అన్నదాత ఆక్రందన

ABN , First Publish Date - 2022-06-18T07:20:18+05:30 IST

జిల్లాలో పంటల బీమా అక్రమాల మయంగా మారింది. పరిహారం మంజూరు జాబితాలు చూసుకున్న రైతుల అందులో తమ పేర్లు లేకపోవడంపై మండిపడుతున్నారు.

అన్నదాత ఆక్రందన
అన్నదాత ఆక్రందతాటాకులపాలెంలో రైతులను విచారిస్తున్న ఏడీఏ ప్రభాకర్‌రావు న

పంటల బీమాలో అక్రమాలపై గరంగరం

అర్హత ఉన్నా అందలేదంటూ ఆందోళనలు

పలుచోట్ల రాస్తారోకోలు, ధర్నాలు

రైతు భరోసా కేంద్రాలకు తాళాలు

సమాధానం చెప్పలేక వ్యవసాయశాఖ ఉక్కిరిబిక్కిరి

మండల స్థాయి అధికారులతో డీఏవో టెలీకాన్ఫరెన్స్‌

ఈ-క్రాప్‌ నమోదులోనే అవకతవకలు

కౌలు రైతులకు పూర్తిగా మొండిచేయి

త్రిపురాంతకం మండలంలోని మూడు గ్రామాల్లో బీమా పరిహారం కోసం కొందరితో కలిసి గ్రామ వ్యవసాయ సహాయకులు ప్రణాళిక ప్రకారం ఈక్రాప్‌ నమోదులో అక్రమాలు చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బీమా జాబితాను పరిశీలించగా సర్వే నంబర్ల స్థానంలో తేదీ, నెల కనిపిస్తున్నాయి. మరో గ్రామ జాబితాలో ఒకే వ్యక్తికి ఒకే సర్వే నంబరులో మూడుసార్లు ఈక్రాప్‌ నమోదు చేశారు. మరో గ్రామంలో వీఏఏ నేరుగా కొంతమందితో ఒప్పందం చేసుకుని కౌలురైతుల కింద ఈక్రాప్‌ నమోదు చేశారు.

కొండపి మండలం తాటాకులపాలెంలో చోటుచేసుకున్న అవకతవకలపై విచారణ ప్రారంభమైంది. ఒంగోలు డీఆర్సీ ఏడీఏ ప్రభాకర్‌రావు శుక్రవారం గ్రామానికి వెళ్లి ఆర్‌బీకే వద్ద రైతులతో మాట్లాడారు. చనిపోయిన వారి ఖాతాల్లో కూడా నగదు జమ అయిన విషయాన్ని కొందరు రైతులు ఆయన దృష్టికి తెచ్చారు. వీఏఏ లాగిన్‌ పైవేటు వ్యక్తికి అప్పగించి అక్రమాలకు పాల్పడ్డారని వారు ఆరోపించారు. ఆ వ్యక్తి అందుబాటులో లేకపోవడంతో వీఏఏతో మాట్లాడి లాగిన్‌ ఇచ్చిన విషయాన్ని ఏడీఏ నిర్ధారించుకున్నారు. 

తర్లుపాడు మండలంలో వ్యవసాయాధికారి నిర్లక్ష్యంతోనే  మిర్చి, కంది రైతులకు అన్యాయం జరిగిందని ఏడీఏ బాలాజీనాయక్‌ తెలిపారు. తమ విచారణలో ఆ విషయం తేలిందన్నారు. కార్యాలయం నుంచి ఇష్టమొచ్చినట్లు నివేదిక పంపినట్లు రుజువైందన్నారు. జిల్లాలోనే మిర్చి అతి తక్కువ దిగుబడి వచ్చింది తర్లుపాడు మండలేమనని కానీ అధికారుల వద్దనే జాబితాలో అవకతవకలు జరిగాయన్నారు.  

 పంటల బీమాపై జిల్లావ్యాప్తంగా రైతులు  గరంగరంగా ఉన్నారు. తీవ్రంగా పంట నష్టపోయినా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ఉన్నా తమకు బీమా దక్కలేదని పలు ప్రాంతాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో అర్హత లేని వారికి మంజూరు చేశారని వ్యవసాయశాఖ క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందిపై మండిపడుతున్నారు. బీమా మంజూరులో జరిగిన లోపాలు, అక్రమాలు వెలుగులోకి వస్తుండగా ప్రకటించిన లబ్ధిదారుల జాబితాలను చూపి వాటిలో పలు అక్రమాలు జరిగాయని నినదిస్తూ ఎక్కడికక్కడ ఆందోళనలకు దిగుతున్నారు. నాలుగురోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. అయితే ప్రక్రియ అంతా పారదర్శకంగానే జరిగిందని జిల్లా ఉన్నతాధికారులు పేర్కొనడం గమనార్హం. 


ఒంగోలు. జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో పంటల బీమా అక్రమాల మయంగా మారింది.  పరిహారం మంజూరు జాబితాలు చూసుకున్న  రైతుల అందులో తమ పేర్లు లేకపోవడంపై మండిపడుతున్నారు. అదే సమయంలో అసలు పంట సాగు చేయని, ఒక పంట సాగుచేస్తే మరో పంట పేరుతో కొందరికి బీమా రావడం చూసి మండిపడుతున్నారు. ఇలా వచ్చేందుకు క్షేత్రస్థాయిలోని వ్యవసాయశాఖ సిబ్బంది అక్రమ వ్యవహారాలు, అవకతవకలు కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇంతటి తీవ్రస్థాయిలో రైతులు ఆవేదన, ఆక్రందన చెందడం తదనుగుణంగా ఆందోళనలకు దిగడం వెనుక కారణాలను పరిశీలిస్తే గత ఖరీఫ్‌ సీజన్‌లో సాగు చేసిన ఏ ఒక్క పంటా జిల్లాలో సరైన దిగుబడి వచ్చిన పరిస్థితి లేదు. కనీసం ప్రభుత్వం ప్రకటించిన పంటల బీమాతోనైనా ఉపశమనం కలుగుతుందని భావిస్తే అధికశాతం మందికి అందని పరిస్థితి నెలకొంది. కీలకమైన రైతు వారీ పంట నమోదు జరిగే ఈక్రాప్‌ బుకింగ్‌ ప్రక్రియలోనే పలులోపాలు, క్షేత్రస్థాయి లోని వ్యవసాయ సిబ్బంది అవకతవకలకు పాల్పడటం, రైతులు కూడా కొన్నిచోట్ల అవగాహనలేమితో వ్యవహరించడం ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. జిల్లాలో పెద్ద సంఖ్యలో కౌలు రైతులు ఉండగా విధాన లోపాలతో బీమా పరిహారంలో వారికి ఎలాంటి ఆసరా లభించలేదు. ఈ నేపథ్యంలో పరిస్థితిన గమనించి లోటుపాట్లు సరిచేయడంపై దృష్టిసారించిన డీఏఓ శ్రీనివాసరావు శుక్రవారం మధ్యాహ్నం మండలస్థాయి అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.


భారీ నష్టం.. బీమా అంతంతమాత్రం

జిల్లాలో గత ఖరీఫ్‌ సీజన్‌లో లక్షా 81వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పంటలు సాగు చేశారు. ప్రధాన వర్షాధార పంటలైన కంది 78వేల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో సాగుచేయగా, 29వేల హెక్టార్లలో పత్తి, 28వేల హెక్టార్లలో మిర్చి, 22వేల హెక్టార్లలో వరి సాగు కాగా మినుము, సజ్జ, నువ్వు, పెసర, వేరుశనగ, పశుగ్రాస పంటలు మిగిలిన విస్తీర్ణంలో సాగయ్యాయి. అయితే ఏ ఒక్క పంట కూడా సరిగ్గా పండలేదు. తొలుత వర్షాభావం, తర్వాత అధిక వర్షాలు, ఆపై తెగుళ్ల దాడితో దెబ్బతిన్నాయి. ప్రత్యేకించి మిర్చి, కంది దిగుబడులు నామమాత్రంగానే రాగా ఇతర పంటల దిగుబడులు తగ్గాయి. అలా నష్టపోయిన వారికి ప్రస్తుతం ప్రభుత్వం పంటల బీమా కింద నగదు మంజూరుచేసింది. అయితే అది అరకొరగానే ఉందని తాము తీవ్రంగా నష్టపోయినా, అర్హత  ఉన్నా బీమా అందలేదని చాలాప్రాంతాల్లో రైతులు ఆవేదన, ఆగ్రహం చెందుతున్నారు. 


క్రాప్‌ కటింగ్‌ ప్రమాణికంగా... 

ప్రభుత్వ లెక్కల ప్రకారం జిల్లాలో గత ఖరీఫ్‌లో పంట నష్టపోయిన లక్షా 10వేల మందికిపైగా రైతులకు రూ.275.33 కోట్లు మంజూరైంది. నిజానికి 3.21లక్షల మంది రైతుల పేర్లు ఈక్రాప్‌ బుకింగ్‌లో నమోదు కాగా మూడో వంతు మందికి మాత్రమే బీమా లభించింది. కాగా ఈక్రాప్‌ నమోదు అనేది బీమా వర్తింపునకు ప్రాతిపదికన మాత్రమేనని, దిగుబడులపై యంత్రాంగం చేసే క్రాప్‌ కటింగ్‌ ప్రయోగాలు ప్రామాణికంగానే పరిహారం మంజూరు చేశారని ఉన్నతాధికారులు చెప్తున్నారు. అదికూడా గత ఏడేళ్ల సగటు కన్నా తక్కువ వచ్చిన వారికి ఎంత తక్కువ వస్తే అంతమేర బీమా వస్తుందని చెప్తున్నారు. కొన్ని పంటలకు జిల్లా, కొన్నింటికి మండల యూనిట్‌గా మరికొన్నింటిని గ్రామం యూనిట్‌గా దిగుబడులు లెక్కిస్తారు. గ్రామం యూనిట్‌లో కూడా ఒక రెవెన్యూ గ్రామం పరిధిలో సదరు పంట కనీసం 250 ఎకరాల్లో వేసి ఉంటే ఒక యూనిట్‌గా తీసుకుంటారు. అలా లేకపోతే పక్క గ్రామంలో పంట విస్తీర్ణం కలుపుతారు. అలా లెక్కించి వివరాలను కమిషనరేట్‌కు పంపితే అక్కడ మొత్తం ఈక్రాప్‌ నమోదు, దిగుబడులు లెక్కలు సంక్షిప్తం చేసి బీమా మంజూరు చేశారని అధికారులు చెప్తున్నారు. ఙఙఙఙ


వెలుగుచూస్తున్న అవకతవకలు

ఆర్బీకే సిబ్బంది, వ్యవసాయశాఖ అధికారుల చర్యలతో తమకు అన్యాయం జరిగిందంటూ పలుప్రాంతాల్లో రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో లబ్ధిదారుల జాబితాల పరిశీలనలో కొందరు రైతులకు జరిగిన అన్యాయం, అవకతవకలు, అక్రమాలు జరిగిన ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తర్లుపాడు, అర్ధవీడు, పుల్లలచెరువు, పెద్దారవీడు, దర్శి, కురిచేడు, ముండ్లమూరు, కొండపి, కనిగిరి, పీసీపల్లి, ఎన్‌జీపాడు తది తర మండలాల్లో ఈ అవకతవకలు వెలుగులోకి వచ్చాయి.  రైతులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలకు దిగుతున్నారు. రాస్తారో కోలు, ఆర్బీకేలకు తాళాలు, ఏవో కార్యాలయాల ఎదుట ధర్నాలు తదితర రూపాల్లో నిరసనలు చేపడుతున్నారు. శుక్రవారం కూడా తర్లుపాడులోని ఆర్బీకేకు కొందరు రైతులు తాళాలు వేసి ఆందోళనకు దిగారు. ఈ స్థాయిలో బీమా విషయంలో విమర్శలు వెల్లువెత్తుతున్నా క్షేత్రస్థాయిలోని వ్యవసాయ అధికా రులు సరైన సమాధానం చెప్పలేక రైతులను సంతృప్తిపర్చలేక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో దిద్దుబాటు చర్యలపై జిల్లా అధికారులు దృష్టిసారించారు.




Updated Date - 2022-06-18T07:20:18+05:30 IST