సత్యదేవుడి ఆలయం.. సమస్యల వలయం..!

ABN , First Publish Date - 2022-07-07T05:48:58+05:30 IST

రాష్ట్రంలో తిరుపతి తరువాత అంతటి ప్రాశస్త్యం ఉన్న ఆలయంగా అన్నవరం సత్యదేవుడి ఆలయం ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కొంతకాలంగా పాతుకుపోయిన సిబ్బంది ఇటీవలే ప్రభుత్వ నిబంధనల మేరకు 44మంది బదిలీపై వెళ్లారు. వారి స్థానంలో వివిధ దేవాలయాలనుంచి సిబ్బంది ఇక్కడికి వచ్చి విధుల్లో చేరారు. ఆలయ కార్యనిర్వహణాధికారి సైతం ఇటీవలే కొత్తగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు అస్తవ్యస్త పాలనగా సాగిన అన్నవరం ఆలయంలో కొత్త వ్యక్తులు రాకతో ఇకనైనా ప్రక్షాళన దిశగా సాగుతుందా లేదా అని భక్తులు ఎదురుచూస్తున్నారు.

సత్యదేవుడి ఆలయం..  సమస్యల వలయం..!

  • రత్నగిరిపై దళారులదే రాజ్యం
  • అన్నవరానికి నూతన ఈవో, 44మంది కొత్త సిబ్బంది రాక
  • ఇకనైనా ప్రక్షాళన జరిగేనా?
  • అడుగడుగునా దోపిడీకి  గురవుతున్న భక్తులు

రాష్ట్రంలో తిరుపతి తరువాత అంతటి ప్రాశస్త్యం ఉన్న ఆలయంగా అన్నవరం సత్యదేవుడి ఆలయం ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కొంతకాలంగా పాతుకుపోయిన సిబ్బంది ఇటీవలే ప్రభుత్వ నిబంధనల మేరకు 44మంది బదిలీపై వెళ్లారు. వారి స్థానంలో వివిధ దేవాలయాలనుంచి సిబ్బంది ఇక్కడికి వచ్చి విధుల్లో చేరారు. ఆలయ కార్యనిర్వహణాధికారి సైతం ఇటీవలే కొత్తగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు అస్తవ్యస్త పాలనగా సాగిన అన్నవరం ఆలయంలో కొత్త వ్యక్తులు రాకతో ఇకనైనా ప్రక్షాళన దిశగా సాగుతుందా లేదా అని భక్తులు ఎదురుచూస్తున్నారు.


అన్నవరం, జూలై 6: అన్నవరం సత్యదేవుడి ఆలయంలో భక్తులు అడుగడుగునా దోపిడీకి గురవుతున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఉన్నతాధికారులు ఎవ్వరూ తమ సీట్లలోంచి కదలకుండా కార్యాలయాలకే పరిమితమవుతుండడం దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దీంతో కిందిస్థాయి సిబ్బంది కొందరు ఇష్టారీతిన వ్యవహరిస్తూ స్వామివారి ఖజానాకు నష్టం చేకూరుస్తూ తమ జేబులు నింపుకుంటున్నారు. ఆలయంలో ప్రధాన సమస్యలపై నూతన ఈవో మూర్తి దృష్టిసారించి ఆలయానికి పూర్వవైభవం తీసుకురావాలని భక్తులు కోరుతున్నారు. భక్తులు ఎదుర్కొంటున్న దోపిడీ, దేవస్థానంలో ఇతర సమస్యలపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.


ఆలయ విభాగంలో దళారుల పెత్తనం

భక్తులు ఈ విభాగంలోనే స్వామిని దర్శించుకుంటారు. ఇక్కడ కిందస్థాయి ఉద్యోగులతో కలిసి కొందరు దళారులు పెత్తనం చెలాయిస్తున్నారు. దర్శనాల పేరుతో భక్తులకు తక్కువ వ్యవధిలో దర్శనం చేయిస్తామని  మాయమాటలు చెప్పి వేలాది రూపాయలు స్వామివారి ఖజానాకు చేరకుండా గండి కొడుతూ తమ జేబులు నింపుకుంటున్నారు. గర్భాలయ దర్శనానికి దేవస్థానంలో ఒక్కో భక్తుడికి రూ.200 టిక్కెట్టు నిర్ణయించారు. దళారులు వారితో బేరాలు ఆడుకుని ఆలయంలో పనిచేసే సిబ్బందితో కుమ్మకై వారికి కొంత మొత్తం అందజేసి తమ పని కానిస్తున్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరించి కట్టడి చేస్తే ఏటా రూ.కోటికి పైగా స్వామివారి ఖజానాకు జమవుతుంది. ప్రముఖుల సిఫార్సులతో దర్శనానికి విచ్చేసే భక్తులకు 50శాతం రాయితీ కల్పిస్తూ గతంలో అనధికారికంగా తీసుకున్న నిర్ణయాన్ని పాటిస్తే మంచి ఫలితాలు వచ్చి స్వామివారి ఖజానాకు మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇక్కడి ఆలయంలో పనిచేసే అర్చకులు భక్తుల చేతిలో డబ్బులను బట్టి ప్రవరిస్తున్నారు. దక్షిణ వేసుకున్నవారికి ఒకలా, లేకుంటే మరోలా చేస్తున్నారు. ఈ వ్యవహారంలో యంత్రాలయంలో అర్చకుల పరిస్థితి దారుణంగా ఉంది.


వ్రతాల విభాగంలో పురోహితుల డిమాండ్లు

భక్తుల జేబుకు చిల్లుబడే విభాగాల్లో ఇదే ప్రధానమైనది. ఇక్కడ భక్తులు తమ ఆర్థికస్తోమతను బట్టి రూ.300, రూ.800, రూ.1500, రూ.2000 ధరలతో టిక్కెట్లు తీసుకుని వ్రతమాచరిస్తూ ఉంటారు. ఇక్కడ పురోహితులు మాత్రం అన్నదానం, వస్త్రదానం పేరుతో టిక్కెట్టు రేటును బట్టి డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారనే ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. స్వామివారి ఐదు వ్రత కథలకు ఎంత సమయం తీసుకుంటున్నారో దానాల పేరుతో అడిగే సుఫలం కార్యక్రమానికి అంతే సమయం తీసుకుంటున్నారని, పదేపదే దానాల అడుగుతున్నారని భక్తులు ఆవేదన చెందుతున్నారు. ఇలా దానాల పేరుతో వసూలు చేసే మొత్తంలో మూడొంతులు అటెండర్‌ నుంచి అన్నిస్థాయిల అధికారులకు పురోహితులు సమర్పించుకుంటున్నారు. దేవస్థానంలో జరిగే  కొన్ని కార్యక్రమాలకు పురోహిత సంఘం నుంచి ఆయా కార్యక్రమాలు నిర్వహించే అధికారులకు కొంత మొత్తం చెల్లించాల్సి రావడంతో వసూలు చేయాల్సి వస్తుందని వారు చె ప్తున్నారు. అధికారులు తమనుంచి ఏమీ ఆశించకుంటే భక్తులు సంతృప్తిగా ఇ చ్చింది తాము తీసుకుంటామని కొందరు వ్రతపురోహితులు పేర్కొంటున్నారు. దీనిపై ఈవో దృష్టిసారించి ప్రక్షాళన చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.


కేశఖండనశాలలోను అధిక దోపిడీనే..

తలనీలాలు సమర్పించుకునే భక్తులనుంచి కొందరు నాయిబ్రాహ్మణులు డ బ్బులు డిమాండ్‌ చేస్తున్నారనే ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. భక్తులు రూ.25 పెట్టి టిక్కెట్టు కొనుగోలు చేస్తే ఆ మొత్తం పనిచేసే నాయిబ్రాహ్మణులకే రెమ్యునరేషన్‌పై అందజేస్తారు. అయినా భక్తులను దోపిడీకి గురిచేస్తున్నారు.


అస్తవ్యస్తంగా సత్రం గదుల నిర్వహణ

దేవస్థానం సత్రం గదులను అద్దెకు తీసుకునే భక్తులు గదులు శానిటేషన్‌ నిర్వహణ సరిగా లేకపోవడంతో ఇ బ్బంది పడుతున్నారు. రెండు, మూడ్రోజుల వరకు దుప్పట్లు మార్చకపోవ డం.. స్నానపుగదులు, మరుగుదొడ్లను సరిగా పరిశుభ్ర చేయడం లేదనే ఫిర్యాదులు అందుతున్నాయి. ఏసీ గదులు తీసుకునే భక్తులకు ఏసీలు పనిచేయడంలేదని భక్తులు వివాదాలకు దిగిన సంఘటనలు ఇటీవల చోటుచేసుకున్నాయి. వారంలో ఒకసారి ఈవో సత్రం గదుల నిర్వహణ తీరుపై క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాల్సిన ఆవశ్యకత ఉంది.


గదుల కేటాయింపులపై విమర్శలు

రద్దీరోజుల్లో, వివాహాల సమయంలో గదులు దొరకడం కష్టతరంగా మారిం ది. దీనికి ప్రధాన కారణం పరపతి ఉన్న వివాహ బృందాలు వివిధ మార్గాల్లో 10నుంచి 20గదుల వరకు తీసుకుంటున్నాయి. దీంతో సామాన్యులకు వసతి కష్టతరంగా మారింది. ఒక్కో వివాహానికి రెండు గదులు మాత్రమే ఇచ్చే విధానాన్ని అమలు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇక్కడ దళారుల ప్రమేయం కూడా అధికంగా ఉంటుందనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి.


లీజుల విభాగంలో భారీ మామూళ్లు

ఈవో ప్రధానంగా దృష్టిసారించాల్సిన విభాగం ఇదే. ఏటా రూ.12కోట్లు ఆదా యం ఈ విభాగం నుంచే వస్తుంది. దశాబ్ధాలకాలంగా పాతుకుపోయిన కొంద రు వ్యాపారులు దేవస్థానం ఆదాయానికి గండికొట్టేలా సంబంధిత విభాగ కిం దస్థాయి సిబ్బందికి మూమూళ్లను ఇచ్చి దేవస్థానం ఖజానాకు చిల్లుపెడుతున్నారు. వేలంపాట సమయంలో దేవస్థానం నిర్దేశించిన ధరలను అమలులో ఇక్కడ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.


సెక్యూరిటీ విభాగంలో దర్శనాలా..?

భక్తులకు భద్రత కల్పించడం, ట్రాఫిక్‌ నియంత్రణ తదితర విధులు నిర్వహించాల్సిన ఈ విభాగ సిబ్బందిలో కొందరు. ఆ పనులను మానేసి దళారులకు తొత్తులుగా వ్యవహరిస్తూ వారిచ్చే సొమ్ములకు కక్కుర్తి పడి దర్శనాలు చేయించడం వంటి పనులు చేస్తూ ఉంటున్నారు. దీంతో భక్తులు దొంగల బారిన పడి విలువైన వస్తువులను పోగొట్టుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. దీనిపైనా దృష్టిసారించి భక్తుల విలువైన వస్తువులు తస్కరణకు గురికాకుండా చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

Updated Date - 2022-07-07T05:48:58+05:30 IST