152 స్థానాల్లో అన్నాడీఎంకే పోటీ?

ABN , First Publish Date - 2021-01-22T13:09:00+05:30 IST

అసెంబ్లీ ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకే 152 నియోజకవర్గాల్లో పోటీకి తగిన వ్యూహరచన చేస్తోంది. మిత్రపక్షాలకు 82 నియోజకవర్గాలను కేటాయించాలని భావి స్తోంది...

152 స్థానాల్లో అన్నాడీఎంకే పోటీ?

చెన్నై, (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకే 152 నియోజకవర్గాల్లో పోటీకి తగిన వ్యూహరచన చేస్తోంది. మిత్రపక్షాలకు 82 నియోజకవర్గాలను కేటాయించాలని భావి స్తోంది. ప్రత్యేకించి కూటమిలో వన్నియార్ల ఓటు బ్యాంకు కలిగిన పాట్టాలి మక్కల్‌ కట్చి (పీఎంకే)కు అందరి కంటే అధిక స్థానాలు కేటాయించేందుకు సిద్ధమవుతోంది. పీఎంకేకు 41 నియోజకవర్గాలు కేటాయించి వన్నియార్ల రిజర్వేషన్‌ కోసం పోరాటం సాగిస్తున్న ఆ పార్టీని బుజ్జగించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇక విజయకాంత్‌ నాయకత్వంలోని డీఎండీకేకు 18, బీజేపీకి 15 నియోజకవర్గాలు కేటాయించాలని ఆ పార్టీ అధిష్ఠానం నిర్ణయించినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతు న్నాయి. అన్నాడీఎంకేలో సీఎం అభ్యర్థిగా ముఖ్యమంత్రి పళనిస్వామిని ఎంపిక చేయడంతో ఆయన రెట్టింపు ఉత్సాహంతో  డిసెంబర్‌ 19 నుంచి ఎన్నికల ప్రచార పర్యటన చేస్తున్నారు. పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి సీ పొన్నయ్యన్‌ నాయకత్వంలో ఎన్నికల మేనిఫెస్టో తయారీ ముమ్మరంగా జరుగుతోంది. మార్చి మొదటివారంలో అసెంబ్లీ ఎన్నికల నోటిషికేషన్‌ విడుదలయ్యే అవకాశాలు వుండటంతో అంతకు ముందే మిత్రపక్షాలకు సీట్ల కేటాయింపులను పూర్తి చేయాలని అన్నాడీఎంకే అధిష్ఠానం నిర్ణయించింది. అన్నాడీఎంకే కూటమిలో పీఎంకే, బీజేపీ, డీఎండీకే, టీఎంసీ, సమత్తువ మక్కల్‌ కట్చి, న్యూ జస్టీస్‌ పార్టీ, పురట్చిభారతం పార్టీలున్నాయి. ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా చెన్నై పర్యటనకు వచ్చినప్పుడు బీజేపీతో అన్నాడీఎంకే పొత్తు అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని  పార్టీ ఉప సమన్వయకర్త, ముఖ్యమంత్రి పళనిస్వామి, సమన్వయకర్త, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం సభాముఖంగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ముఖ్యమంత్రి ఎడప్పాడి ఢిల్లీ పర్యటనలో సీట్ల సర్దుబాట్లపై  అమిత్‌షాతో సుదీర్ఘ చర్చలు జరిపారు. అందులో బీజేపీకి కనీసం ముప్పై సీట్లు కేటాయించాలని షా పట్టుబట్టినట్టు తెలుస్తోంది.


అయితే మిత్రపక్షాలకున్న ఓటు బ్యాంకుల ప్రకారం సీట్లను కేటాయిస్తామని, ఆ మేరకు ఓటు బ్యాంకు అధికంగా ఉన్న పీఎంకేకు అన్ని పార్టీల కంటే అధిక సీట్లు కేటాయించాల్సిన బాధ్యత తమపై ఉందని ఎడప్పాడి తెలిపినట్టు సమాచారం. రాష్ట్రంలో తమ పార్టీ గెలిచే అవకాశాలున్న నియోజకవర్గాల జాబితాను  అన్నాడీఎంకే అధిష్ఠానానికి బీజేపీ ఇంతకు ముందే సమర్పించింది. దానిని పరిశీలించిన అన్నాడీఎంకే  నేతలు బీజేపీకి 15 నియోజకవర్గాలను కేటాయించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలుస్తోంది. అయితే ఎన్నికలు సమీపించే వేళ బీజేపీకి మరికొన్ని సీట్లు లభించే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. ఈసారి ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే నుంచి గట్టి పోటీ వుండటంతో అసెంబ్లీ ఎన్నికల్లో 152 నియోజకవర్గాల్లో పోటీ చేస్తేనే ప్రభుత్వం ఏర్పాటుకు సరిపడా మెజారిటీ సీట్లను గెలుచుకోగలమని ఎడప్పాడి, పన్నీర్‌సెల్వం భావిస్తున్నారు.


50 సీట్లడుగుతున్న పీఎంకే

వన్నియార్లకు 20 శాతం రిజర్వేషన్లను అసెంబ్లీ ఎన్నికల్లోగా ప్రకటించాలని పట్టుబిగిస్తున్న పీఎంకే వ్యవస్థాపకుడు డాక్టర్‌ రాందాస్‌ను బుజ్జగించేందుకు రాష్ట్ర మంత్రులిరువురు రాయబారానికి వెళ్లినప్పుడు ఎన్నికల్లో తమకు కనీసం 50 సీట్లను కేటాయించాలని ఆయన డిమాండ్‌ చేసినట్టు తెలుస్తోంది. అంతటితో ఆగకుండా తమ పార్టీ గెలిచేందుకు అవకాశమున్న 50 నియోజకవర్గాల జాబితాను కూడా ఆయన మంత్రులకు అందజేసినట్టు చెబుతున్నారు.. అయితే పీఎంకే కోరుతున్నట్టు 50 నియోజకవర్గాలను ఆ పార్టీకి కేటాయించేందుకు ఎడప్పాడి అంగీకరించడం లేదు. ఈసారి మిత్ర పక్షాలకు 82 నియోజకవర్గాలను మాత్రమే కేటాయించాలని దృడనిశ్చయంతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లోనూ అన్నాడీఎంకే మిత్రపక్షాలకు కేటాయించేందుకు సిద్ధం చేసిన సీట్ల కేటాయింపుల జాబితా ప్రసారమాధ్యమాల్లో వెలువడింది. ఈ జాబితా అధికారకమైనదని కాదని, మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాట్లపై చర్చలు జరిగిన తర్వాత జాబితాలో మార్పులు ఉంటాయని తెలుస్తోంది.


ప్రసార మాధ్యమాల్లో వెలువడిన జాబితా ప్రకారం అన్నాడీఎంకే మిత్రపక్షాలకు కేటాయించనున్న నియోజకవర్గాల వివరాలు ఇలా ఉన్నాయి.


పీఎంకే - 41

బీజేపీ - 15

డీఎండీకే - 18

టీఎంసీ - 5

పుదియ తమిళగం - 3

Updated Date - 2021-01-22T13:09:00+05:30 IST