మరో 22 కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-07-06T10:09:13+05:30 IST

జిల్లాలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. అన్ని మండలాల్లోనూ కేసులు నమోదవుతున్నాయి.

మరో 22  కరోనా కేసులు

జిల్లాలో మొత్తం కరోనా కేసులు 371

విజయనగరంలో ఒకేరోజు 12 మందిలో వైరస్‌ నిర్ధారణ

సాలూరులో పెరుగుతున్న అనుమానితులు


రింగురోడ్డు/ విజయనగరం(ఆంధ్రజ్యోతి), జూలై 5: జిల్లాలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. అన్ని మండలాల్లోనూ కేసులు నమోదవుతున్నాయి. విజయనగరంలో ఇటీవల కాలంలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా ఆదివారం పట్టణంలో 12 మందిలో కరోనా నిర్ధారణ అయింది. జిల్లా అంతటా కలసి మొత్తం కేసుల సంఖ్య 371కు చేరింది. అధికంగా కేసులు నమోదవుతుండడంతో విజయనగరం వాసులు టెన్షన్‌ పడుతున్నారు. చాలా ప్రాంతాల్లో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేస్తున్నారు. అధికారులు, పోలీసులు అప్రమత్తంగా ఉంటున్నా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. ప్రజల్లోనూ కొన్ని లోపాలున్నాయని అధికారులు చెబుతున్నారు.


మార్కెట్‌కు వచ్చే వారు భౌతిక దూరం పాటించడం లేదు. ఒకే దుకాణంలో గుంపుగా జనం కనిపిస్తున్నారు. మాస్క్‌లు పెట్టుకోవడం లేదు.  వైరస్‌ వ్యాప్తి పెరుగుతున్న దశలో ప్రజలు జాగ్రత్తలు పాటించకుంటే ప్రమాదమని వైద్యులు  సూచిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఆదివారం 22 కేసులు నమోదయ్యాయి. పార్వతీపురం-3, బొబ్బిలి-2, ఎస్‌.కోట-1, కొత్తవలస-1, జామి-1, సీతానగరం-1, వేపాడ-1, విజయనగరంలో-12  కేసులు వచ్చాయి. వీరందరినీ కొవిడ్‌ ఆసుపత్రికి తరలించినట్టు ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డాక్టరు జె.రవికుమార్‌ తెలిపారు.


సాలూరుపై కరోనా పడగ

సాలూరు/ సాలూరు రూరల్‌: సాలూరుపై కరోనా పడగ విప్పుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. సాలూరు పట్టణంలో ఆదివారం ఒక్కరోజే నలుగురిలో వైరస్‌ లక్షణాలు కనిపించాయి. పట్టణంలో ఇటీవల పాజిటివ్‌గా గుర్తించిన మహిళ ఇంటిలో పని చేస్తున్న మహిళ, ఆమె భర్తలో తాజాగా కరోనా లక్షణాలు కనిపించాయి. అలాగే విజయవాడ వెళ్లి వచ్చిన ఓ డ్రైవర్‌కు, ఇటీవల పాజిటివ్‌గా గుర్తించిన యువకుని తమ్ముడుకు పాజిటివ్‌ వచ్చినట్టు అధికారులు గుర్తించారు. సాలూరు అర్బన్‌, రూరల్‌ ప్రాంతం కలసి కేసుల సంఖ్య 19కు చేరినట్లు కొవిడ్‌-19 సాలూరు అధికారి శివకుమార్‌ ధ్రువీకరించారు. 


పాచిపెంట : పాచిపెంట మండలంలో తూర్పు బెల్ట్‌లో సాలూరుకు సమీపాన ఉన్న ఓ గ్రామంలో ఆదివారం ఒక యువకుడికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్టు గుర్తించారు. ఆయన విజయవాడ నుంచి స్వగ్రామం చేరుకున్నాడు. 


శృంగవరపుకోట రూరల్‌ (జామి): మండలంలో ఆదివారం ఇద్దరిలో కరోనా లక్షణాలు కనిపించాయి. ఓ గ్రామానికి చెందిన యువకుడు హైదరాబాద్‌ చదువుకుంటూ పదిరోజుల కిందట స్వగ్రామానికి వచ్చి హోంక్వారంటైన్‌లో ఉంటున్నాడు. తాజాగా అతనిలో వైరస్‌ నిర్ధారణ అయింది. మరో గ్రామానికి చెందిన మామిడికాయల వ్యాపారికి వైరస్‌ ప్రబలింది. ఈయన ఇటీవల కోల్‌కతా నుంచి వచ్చాడు. 


పూసపాటిరేగ : మండలంలో ఓ మహిళకు పాజిటివ్‌ కేసు నమోదైంది. ఆమె గతనెల 30వ తేదీన హైదరాబాద్‌ నుంచి రైలులో స్వగ్రామం వచ్చింది. 


గరుగుబిల్లి : మండలంలోని ఓ గ్రామంలో ఆదివారం ఒక కేసు నమోదైంది. పది రోజుల కిందట హైదరాబాద్‌ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా లక్షణాలు బయటపడ్డాయి.


నిరంతరం జాగ్రత్తలు అవసరం..డాక్టర్‌ జె.రవికుమార్‌, ఇన్‌చార్జి, డీఎంఅండ్‌హెచ్‌వో

కరోనా రాకుండా నిరంతరం జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఒకసారి పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి రికవరీ అయిన తరువాత జాగ్రత్త లేకుంటే  మళ్లీ వైరస్‌ ప్రబలే ప్రమాదం ఉంది. మాస్క్‌లు ధరించడం.. భౌతికదూరం పాటించడం.. శానిటైజర్‌ వాడటం తప్పనిసరి. వీటిని పాటించిన వ్యక్తికి 80 శాతం వైరస్‌ దరి చేరదు.ఐసీఎంఆర్‌’ అనుమతించిన ఔషధం‘అర్తినిక్‌ఆల్బా’(ఆయుష్‌ విభాగంలో ఉచితంగా ఇస్తారు)ను ప్రతిరోజు 6 మాత్రలు నాలుగు రోజులు వినియోగిస్తే కొంత వరకు కరోనా నుంచి బయటపడవచ్చు. 

Updated Date - 2020-07-06T10:09:13+05:30 IST