మరో కులోన్మాద హత్య

ABN , First Publish Date - 2022-05-21T08:11:01+05:30 IST

కులం కాని వాడు తమ అమ్మాయిని ప్రేమించి, ఇంట్లోంచి తీసుకెళ్లి పెళ్లిచేసుకున్నాడని యువతి తల్లిదండ్రులు కక్ష పెంచుకున్నారు.

మరో కులోన్మాద హత్య

  • బేగంబజార్‌లో నడి రోడ్డుపై దారుణం
  • కత్తులతో 20సార్లు పొడిచి.. 
  • రాడ్లతో కొట్టి, గ్రానైట్‌ రాయి ఎత్తేసి..
  • యువకుడ్ని దారుణంగా చంపిన దుండగులు
  • నాగరాజు ఘటన మరువక ముందే మరో హత్య
  • ఏడాదిన్నర క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్న నీరజ్‌
  • భార్య, మూడు నెలల కొడుకుతో కాపురం
  • కక్ష పెంచుకున్న యువతి కుటుంబ సభ్యులు
  • పథకం వేసి.. దారుణంగా హతమార్చిన వైనం
  • పోలీసుల అదుపులో ఐదుగురు నిందితులు..?


హైదరాబాద్‌ సిటీ/అఫ్జల్‌గంజ్‌, మే 20 (ఆంధ్రజ్యోతి): కులం కాని వాడు తమ అమ్మాయిని ప్రేమించి, ఇంట్లోంచి తీసుకెళ్లి పెళ్లిచేసుకున్నాడని యువతి తల్లిదండ్రులు కక్ష పెంచుకున్నారు. వివాహం చేసుకుని వచ్చి తమ కళ్ల ముందే కాపురం పెట్టాడని ఆగ్రహంతో రగిలిపోయారు. ఆ యువకుడిని ఎలాగైనా అంతం చేయాలని నిర్ణయించుకున్నారు. ఏడాదిన్నర నుంచి అదును కోసం ఎదురుచూస్తున్నారు. చివరకు శుక్రవారం పక్కాగా పథకం అమలు చేశారు. యువకుడిని అడ్డగించి నడిరోడ్డుపై కత్తులతో పొడిచారు. రాడ్లతో కొట్టి, గ్రానైట్‌ను తలపై ఎత్తేసి దారుణంగా హతమార్చారు. శుక్రవారం రాత్రి బేగంబజార్‌లో జరిగిందీ ఘోరం. సరూర్‌నగర్‌ పరిధిలో ఇటీవల జరిగిన నాగరాజు హత్యను మరువక ముందే.. రాజధానిలో మరో యువకుడిని నడి రోడ్డుపై చంపడం సంచలనం సృష్టించింది. ప్రేమ వివాహం చేసుకున్నారని.. 15 రోజుల వ్యవధిలోనే ఇద్దరు యువకులను హతమార్చడం హైదరాబాద్‌లో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్వాడీ అయిన మహేందర్‌ పర్వాన్‌ కుటుంబంతో కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి బేగంబజార్‌ పరిధిలోని కొల్సావాడి ప్రాంతంలో స్థిరపడ్డారు.


 ఆయన పల్లీల హోల్‌సేల్‌ బిజినెస్‌ చేస్తుంటారు. కుమారుడు నీరజ్‌ పర్వాన్‌(25) వ్యాపారంలో తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. అదే ప్రాంతంలో ఉంటున్న సంజనతో అతడికి పరిచయం ఏర్పడింది. యాదవ సామాజిక వర్గానికి చెందిన సంజన తల్లిదండ్రులు ఉత్తర భారత దేశం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. సంజన, నీరజ్‌ పరిచయం ప్రేమగా మారింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆమెను మందలించారు. తమ కూతురు జోలికి రావొద్దని నీరజ్‌ను హెచ్చరించారు. గతేడాది ఏప్రిల్‌లో సంజన, నీరజ్‌లు ఇంట్లోంచి వెళ్లిపోయి ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. రెండు నెలలపాటు అందరికీ దూరంగా ఉన్నారు. తర్వాత సంజన గర్భవతి కావడంతో తిరిగి అదే కాలనీకి వచ్చి ఉంటున్నారు. తమ కూతురిని తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడని కక్షపెంచుకున్న సంజన కుటుంబ సభ్యులు నీరజ్‌పై అఫ్జల్‌గంజ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇరు కుటుంబాలను పిలిచి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపారు. దంపతులు మేజర్లు అనిని, వారి బతుకు వారిని బతకనివ్వాలని, హాని తలపెట్టొద్దని చెప్పారు. ఈ క్రమంలో సంజన మగ శిశువుకు జన్మనిచ్చింది. ప్రస్తుతం బాబుకు 3 నెలలు.


అదునుకోసం ఎదురు చూసి..

నీరజ్‌పై ఎలాగైనా పగ తీర్చుకోవాలని చూసిన సంజన కుటుంబసభ్యులు అదునుకోసం ఎదురు చూశారు. కొద్దిరోజులుగా నీరజ్‌ను హతమార్చాలని పథకం వేశారు. ఐదుగురు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. పక్క వీధిలో పల్లీల వ్యాపారం చేస్తున్న తన మామ వద్దకు శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో నీరజ్‌ వెళ్లాడు. స్కూటీపై తిరిగి వస్తుండగా.. గుర్తుతెలియని వ్యక్తులు రెండు బైక్‌లపై వెంబడించారు. నీరజ్‌ తన ఇంటి సమీపంలోకి రాగానే.. అతడి స్కూటీని ఢీ కొట్టారు. దాంతో అతడు కింద పడిపోయాడు. వెంటనే బైక్‌లు దిగిన దుండగులు కత్తులతో నీరజ్‌పై దాడిచేశారు. 20సార్లు విచక్షణా రహితంగా పొడిచారు. తర్వాత రాడ్లతో కొట్టారు. చనిపోయాడో లేదోననే అనుమానంతో అక్కడే ఉన్న గ్రానైట్‌ రాయిని నీరజ్‌పై ఎత్తేశారు. అతడు మరణించాడని నిర్ధారించుకున్న తర్వాత రెండు బైక్‌లపై పారిపోయారు. 


కాపాడే ప్రయత్నం చేయని స్థానికులు..

నీరజ్‌ను నడిరోడ్డుపై దారుణంగా హత్య చేస్తుండగా వందలాది మంది అక్కడే నిలబడి చోద్యం చూశారు. వందలాది దుకాణాలు ఉన్నప్పటికీ అక్కడున్న వారెవరూ అతడిని కాపాడే ప్రయత్నం చేయలేదు. కొంత మంది హత్యను సెల్‌ఫోన్‌లో వీడియోలు తీస్తూ కనిపించారు. అచ్చం సరూర్‌నగర్‌లో జరిగిన నాగరాజు హత్యను తలపించేలా జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.


పోలీసుల అదుపులో నిందితులు?

సమాచారం అందుకున్న షాహినాయథ్‌ గంజ్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏసీపీ సతీష్‌, వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌, క్రైమ్‌ టీమ్‌ పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలిస్తున్నారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రెండు బైక్‌లపై ఐదుగురు వచ్చి నీరజ్‌ను హత్యచేసిన పారిపోతున్నట్లు పోలీసులు సీసీ కెమెరాల్లో గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని బైక్‌లు, కత్తులు, రాడ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. నీరజ్‌పై కక్షపెంచుకున్న యువతి కుటుంబ సభ్యులే మరికొంతమందితో కలిసి ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. కాగా, నీరజ్‌ను హత్యచేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని వందల సంఖ్యలో మార్వాడీ సమాజ్‌ కుటుంబాల సభ్యులు బేగంబజార్‌ రోడ్డుపై ధర్నా చేశారు. నీరజ్‌ హత్యకు నిరసనగా శనివారం బేగంబజార్‌ బంద్‌కు మార్వాడీ వ్యాపారులు పిలుపునిచ్చారు.

Updated Date - 2022-05-21T08:11:01+05:30 IST