స్వదేశానికి మరో 419 మంది.. విద్యార్థుల తరలింపునకు గంటకు రూ. 7-8లక్షలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-02-28T13:25:35+05:30 IST

ఆ విద్యార్థుల్లో హమ్మయ్యా స్వదేశానికి చేరామనే ఆనందం! ఈ నాలుగైదు రోజు లు అక్కడ ఎలా గడిపారు? అని అడిగితే.. బాబోయ్‌ అంటూ ఉలికిపాటు. క్షేమంగా ఇంటికి వచ్చామంటూనే ఉక్రెయిన్‌ నుంచి బయట

స్వదేశానికి మరో 419 మంది.. విద్యార్థుల తరలింపునకు గంటకు రూ. 7-8లక్షలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం

బుకారెస్ట్‌ నుంచి ఢిల్లీకి స్వాగతం పలికిన సింధియా 

ఉక్రెయిన్‌లో ఇంకా 13వేల మంది భారతీయులు

‘ఆపరేషన్‌ గంగ’ ద్వారా ఇప్పటిదాకా 688 మంది.. 

వీరిలో 39 మంది తెలంగాణ, 17 మంది ఏపీ విద్యార్థులు

ఒక్క విమానానికి 1.10 కోట్లు


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: ఆ విద్యార్థుల్లో హమ్మయ్యా స్వదేశానికి చేరామనే ఆనందం! ఈ నాలుగైదు రోజు లు అక్కడ ఎలా గడిపారు? అని అడిగితే.. బాబోయ్‌ అంటూ ఉలికిపాటు. క్షేమంగా ఇంటికి వచ్చామంటూనే ఉక్రెయిన్‌ నుంచి బయట పడ్డామంటే తమది అదృష్టం అంటున్నారు. ‘‘ఉక్రెయిన్‌లో రాయబార కార్యాలయాని కి పెట్టుకున్న దరఖాస్తుల్లో అదృష్టవశాత్తు తొలి జాబితాలో నాకు చోటు దక్కింది.’’ అని జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్‌కు చెందిన ఎంబీబీఎస్‌ విద్యార్థిని ఏలేటి హిమబిందు ఆనందం వ్యక్తం చేశారు. ఆమె రొమేని యా నుంచి ప్రత్యేక విమానం ద్వారా ముంబైకి.. అక్క డి నుంచి మరో విమానం ద్వారా హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో ఇంకా వేల సంఖ్యలో భారతీయ విద్యార్థులు స్వదేశానికి వచ్చేందుకు ఎదురుచూస్తున్నారని చెప్పారు. అదే విమానంలో ముంబైలో దిగి.. స్వస్థలం కాప్రా చేరుకున్న కామన భానుశ్రీ మరో విద్యార్థిని.. తాను 21నే ఉక్రెయిన్‌ నుంచి తిరిగొచ్చేయాలనుకున్నానని, అమెరికాతో పాటు ఇతర దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతుగా ఉన్నందున యుద్ధం రాదని వర్సిటీ యాజమాన్యం చెప్పడంతో ఉండిపోయానని చెప్పారు. ఈమె బుకోవినియన్‌లో ఎంబీబీఎస్‌ చదువుతున్నారు.


24న స్వదేశానికి వచ్చేందుకు కీవ్‌కు రైల్లో బయలుదేరినా అప్పటికే యుద్ధం మొదలవడంతో వెనక్కి వచ్చామన్నారు. ఇండియాకు తిరిగొస్తానో రానో అని భయపడ్డాడని చెప్పారు. ఇలా స్వదేశానికి తిరిగొచ్చిన ఏ విద్యార్థిని కదిలించినా ఉక్రెయిన్‌లో క్షణమొక యుగం లా గడిపిన జ్ఞాపకాలను పంచుకున్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించే ‘ఆపరేషన్‌ గంగ’ కార్యక్రమం ఊపందుకోవడంతో మరో రెండు విమానాల ద్వారా 419 మంది భారత్‌కు చేరుకున్నారు. ఇప్పటికే రొమేనియా రాజధాని బుకారెస్ట్‌ నుంచి ఎయిర్‌ ఇండియాకు చెందిన రెండు విమానాల్లో 269 (250+219) మంది ముంబై, ఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే. బుకారెస్ట్‌ నుంచి 240 మందితో మూడో విమానం ఆదివారం ఉదయం 9:20 గంటలకు.. నాలుగో విమానం 198 మందితో సాయంత్రం 5:25 గంటలకు ఢిల్లీలో దిగాయి. దీంతో ఇప్పటిదాకా నాలుగు విమానాల ద్వారా 688 మంది స్వదేశానికి చేరుకున్నట్లయింది. వీరిలో తెలంగాణకు చెందినవారు 39 మంది, ఏపీకి చెందినవారు 17 మంది.. మొత్తం 56 మంది తెలుగు విద్యార్థులున్నారు. వీరంతా ముంబై, ఢిల్లీ నుంచి విమానాల ద్వారా స్వస్థలాలకు చేరుకున్నారు. ఆదివారం ఉదయం మూడో విమానంలోంచి దిగిన విద్యార్థులకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గులాబీలు ఇచ్చి స్వాగతం పలికారు.





విద్యార్థులను రిసీవ్‌ చేసుకునేందుకు వచ్చిన కుటుంబసభ్యులు, బంధువులు వారిని చూసి కన్నీరు పెట్టుకోవ డం, ఆనందభాష్పాలతో ఆలింగనం చేసుకోవడం వంటి దృశ్యాలతో విమానాశ్రయంలో భావోద్వేగ వా తావరణం నెలకొంది. ఉక్రెయిన్‌లో ఇంకా దాదాపు 13 వేల మంది భారతీయులు ఉన్నారని, అందరినీ త్వరలోనే వెనక్కి తీసుకొస్తామని సింధియా చెప్పారు. ‘‘మీరు వేసే ప్రతి అడుగు వెనక ప్రధాని మోదీ, భారత ప్రభుత్వం, దేశంలోని 130కోట్ల మంది ప్రజలు ఉన్నారు’’ అని ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులకు భరోసా ఇచ్చారు. కాగా, కొందరు పొలండ్‌ సరిహద్దులో చిక్కుకున్నట్లు అక్కడ పనిచేస్తున్న భారత్‌కు చెందిన స్వచ్ఛంద కార్యకర్త రుచిర్‌ కతారియా వెల్లడించారు.  


విమానానికి గంటకు రూ.7-8 లక్షలు

ఉక్రెయిన్‌ నుంచి మన విద్యార్థులను ఉచితంగా భారత్‌కు తరలించేందుకు సరిహద్దు దేశాలకు ప్రత్యేక విమానాలను నడుపుతున్న ఎయిర్‌ ఇండియా సంస్థ పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తోంది. బుకారె్‌స్టకు రానూ పోనూ విమానానికి రూ.1.10 కోట్లు అవుతుంది. పెద్ద సంఖ్యలో విద్యార్థులను తరలించేందుకు 250 సీట్లు ఉన్న బోయింగ్‌787-డ్రీమ్‌లైనర్‌ను వినియోగిస్తున్నారు.  


తిండికి, నీళ్లకు ఇబ్బంది పడ్డాం 

ఉక్రెయిన్‌లో పరిస్థితి భయానకంగా ఉందని హైదరాబాద్‌కు తిరిగొచ్చిన ప్రియాంక చెప్పారు. చున్‌విస్టీ వర్సిటీలో ఆమె ఎంబీబీఎస్‌ చదువుతున్నారు. ఉక్రెయిన్‌లో పశ్చిమ ప్రాంతం సురక్షితంగా ఉందని, తూర్పు ప్రాంతం దారుణంగా ఉందని తెలిపింది. తాను 4 రోజులుగా సరైన తిండి, నీళ్లు లేక ఇబ్బందిపడ్డానని చెప్పింది. ఉక్రెయిన్‌లోని చెర్నివ్‌స్టీలో చదువుతున్న 22 ఏళ్ల చల్లా సుదర్శన బుకారెస్ట్‌ నుంచి ముంబైకి.. అక్కడి నుంచి స్వస్థలం ఏపీలోని రాజమండ్రికి అతి కష్టం మీద చేరుకున్నారు. 


సరిహద్దుల్లో మరిన్ని పాయింట్ల ఏర్పాటు

ఉక్రెయిన్‌ నుంచి విద్యార్థుల తరలింపు కోసం రొమేనియా, హంగరీ సరిహద్దుల్లో మరిన్ని పా యింట్లు ఏర్పాటు చేస్తామని అక్కడి భారత రాయబార కార్యాలయం పేర్కొంది. కర్ఫ్యూలేని ప్రాంతాల నుంచి బాధితులు, రైళ్ల ద్వారా సరిహద్దుల వైపు రావాలని సూచించింది. ఉక్రెయిన్‌ రైల్వే శాఖ కూడా విదేశీ విద్యార్థుల తరలింపు కోసం ఉచితంగా ప్రత్యేక రైళ్లను నడుపుతోందని వెల్లడించారు. రైళ్లలో తరలింపులో చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులకు ప్రాధాన్యమిస్తారని.. వెంట స్వెట్టర్లు, కంబళి, వీలైనంత నగదు రూపంలో అవసరమైన వస్తువులే తెచ్చుకోవాలని సూచించింది. ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాల నుంచి భద్రతా మార్గదర్శకాలను పాటించి పశ్చిమ ఉక్రెయిన్‌ సరిహద్దు వైపు రావాలని చెప్పింది.


Updated Date - 2022-02-28T13:25:35+05:30 IST