అన్నదానం.. ఆకులే ప్రదానం

ABN , First Publish Date - 2021-11-25T06:27:59+05:30 IST

అన్నదానం.. ఆకులే ప్రదానం

అన్నదానం.. ఆకులే ప్రదానం
స్టీల్‌ కంచాల్లో అన్న ప్రసాదం స్వీకరిస్తున్న భక్తులు

భవానీలు, అయ్యప్పలకు విస్తరాకుల్లోనే వడ్డించాలి

స్టీల్‌ కంచాలను చూసి వెనుదిరుగుతున్న భక్తులు

దీక్షా నిబంధనలకు ఆటంకమని ఆవేదన

కార్తీక నోములు ఉన్నవారిదీ అదే పరిస్థితి

మార్పు చేయాలని అధికారులకు వేడుకోలు  

(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : దుర్గమ్మ అన్నప్రసాదం స్టీల్‌ కంచాల్లో పెడుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ద్వారకా తిరుమల, అన్నవరం తదితర ఆలయాల్లో ఉచిత అన్నప్రసాదాన్ని అరిటాకులు లేదా విస్తరాకుల్లో పెడతారు. సాక్షాత్తూ అన్నపూర్ణగా కొలువైన దుర్గమ్మ సన్నిధిలో మాత్రం స్టీలు కంచాల్లో పెడుతున్నారు. అవే కంచాలను శుభ్రపరుస్తూ మళ్లీ మళ్లీ ఉపయోగిస్తున్నారు. 

విమర్శల వెల్లువ

కార్తీక మాసంలో భక్తులు పూజలు అధికంగా చేస్తారు. కొందరు ఉపవాసాలతో నోములు నోచుకుంటారు. అలాగే, దూరప్రాంతాల నుంచి వస్తున్న మాల ధరించిన భవానీలు, అయ్యప్పలు దుర్గమ్మ దర్శనం అనంతరం అన్నప్రసాదాన్ని స్వీకరించాలను కుంటారు. కానీ, స్టీలు కంచాల్లో వడ్డిస్తుండటాన్ని చూసి వెనుదిరుగుతున్నారు. ఎంతో నిష్టతో 40 రోజులు దీక్షబూనిన స్వాములు ఆకుల్లో మాత్రమే అన్నప్రసాదాన్ని ఆరగించాలనేది నియమం. ఆ ప్రసాదాన్ని అరిటాకు లేదా విస్తరాకుల్లో మాత్రమే తినాలి. స్టీలు కంచాల్లో తినడం దీక్ష నిబంధనలకు వ్యతిరేకమని పండితులు చెబుతున్నారు. కానీ, దుర్గగుడిలో అమ్మవారి అన్నప్రసాదాన్ని అందరికీ స్టీలు కంచాల్లోనే వడ్డిస్తుండటంతో దీక్షాధారులైన భక్తులు ఆకులో ఆరగించే అవకాశం లేక వెనుదిరుగుతున్నారు. తిరుమల మాదిరిగా దుర్గగుడి అధికారులు కూడా దాతలను ప్రోత్సహిస్తే అమ్మవారి భక్తులకు మరింత నాణ్యమైన భోజనాన్ని అరిటాకులు, విస్తరాకుల్లో వడ్డించే అవకాశం ఉంటుంది. ఈ దిశగా ఆలయ ఉన్నతాధికారులు దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు. 

అన్నప్రసాద భవనం నిర్మించాలి

ఆలయంలో రోజూ 5వేల మందికి పైగా భక్తులకు అన్నప్రసాదాన్ని అందిస్తున్నారు. దాతలు విరాళాలుగా ఇస్తున్న సొమ్ముపై వచ్చే వడ్డీతో ఈ మహత్కార్యం జరుగుతోంది. సాధారణ రోజుల్లో సుమారు 20వేల నుంచి 25వేల మందికి పైగా భక్తులు అమ్మవారి దర్శనం కోసం వస్తున్నారు. ప్రస్తుతం దేవస్థానంలోని మల్లికార్జున మహామండపం రెండో అంతస్థులో రోజుకు 5 వేల మందికే అన్న ప్రసాదాన్ని అందిస్తున్నారు. భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ స్థలాభావం వల్ల కొంతమందికే పరిమితం చేస్తున్నారు. మల్లికార్జున మహామండపానికి దక్షిణం వైపున దాదాపు రూ.20 కోట్లతో అన్నదాన భవనాన్ని నిర్మించేందుకు ఆలయ అధికారులు ప్రతిపాదనలు చేసినా ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. అన్నదానానికి భక్తులు విరాళాల రూపంలో అందజేసిన సొమ్ము ప్రస్తుతం రూ.75 కోట్లకు పైగా బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసి వచ్చే వడ్డీతో వితరణ సాగిస్తున్నారు. అలాగే, ఏటా అమ్మవారి అన్నప్రసాద పథకానికి విరాళాలుగా రూ.కోట్లు సమకూరుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు అన్నప్రసాద వితరణను విస్తరించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.  

Updated Date - 2021-11-25T06:27:59+05:30 IST