అన్నదాత ఆగ్రహ ం

ABN , First Publish Date - 2022-05-17T05:28:12+05:30 IST

చిన్నశంకరంపేటలో కొనుగోలు కేంద్రం వద్ద రోజులు గడుస్తున్నా ధాన్యం తరలించకపోవడంతో వర్షానికి తడిసి ముద్ద్దవుతున్నదని రైతులు ఆందోళనకు దిగారు.

అన్నదాత ఆగ్రహ ం
బ్రాహ్మణపల్లిలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేస్తున్న రైతులు

లారీల కొరతతో నిలిచిన ధాన్యం తరలింపు

పేరుకుపోతున్న ధాన్యం రాశులు

చేగుంట-మెదక్‌ రహదారిపై రాస్తారోకో

బ్రాహ్మణపల్లిలో సీఎం దిష్టిబొమ్మ దహనం


చిన్నశంకరంపేట/హవేళిఘణపూర్‌/నర్సాపూర్‌,మే 14: చిన్నశంకరంపేటలో కొనుగోలు కేంద్రం వద్ద రోజులు గడుస్తున్నా ధాన్యం తరలించకపోవడంతో వర్షానికి తడిసి ముద్ద్దవుతున్నదని రైతులు ఆందోళనకు దిగారు. అధికారుల అలసత్వంతో కొనుగోలు కేంద్రాల నుంచి రైస్‌మిల్లర్లకు ధాన్యం తరలించడం లేదని మెదక్‌-చేగుంట రహదారిపై గంట పాటు తడిసిన వరి ధాన్యం బస్తాలతో రాస్తారోకో నిర్వహించారు. ధాన్యం తరలించి, త్వరగా కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ధాన్యం తరలించేందుకు చర్యలు తీసుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమన్నారు. ఈ క్రమంలో అక్కడకు చేరుకున్న పోలీసులకు రైతుల మధ్యవాగ్వాదం జరిగింది. ఇన్‌చార్జి తహసీల్దార్‌ మహేందర్‌గౌడ్‌ అక్కడికి చేరుకుని తడిసిన  ధాన్యం కూడా కొనుగోలు చేస్తామని చెప్పారు. రైతులు ఆందోళన చెందవద్దని, లారీల కొరతతోనే ధాన్యం నిలిచిపోతుందన్నారు. ధాన్యం తరలించేందకు చర్యలు తీసుకుంటామని చెప్పడంతో రైతులు రాస్తారోకోను విరమించారు. హవేళిఘణపూర్‌ మండలం ఫరీద్‌పూర్‌లో కూడా ధాన్యం కొనుగోలు కేంద్రానికి లారీలు రావడంలేదని రైతులు ఆందోళన నిర్వహించారు. నాలుగు రోజులుగా సెంటర్‌కు లారీలు  రాకపోవడంతో ధాన్యం అకాల వర్షానికి తడుస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్‌కు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. పక్కనే ఉన్న ఇసుక క్వారీకి వందల సంఖ్యలో లారీలు వస్తున్నా వడ్లు తరలించడానికి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. కాగా లారీలు కావాలని ఇసుక క్వారీకి రైతులు వెళ్లడంతో వాహన డ్రైవర్లకు రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఎస్‌ఐ మురళి, రూరల్‌ సీఐ విజయ్‌ అక్కడకు చేరుకున్నారు. అధికారులతో మాట్లాడి లారీలు తెప్పించడంతో రైతులు శాంతించారు. నర్సాపూర్‌ మండలం బ్రాహ్మణపల్లిలోనూ ధాన్యం మిల్లులకు తరలించడానికి లారీలు రావడం లేదని నర్సాపూర్‌-వెల్దుర్తి ప్రధానరోడ్డుపై సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. వెంటనే లారీలను పంపకుంటే విరమించేదిలేదని రోడ్డుపై భీష్మించుకున్నారు. లారీలను పం పిస్తామని అధికారులు విజ్ఞప్తి చేయడంతో రైతులు ఆందోళన విరమించారు. 

నిర్దేశించిన దానికంటే ఎక్కువ తీసుకుంటారా?

శివ్వంపేట: ప్రభుత్వం నిర్దేశించిన దానికంటే సంచికి మిల్లర్లు అధికంగా ధాన్యం తీసుకుంటున్నారని శివ్వంపేట కొనుగోలు కేంద్రం వద్ద రైతులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. 40కిలోల సంచికి అదనంగా కిలో 300గ్రాములు తీసుకోవాల్సి ఉండగా అంతకు మించి ఇస్తేనే మిల్లర్లు ధాన్యం తీసుకుంటున్నారని చెప్పారు. లేదంటే నిరాకరిస్తున్నారని వాపోయరు. కాగా జడ్పీటీసీ మహే్‌షగుప్తా, పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకట్రామ్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు రమణ మిల్లర్లతో మాట్లాడారు. ప్రభుత్వం నిర్దేశించిన మేరకే ధాన్యం తీసుకోవాలని సూచించారు.

Updated Date - 2022-05-17T05:28:12+05:30 IST