అన్నమయ్య పరిశోధకులకు ప్రాతఃస్మరణీయులు

ABN , First Publish Date - 2022-09-05T07:00:35+05:30 IST

చామనచాయలో నిండైన విగ్రహం, మధురమందహాసం, గంభీరమైన స్వరంనుంచి మృదువైన పలుకు, కలుపుగోలుతనం, పిన్నలనూ, పెద్దలనూ సమాదరించే స్వభావం, యథాలాపంగా మాట్లాడుతున్నట్టే...

అన్నమయ్య పరిశోధకులకు ప్రాతఃస్మరణీయులు

చామనచాయలో నిండైన విగ్రహం, మధురమందహాసం, గంభీరమైన స్వరంనుంచి మృదువైన పలుకు, కలుపుగోలుతనం, పిన్నలనూ, పెద్దలనూ సమాదరించే స్వభావం, యథాలాపంగా మాట్లాడుతున్నట్టే కనిపిస్తూ పాండిత్యపు లోతులను ప్రకటించే నిండుకుండ స్వరూపం.... వెరసి గౌరిపెద్ది రామసుబ్బశర్మగారు.


తాళ్లపాక అన్నమాచార్యుల మీద ఎవరికి వారే సాధికారత ఉందని భావిస్తున్న రోజులివి. ఆయన పదకవితలకు రకరకాల రాగాల పోహళింపే కాక, ఆయన రచనలకు విశేష వ్యాఖ్యానాలు కూడ తరచుగా వెలువడుతున్న రోజులివి. కానీ నేరుగా రాగిరేకుల నుంచి వాటిని చదివి, అర్థం చేసుకుని, పరిష్కరించి, అక్షరదోషాలు పరిహరించి, రాగతాళ నిర్దేశం చేసిన మహానుభావులు లేనిదే ఇప్పుడు పుంఖానుపుంఖాలుగా వెలువడుతున్న వ్యాఖ్యానాలకు ఉనికి ఉండేదే కాదు. ఎవరికి వారు అన్నమయ్య నిపుణులవుతున్న నేటి తరానికి కూడ ప్రాతఃస్మరణీయులు కొందరున్నారు. వారిలో ముఖ్యులు సాధు సుబ్రహ్మణ్యశాస్త్రిగారు, వేటూరి ప్రభాకరశాస్త్రిగారు, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మగారు. వారి కోవకు చెందినవారే గౌరీపెద్ది రామసుబ్బశర్మగారు.


వేటూరి ప్రభాకరశాస్త్రిగారు, రాళ్లపల్లి అనంతకృష్ణశర్మగారు అన్నమయ్య కృతుల పరిష్కరణకు చేసిన దోహదం తెలిసిందే. రాళ్లపల్లివారి శిష్యుడినని తరచు చెప్పుకున్నా, సాహిత్య మర్మజ్ఞతలో వారికి ఏ మాత్రం తీసిపోని శర్మగారు తాళ్లపాక కవుల పదకవితల పరిష్కరణలో, వాటి విమర్శనంలో అద్వితీయమైన మౌలికతను ప్రకటించారు. అన్నమయ్య కృతుల సంపుటాల్లో 16, 18, 21 సంపుటాలకు రాసిన పీఠికల్లో అన్నమయ్య భాషను గురించి ఆయన చేసిన విశ్లేషణ, కవిత్రయం, శివకవుల తర్వాత, ఒక్క అన్నమయ్య కలంలోనే తెలుగు తన తీయదనాన్ని ఎలా నింపుకుందో చెప్పిన తీరు అమోఘం.


అన్నమయ్య పదకవితల్లో భక్తితత్వం, శృంగార సిద్ధి, ఆధ్యాత్మికం వివరించడం ఒక ఎత్తయితే, ఆయన వ్యాకరణ నియమాలను ఎంత చక్కగా ఉల్లంఘించాడో, గ్రాంథిక భాషతో సరిసమానంగా వ్యావహారిక భాషను ఎంత సొగసుగా ఉపయోగించాడో చెప్పడం మరో ఎత్తు. ఇక్కడే రామసుబ్బశర్మగారి ప్రతిభ నీరాజనాలందుకుంటుంది. పదకవితల్లో ప్రయోగించిన తెలుగుభాషా పలుకుబడిలో బహుశా తిక్కన అన్నమయ్య గురువని శర్మగారు ఊహించడంవెనక, రాళ్లపల్లివారి సావాసప్రభావం స్పష్టమే.


అన్నమయ్య పదకవితలను అతని సమకాలికులైన శ్రీనాథ, పోతనలు కూడా ఎక్కడా ప్రస్తావించలేదన్నది సాహిత్య చరిత్ర పాఠకులందరూ ఎరిగినదే. పురాణకావ్యా దులముందు తక్కిన అన్ని ప్రక్రియలూ దిగదుడుపేనని బహుశా అప్పటి కవులు భావించివుండవచ్చు. లేదా వారసలు అన్నమయ్యను విని వుండకపోవచ్చు. కానీ అంత మాత్రాన పదసాహిత్య వైభవానికి కొరత లేదు. అన్నమయ్య పరిష్కరణ ద్వారా పండితులు ఆ విషయాన్ని తేటతెల్లం చేశారు. మరీ ముఖ్యంగా, తెలుగు సాహిత్యంలో భాషాపరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవాలన్నా, గ్రాంథిక, వ్యావహారిక ప్రయోగాల అన్యోన్య దాంపత్యం ఎప్పటినుంచి తెలుగులో ఉందో తెలుసుకోవాలనుకున్నా, అన్నమయ్య చేసిన భాషా ప్రయోగాలను విధిగా చూడాలని గౌరీపెద్ది వారు తమ సంపాదకీయాల్లో ఘంటా బజాయించి మరీ చెప్పారు.


అన్నమయ్య గురించి ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు (‘చాలామంది ప్రబంధ కవులకు సాహిత్య భిక్ష పెట్టిన తాళ్లపాక అన్నమయ్య’) సాహిత్యవిశ్లేషణకు మార్గదర్శకాలు. రాగిరేకును ఎలా చదవాలి, వాటి కొలతలను ఎలా వ్యాఖ్యానించాలి అన్న లోతైన వివరణలు సాహిత్య పరిశోధనకు ప్రామాణికమైన వనరులు. గ్రాంథిక, వ్యావహారిక భాషల లక్షణాల్లోనూ, వ్యాకరణంలోనూ లోతైన పాండిత్యం కలిగిన శర్మగారు, తాళ్లపాక కవులు భాషకు ఒనగూర్చిన సౌందర్యాన్ని, వారి పదప్రయోగరీతులను, సమాసచాలనాన్ని విశేషంగా విశ్లేషించి చూపారు. ఆ తర్వాత ఈ విషయాలపై ప్రసంగాలు చేసి, గ్రంథాలు రచించిన ఎందరికో వీరు మార్గదర్శకులయ్యారు. (అందరూ ఆ విషయం చెప్పకపోయినా). 


తరచు రాళ్లపల్లివారిని తన గురువుగా ప్రస్తావించే గౌరిపెద్దివారిపట్ల, ఆయనే చెప్పినట్టు, రాళ్లపల్లివారికి పుత్ర వాత్సల్యమే ఉండేది. 1964-67 సంవత్సరాల్లో తిరుపతిలో గోవిందరాజస్వామి దక్షిణమాడావీధిలో మా తాతగారు రాళ్లపల్లివారి వద్ద మేం ఉన్నపుడు, రామసుబ్బశర్మగారిని చూడని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. నిత్యం సాయంత్రం ఆయన ఇంటికి రావడం, తాతగారితో కొన్ని గంటలు గడపడం కళ్లారా చూసిన దాన్నే. 


ఎన్నో సాయంత్రాలు, తలుపు చప్పుడు కాగానే బాల్యపు చాపల్యంతో ‘తాతా. రామసుబ్బయ్య’ అని అరుస్తూ లోపలికి పరిగెత్తడం గుర్తు. ఆయనని ఏకవచనంతో సంబోధించినందుకు తాతతో, అమ్మమ్మతో చివాట్లు తిన్న గుర్తు. ఆయన మాత్రం ఎంతో అపేక్షగా నవ్వుతూ నా తల మీద చిన్న మొట్టికాయ వేసారు ఓసారి ఇలాగే అరిచినపుడు. తాతగారితో పాటు, మేం (నా అక్కలు, అన్న) కూడ ఆయన రాకకోసం ఎదురు చూసేవాళ్లమేమో. ఆయన రాని రోజు ఏదో వెలితి ఏడెనిమిదేళ్ల నాకే అనిపించేది. ఆ వెలితిని తీర్చగలిగినవి ఆయన రచనలే.

(గౌరిపెద్ది రామసుబ్బశర్మగారి శతజయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్‌ 10న ఆయన కాంస్య విగ్రహావిష్కరణ జరుగుతున్న సందర్భంగా చిరునివాళి.)

మృణాళిని

Updated Date - 2022-09-05T07:00:35+05:30 IST