నేడు టీచర్ల సీనియారిటీ జాబితాల ప్రకటన

ABN , First Publish Date - 2020-12-02T16:03:19+05:30 IST

టీచర్ల బదిలీల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకునే..

నేడు టీచర్ల సీనియారిటీ జాబితాల ప్రకటన

మచిలీపట్నం: టీచర్ల బదిలీల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకునే ప్రక్రియ పూర్తయింది. ఆన్‌లైన్‌లో 4571 మంది టీచర్లు బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఉపాధ్యాయులు ఖాళీలు, సీనియారిటీ లిస్టులు ప్రకటించిన అనంతరం తమకు నచ్చిన పాఠశాలను ఆప్షన్‌ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ విడుదల చేసిన నూతన షెడ్యూల్‌ ప్రకారం 27 రోజుల్లోనే బదిలీల ప్రక్రియ పూర్తి చేయవలసి ఉంది. ఈ నేపథ్యంలో సీనియారిటీ జాబితాలను బుధవారం ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసింది. వీటిపై ఈనెల 3, 4 తేదీల్లో అభ్యంతరాలు స్వీకరిస్తారు. 5 నుంచి 7వ తేదీ వరకు అభ్యంతరాలు పరిశీలిస్తారు. తుది సీనియారిటీ జాబితాను ఈనెల 8 నుంచి 10వ తేదీలోగా ప్రకటిస్తారు. వెబ్‌సైట్‌లో టీచర్లు తమకు కావలసిన పాఠశాలల ఐచ్చికాలను ఈనెల 11 నుంచి 15 వరకు నమోదు చేసుకుంటారు.


ఈనెల 16 నుంచి 21 వరకు బదిలీల ఉత్తర్వులపై దృష్టి సారిస్తారు. 22, 23 తేదీల్లో ఏమైనా అభ్యంతరాలుంటే స్వీకరిస్తారు. బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్న టీచర్లకు 24న బదిలీల ఉత్తర్వులు ఇస్తారు. దరఖాస్తు చేసుకున్న టీచర్లు ఉత్తర్వులను డౌన్‌లోడ్‌ చేసుకుంటారు. జిల్లా వ్యాప్తంగా 11,500 మంది టీచర్లు పనిచేస్తుండగా, విధిగా బదిలీ కావలసిన వారు 1165 మంది ఉన్నారు. రిక్వెస్ట్‌పై బదిలీకి దరఖాస్తు చేసుకున్న వారు 3406 మంది ఉన్నారు. ఇలా దరఖాస్తు చేసుకున్న టీచర్ల సీనియారిటీ జాబితాలనూ, ఖాళీలనూ ప్రదర్శించేందుకు విద్యాశాఖాధికారులు కసరత్తు చేస్తున్నారు.


Updated Date - 2020-12-02T16:03:19+05:30 IST