మరో 47వేల మందికి..

ABN , First Publish Date - 2022-08-18T05:03:31+05:30 IST

వృద్ధాప్య వయసును 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఈ పంద్రాగస్టు నుంచి ఆసరా పెన్షన్ల మంజూరు మొదలయ్యాయి. తాజాగా హోంశాఖ మంత్రి మహమూద్‌అలీ ఆసరా గుర్తింపు కార్డులను అందజేసిన విషయం తెలిసిందే.

మరో 47వేల మందికి..

ఆసరా పింఛన్లకు మెదక్‌ జిల్లాలో అర్హులు 20,258 మంది,

సంగారెడ్డి జిల్లాలో 27,594 మంది

మెదక్‌లో 4,691 మందిపై అనర్హత వేటు  

పెన్షన్‌దారులకు ఆసరా గుర్తింపుకార్డులు


 ఆంధ్రజ్యోతిప్రతినిధి, సంగారెడ్డి, ఆగస్టు 17: వృద్ధాప్య వయసును 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఈ పంద్రాగస్టు నుంచి ఆసరా పెన్షన్ల మంజూరు మొదలయ్యాయి. తాజాగా హోంశాఖ మంత్రి మహమూద్‌అలీ ఆసరా గుర్తింపు  కార్డులను అందజేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి దాకా వృద్ధాప్య పెన్షన్‌ 65 సంవత్సరాల వయసుపైనున్న పేదవారికి ప్రభుత్వం నెలకు రూ.2016 చొప్పున అందజేసింది. సంగారెడ్డి జిల్లాలో 43,733 మందికి వృద్ధాప్య పెన్షన్‌ ఇస్తున్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 57 ఏళ్లు నిండిన అర్హులైపేదలకు ఈ ఆగస్టు 15 నుంచి ప్రభుత్వం మంజూరు చేస్తున్నది. వృద్ధాప్య వయసును 57 ఏళ్లకు తగ్గిస్తూ ప్రభుత్వం ప్రకటన చేసినప్పటి నుంచి అర్హులైన వారి నుంచి జిల్లా యం త్రాంగం మూడు విడతలుగా దరఖాస్తులు తీసుకున్నది. తొలుత ఓటరు గుర్తింపు కార్డుల ద్వారా 19,920 మంది పేదలైన వృద్ధులు దరఖాస్తులను అందజేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకు రెండో విడతలో  ఆధార్‌కార్డుల ఆధారంగా  మీ-సేవ ద్వారా 5,545 మంది దరఖాస్తు చేసుకున్నారు. మరికొద్ది రోజులకు మూడో విడతలోనూ మీ-సేవ ద్వారా 2,129 మంది దరఖాస్తులు చేశారు. ఈ రకంగా మూడు విడతల్లో 57-64 ఏళ్ల మధ్య ఉన్న పేదలైన వృద్ధులు 27,594 మంది నుంచి జిల్లా యంత్రాంగానికి దరఖాస్తులు వచ్చాయి. వీటిని పరిశీలించిన జిల్లా యంత్రాంగం అన్ని దరఖాస్తులు ఆసరా పెన్షన్‌కు అర్హతగా గుర్తించింది. ఇక ఇదే సమయంలో 65 ఏళ్లపైనున్న వారు 14,420 మంది ఆసరా పెన్షన్లకు దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో వృద్ధులు, వితంతువులతోపాటు వివిధ కేటగిరిలకు చెందిన వారు ఉన్నారు. వీరిలో 6,201 మంది మాత్రమే ఆసరా పెన్షన్లకు అర్హత ఉన్నారని జిల్లా యంత్రాంగం నిర్ధారించింది. ఈ రకంగా 57 ఏళ్లపై నున్న పేదలైన వృద్ధులు మొత్తం మీద 33,795 మందికి ఇక నుంచి నెలకు రూ.2016ల చొప్పున ఆసరా పెన్షన్‌ ఇవ్వనున్నారు. 


 నెలకు సుమారు రూ.7కోట్ల భారం

కొత్తగా మంజూరు చేసిన ఆసరా వృద్ధాప్య పెన్షన్లతో సంగారెడ్డి జిల్లాలో నెలకు సుమారు రూ.7కోట్ల భారం ప్రభుత్వ ఖజానాపై పడునున్నది. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ, చేనేత, గీత కార్మికులు తదితరులతో పాటు ఒంటరి మహిళలకు ప్రభుత్వం ఆసరా పెన్షన్‌ అందిస్తున్నది. ఈ సంగారెడ్డి జిల్లాలో వీరందరు కలుపుకుని ఇప్పటి వరకు 1,32,728 మందికి నెలకు రూ.29,65,552.00ను ప్రభుత్వం పెన్షన్ల రూపంలో చెల్లిస్తున్నది. తాజాగా మంజూరు చేసిన  పెన్షన్లతో పెన్షన్‌దారుల సంఖ్య 1,66,523 మందికి చేరగా నెల వారీ పెన్షన్‌ చెల్లింపు మొత్తం రూ.36 కోట్లకు చేరుకోనున్నది. 


పెన్షన్‌దారులకు గుర్తింపు కార్డులు

ఆసరా పెన్షన్‌ దారులకు ప్రభుత్వం ఇక నుంచి గుర్తింపు కార్డులు ఇవ్వనున్నది. తొలుత కొత్తగా పెన్షన్‌ మంజూరు చేసిన వారికి ఈ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. అనంతరం జిల్లాలో అన్ని కేటగిరీల పెన్షన్లు పొందుతున్న వారికి ఆసరా గుర్తింపు కార్డులు ఇవ్వడం జరుగుతుందనిన అధికార వర్గాలు తెలిపాయి. 


మెదక్‌ జిల్లాలో 20,258 మందికి భరోసా

మెదక్‌, ఆగస్టు17ః మెదక్‌ జిల్లాలో ఆసరా కొత్త దరఖాస్తుదారులకు మీసేవా కేంద్రం ద్వారా అధికారులు అర్జీలు స్వీకరించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మెదక్‌ పట్టణంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ లబ్ధిదారులకు ఆసరా గుర్తింపు కార్డులను అందజేశారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన  హామీని పరిగణలోకి తీసుకుని 57 ఏళ్లు నిండిన వారికి వృద్దాప్య పించన్‌ అందజేయాలని నిర్ణయించడంతో లబ్ధిదారుల సంఖ్య పెరిగింది. మెదక్‌ జిల్లా వ్యాప్తంగా 24 వేల మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నారు. అందులో 20,258 మందిని మాత్రమే అర్హులుగా పరిగణిస్తూ వారి బ్యాంకు ఖాతా వివరాలను సెర్ప్‌లో నమోదు చేశారు. 4,691 మందిని అనర్హులుగా గుర్తించారు.  ఆసరా పింఛన్ల వయస్సును 57 ఏళ్లకు తగ్గించడంతో జిల్లాలో 12,141 మంది కొత్తగా పింఛన్లు మంజూరయ్యాయి. వీరితో పాటు 1,779 వృద్ధాప్య పింఛన్లు, 4,255 వితంతు, 242 దివ్యాంగులకు, 8 చేనేత, 114 గీతా కార్మిక, 1546 బీడీ కార్మికులు, 149 ఒంటరి మహిళలు, 24 మంది పైలేరియా వ్యాధిగ్రస్తులకు పింఛన్లు అందనున్నాయి. జిల్లాలో ఇప్పటికే 1.1 లక్షల మందికి పెన్షన్‌ అందుతున్నది. వీరందరికీ ప్రతినెలా రూ.2016 చొప్పున, దివ్యాంగులకు రూ.3016 ప్రభుత్వం నుంచి అందుతున్నాయి. 


డయాలసిస్‌ రోగులకు? 

రాష్ట్ర ప్రభుత్వం డయాలసిస్‌ రోగులకు ఆసరా పింఛన్‌ వర్తింపజేయనుందని ప్రకటించినప్పటికీ ఇంకా అధికారులకు ఎలాంటి మార్గదర్శకాలు రాలేదని సమాచారం. జిల్లా వ్యాప్తంగా 75 మంది కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తులు డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. వీరు ఆర్థికంగా చితికిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టబోయే ఆసరా పింఛన్‌లో వీరికి కూడా రూ.2,016 ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆరోగ్యశ్రీ పథకం కింద కిడ్నీ రోగులకు ఉచితంగా డయాలసిస్‌ చికిత్స అందుతున్నది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రికార్డుల ప్రకారం 75 మంది కిడ్నీ రోగులు ఉండగా, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకుంటున్న వారు వందల సంఖ్యలో ఉన్నట్లు సమాచారం. 


దరఖాస్తుల స్వీకరణ పూర్తి

- శ్రీనివాస్‌, జిల్లాగ్రామీణాభివృద్ధి అధికారి, మెదక్‌

ఆసరా పెన్షన్లకు దరఖాస్తులను స్వీకరించడం పూర్తయ్యింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 20,258 మందికి కొత్తగా ఆసరా పింఛన్లు అర్హులను ఎంపిక చేశాం. వారందరికీ వచ్చే నెల నుంచి ఆర్థిక సహాయం అందే అవకాశం ఉంది.  

Updated Date - 2022-08-18T05:03:31+05:30 IST