అన్నదాత ఆగమాగం

ABN , First Publish Date - 2022-05-25T06:26:45+05:30 IST

నారు పోసిన నాటి నుంచి కోతకోసే వరకు నాటు వేయడం, కలుపు తీయడం, ఎరువులు చల్లడం, పురుగుల మందు లు స్ర్పే చేయడంతో పాటు ఓ వైపు పొద్దంతా కోతులతో రాత్రంతా పందులతో అలుపెరుగని సైనికుడిలా నిత్యం ఒక చిన్నపాటి యుద్దాన్నే కొనసాగించి తాను పండించిన పంటను చూసి చి‘వరి’కి తనకే విసుగు వచ్చే పరిస్థితిని ఈ పాలకులు రైతన్నకు కల్పిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అన్నదాత ఆగమాగం
ఖానాపూర్‌ మండలంలోని తర్లాపాడ్‌ గ్రామంలో రైతులే ధాన్యం తూకం వేస్తున్న దృశ్యం

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతన్నకు తప్పని తిప్పలు

 పదిహేను రోజులకు పైగా కల్లాల్లోనే పడిగాపులు

 కొనుగోలు కేంద్రాల్లో క్వింటాలుకు ఏడు కిలోలకు పైగా అదనపు తూకం

 హమాలీలు అందుబాటులో లేరంటూ చేతులెత్తేస్తున్న నిర్వాహకులు

 ధాన్యం బస్తాల్లో నింపి తూకం వేస్తేనే గన్నీబ్యాగులు.. లేకుంటే పడిగాపులే..

 మిల్లుకు పంపే వరకు బాధ్యత రైతుదేనని సెంటర్‌ నిర్వాహకుల హుకూం

ఖానాపూర్‌, మే 24 : నారు పోసిన నాటి నుంచి కోతకోసే వరకు నాటు వేయడం, కలుపు తీయడం, ఎరువులు చల్లడం, పురుగుల మందు లు స్ర్పే చేయడంతో పాటు ఓ వైపు పొద్దంతా కోతులతో రాత్రంతా పందులతో అలుపెరుగని సైనికుడిలా నిత్యం ఒక చిన్నపాటి యుద్దాన్నే కొనసాగించి తాను పండించిన పంటను చూసి చి‘వరి’కి తనకే విసుగు వచ్చే పరిస్థితిని ఈ పాలకులు రైతన్నకు కల్పిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్‌లో వర్షాలు అధికంగా కురువడంతో ఆశించినస్థాయిలో పంటల దిగుబడి రాకనష్టపోయిన రైతన్నకు ఈ యాసంగిపంట ఎన్నోఆశలను రేకెత్తించింది. ఎన్నో ఒడిదొడుకులను అధిగమించి ఈ యాసంగిలో వరిసాగు చేసిన రైతన్నకు ప్రస్తుతం ఆ ధాన్యం విక్రయించడం పెనుసవాల్‌గా మారింది. ఓ వైపు ప్రభుత్వం నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతన్నను సెంటర్‌ నిర్వాహకులు నిలువునా దోపిడీ చేస్తున్నారు. ఇంతతదంగం జరుగుతున్నా జిల్లాస్థాయి అధికారులు మాత్రం తమ దృష్టికి రాలేదని తప్పించుకునే మాటలు చెబుతుండడం వెనుక పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అధికారులు, పాలకులు, మిల్లర్లు కుమ్మక్కయ్యే రైతన్నను నిండా ముంచుతున్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. 

పంట కల్లాల్లోనే పడిగాపులు

ఖరీఫ్‌లో వర్షాలు అధికంగా కురువడంతో యాసంగిలో సాగునీటికి కొరత ఉండదని తామంతా వరిపంటను సాగు చేయొచ్చని జిల్లా రైతాంగం సంబరపడింది. అయితే రాష్ట్ర ముఖ్యంత్రి కేసీఆర్‌ చేసిన ప్రకటనతో రైతన్న సంబరం ఎంతోసేపు నిలువకుండా పోయింది. తాము యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహించబోమని ముఖ్యమంత్రే స్పష్టం చేయడంతో జిల్లాలో మెజారిటీ రైతాంగం వరిసాగుకు దూరంగా ఉన్నారు. ఎలాగైనా సరే తాము వరితప్ప మరొకటి పండించమని వరి సాగుచేసిన రైతన్నకు ఇప్పుడు పంటకల్లాల్లో తిప్పలు తప్పడం లేదు. తాము ధాన్యం కొనుగోలు చేయమని రాష్ట్ర ప్రభుత్వం గత కొద్దిరోజుల వరకు భీష్మించుకుని కేంద్రంపై పోరుకు దిగింది. ఆ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటన చేశారు. దీంతో కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. తీరా కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాక ఓ పక్క హమాలీలు అందుబాటు లో లేరని సెంటర్‌ నిర్వాహకులు కొనుగోళ్లను ప్రారంభించలేదు. దీంతో మొదట కోత  కోసిన రైతన్నకు నెలరోజులుగా వరిధాన్య కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు తప్పలేదు. ప్రస్తుతం ఒక్కో రైతు గత పదిహేను రోజులుగా ఽధాన్యం విక్రయించేందుకు అవస్థలు పడుతూ కొనుగోలు కేంద్రాల్లోనే నిరీక్షిస్తున్నప్పటికీ నిర్వాహకులు మాత్రం నిమ్మకు నీరెత్తన్నట్లే వ్యవహరిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఓ వైపు శ్రమదోపిడి మరో వైపు ధాన్యం దోపిడి

 పంటను కొనుగోలు కేంద్రాల్లో ఽతూకం వేయాలంటే సెంటర్‌ నిర్వాహకులు రైతన్నకు చుక్కలు చూపిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఒక్క 40 కిలోలబస్తాలో 40 కిలోలధాన్యం, 580 గ్రాముల బస్తా బరువు కలుపుకుని 40.580 కిలోలు మాత్రమే తూకం వేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కాని క్షేత్రస్థాయిలో మాత్రం సెంటర్‌ల నిర్వాహకులు రైతన్నను నిలువుదోపిడీ చేస్తున్నారు. ఒక్కోబస్తాకు 43 కిలోల 500 గ్రాములు తూకం వేస్తూ ఒక క్వింటాలుకు సుమారు ఆరుకిలోల నుంచి ఏడుకిలోల వరకు అదనంగా తూకం వేస్తూ రైతన్నను అధికారికంగా మోసం చేస్తున్నారు. ఇదేమని అడిగిన వారికి గన్నీబ్యాగులు ఇవ్వకుం డా ఆలస్యం చేస్తూ ధాన్యం తూకం చేయడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఖానాపూర్‌ మండలంలోని తర్లాపాడ్‌ గ్రామంలోని వరిధాన్య కొనుగోలు కేంద్రంలో ఏకంగా రైతులే బస్తాల్లో ధాన్యం నింపాలి, తూకం చేయాలి, లారీల్లో లోడింగ్‌ కూడా చేసుకోవాలని సెంటర్‌ నిర్వాహకులు చెబుతున్నట్లు రైతులు ఆవేదన చెందుతున్నారు. 

నత్తనడకన కొనుగోళ్లు

జిల్లాలో ఈ యాసంగిలో 65 వేల ఎకరాల్లో వరిసాగు చేశారు. కాగా 1.30 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. కొనుగోలు చేసేందుకు జిల్లాలో 181 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఇందులో ఐకేపీ ఆధ్వర్యంలో 31, పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో 85, డీసీఎంఎస్‌ ఆధ్వ ర్యంలో 61, జీసీసీ ఆధ్వర్యంలో 4 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 1033 మంది రైతుల నుంచి 53897 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. కాగా 45500 మెట్రిక్‌ టన్నుల ధాన్యా న్ని రైస్‌మిల్లులకు చేర్చారు. మిగతా ధాన్యమంతా కొనుగోలు కేంద్రాల్లోనే ఉంది. కొనుగోళ్లు నత్తనడకన సాగడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడంతో ఆందోళన తప్పడం లేదు. ఈ నెలాఖరు వరకు ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇంకా సగానికిపైగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఉండడం గమనార్హం. మరి పరిస్థితి ఇలాగే కొనసాగితే రైతన్న ఆగ్రహాన్ని జిల్లా అధికార యంత్రాంగం చవిచూడక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

ఽరైతులను దోచుకోవడం ఆపేయాలి

ఖానాపూర్‌ మండలంలోని తర్లాపాడ్‌ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఒక బస్తాలో 43 కిలోల 500 గ్రాములు తూకం వేస్తున్నారు. క్వింటా లుకు సుమారు ఏడుకిలోల ధాన్యం దోపిడి చేస్తున్నారు. ఈ పాలకులు, అధికారులు, రైస్‌మిల్లర్లతో కమ్మక్కయ్యి రైతన్నను ముంచుతున్నారు.  మరో వైపు మాగ్రామంలో రైతులే ధాన్యం బస్తాల్లో నింపుకోవాలి. రైతులే తూకం చేయాలి. రైతులే లారీల్లో లోడింగ్‌ చేసి రైస్‌మిల్‌కు ధాన్యం పంపించాలని సెంటర్‌ నిర్వాహకులు చెబుతున్నారు. 

- నాగెల్లి నర్సయ్య, రైతుకూలి సంఘం కోశాధికారి 

అదనపు తూకం వేస్తే చర్యలు తప్పవు

వరిధాన్యం తూకం వేసేటప్పుడు 580 గ్రాములు బస్తాబరువు, 40 కిలోలధాన్యం మాత్రమే తూకం వేయాలి అంతకు మించి అదనంగా తూకం వేస్తే చర్యలు చేపడుతాం. ఇప్పటి వరకు ఈ అదనపు తూకం విషయం మాదృష్టికి రాలేదు. ఇక హమాలీల కొరత ఉన్న చోట రైతులను కేవలం ధాన్యం బస్తాలలో నింపి సహకరించాలని కోరాం. కాని తూ కం వేయడం, లోడింగ్‌ చేయడం అంతా సెంటర్‌ నిర్వాహకులే చేయాలి. లేని ఎడల వారి ఏజెన్సీ రద్దు చేస్తాం. 

Updated Date - 2022-05-25T06:26:45+05:30 IST