రూ. 16,231 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక

ABN , First Publish Date - 2022-06-25T07:03:44+05:30 IST

తిరుపతి జిల్లాకు సంబంధించి తొలి రుణ ప్రణాళికను కలెక్టర్‌ కె.వెంకట్రమణారెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు.

రూ. 16,231 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక

తిరుపతి, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లాకు సంబంధించి తొలి రుణ ప్రణాళికను కలెక్టర్‌ కె.వెంకట్రమణారెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. కలెక్టరేట్‌లోని మీటింగ్‌ హాల్లో జరిగిన జిల్లాస్థాయి రుణ సమీక్షా సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నాబార్డు అధికారులు రూ. 16,231.36 కోట్లతో  రూపొందించిన జిల్లా రుణ ప్రణాళిక బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు. అనంతరం వివిధ బ్యాంకుల కంట్రోల్‌ అధికారులు, వివిధ శాఖల అధికారులనుద్దేశించి మాట్లాడుతూ రుణ ప్రణాళికను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటే కొత్త జిల్లా అభివృద్ధి పధంలో ముందుకు వెళుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.రుణ ప్రణాళికలో వ్యవసాయ, దాని అనుబంధ రంగాలకు రూ. 8844 కోట్లు కేటాయించడం ద్వారా ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు.చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ. 2484 కోట్లు, ప్రాధాన్యతా రంగాలకు రూ. 1074 కోట్లు చొప్పున కేటాయించామన్నారు.ప్రాధాన్యేతర రంగాల విషయానికొస్తే రూ. 3828 కోట్ల మేరకు కేటాయింపు జరిగిందన్నారు. రుణ ప్రణాళికలో భాగంగా 15 వేల గ్రామీణ, 4200 పట్టణ మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ. 899.89 కోట్లు అందించాల్సి వుందన్నారు. కౌలు రైతులకు రుణాలందించడం కోసం ఆర్బీకేల వారీగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని బ్యాంకర్లకు పంపాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. పంట రుణాలకు సంబంధించిన లక్ష్యాలను ఖచ్చితంగా సాధించాలని స్పష్టం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రుణాల పంపిణీ లక్ష్యాలలో ఇప్పటి వరకూ 40 శాతం మాత్రమే పూర్తయిందని, మిగిలిన 60 శాతం వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటికే మంజూరైన జగనన్న తోడుకు సంబంధించి రూ. 2014 కోట్లలో వంద శాతం తిరిగి చెల్లించిన వారికి ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తుందన్నారు. కొత్తగా సర్వే చేసి అర్హత కలిగిన వారికి జగనన్న తోడు అందించేలా వచ్చే నెల రెండో తేదీ లోపు జాబితా సిద్ధం చేయాలని డీఆర్‌డీఏ పీడీని ఆదేశించారు. సూళ్ళూరుపేట, వెంకటగిరి డివిజన్లలో మెప్మా లబ్ధిదారులకు వంద శాతం రుణాలు ఇవ్వడం అభినందనీయమన్నారు.టిడ్కో, ఎంఎస్‌ఎంఈ, పశు సంవర్ధక, మత్స్య శాఖ, హౌసింగ్‌ శాఖ, ఎస్సీ కార్పొరేషన్‌, బీసీ కార్పొరేషన్‌ కార్యక్రమాల గురించి సమీక్షించారు. ఎల్‌డీఎం శేషగిరిరావు, నాబార్డు డీడీఎం సునీల్‌, వ్యవసాయ శాఖ జేడీ దొరసాని, పరిశ్రమల కేంద్ర జీఎం ప్రతాప్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ ప్రభావతి, మెప్మా పీడీ రాధమ్మ, ఉద్యాన శాఖ అధికారి సుబ్బారెడ్డి, మత్స్యశాఖ అధికారి నాయక్‌, హౌసింగ్‌ ఓఎస్డీ రామచంద్రారెడ్డి, వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-25T07:03:44+05:30 IST