ఇవ్వడం ఆమె పని. అంతేకాదు మృతదేహాలను మోయడంలో చేయందించడంతో పాటు సమాధుల తవ్వకాలను పర్యవేక్షిస్తున్నారు. ‘‘సాధారణంగా ఖననాలు ఆరు అడుగుల లోతున చేస్తూ ఉంటారు. కానీ కొవిడ్‌తో చనిపోయిన వారిని పది అడుగుల లోతున ఖననం చెయ్యాల్సి ఉంది. అలాగే, చాలామందికి ఇక్కడ పాటించాల్సిన విధివిధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అంతగా తెలీదు. అంత్యక్రియలు సజావుగా సాగేలా వారికి సహకరిస్తూ ఉంటాను’’ అంటారు అన్నా మోరిస్‌. 


సన్నిహితులు వారించినా

‘‘ఈ మధ్య కొవిడ్‌ కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో  శ్మశానవాటికకు దూరంగా ఉండాలని నా సన్నిహితులు సలహా ఇచ్చారు. కానీ, ఇప్పుడే బాధిత కుటుంబాలకు మాలాంటి వారి అవసరం ఎంతో ఉంది. వారిని ఓదార్చి,  ధైర్యాన్ని ఇవ్వడం ప్రధానం. నాకు చేతనైనంతవరకూ అది చేస్తున్నాను’’ అంటున్న   అన్నా మోరిస్‌ నిస్వార్థ సేవకు సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ‘‘మనుషుల్లో ఉన్న మంచితనం అన్నా మోరిస్‌ లాంటి వారి రూపంలో మనకు కనిపిస్తోంది. మానవాళికి సవాలుగా మారిన ఈ కాలంలో ఆమెలాంటి స్వచ్ఛంద సేవకులు ఆశారేఖలుగా నిలుస్తున్నారు’’ అని బెంగళూర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి ఇశా పంత్‌ ట్వీట్‌ చేశారు. ‘‘ఇది కూడా సేవే, బాధితుల కోసం నా వంతుగా ఈ సాయం చెయ్యడం గౌరవంగా భావిస్తున్నాను’’ అని చెబుతున్న అన్నా మోరిస్‌ ఎందరికో స్ఫూర్తినిస్తుందనడంలో సందేహం లేదు.

Updated Date - 2021-04-28T05:30:00+05:30 IST