ఎన్నికల డ్రామా: 10 లక్షల ఉద్యోగాల ప్రకటనపై మాయావతి

ABN , First Publish Date - 2022-06-14T23:27:29+05:30 IST

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాలు, పని తీరు వల్ల పేదరికం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం తారాస్థాయికి చేరుకుంది. రూపాయి విలువ అత్యంత పతనానికి పడిపోయింది. ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాలని ఇప్పుడు కొత్త నాటకానికి తెర తీశారు..

ఎన్నికల డ్రామా: 10 లక్షల ఉద్యోగాల ప్రకటనపై మాయావతి

లఖ్‌నవూ: వచ్చే ఏడాదిన్నరలో దేశవ్యాప్తంగా 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన ప్రకటనపై బహుజన్ సమాజ్ పార్టీ అధినేత మాయావతి తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఎన్నికల కోసం కొత్త నాటకం ఆడుతున్నారంటూ ఆమె విమర్శించారు. పేదరికం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం తారా స్థాయిలో ఉంటే 10 ఉద్యోగాలంటూ బూటకపు వాగ్దానాలు చేస్తున్నారని, ఇదే వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసమేనని మాయావతి విమర్శించారు.


మంగళవారం తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా మాయావతి స్పందిస్తూ ‘‘కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాలు, పని తీరు వల్ల పేదరికం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం తారాస్థాయికి చేరుకుంది. రూపాయి విలువ అత్యంత పతనానికి పడిపోయింది. ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాలని ఇప్పుడు కొత్త నాటకానికి తెర తీశారు. అటుఇటుగా అది ఎన్నికల సమయం. అంటే ఈ బూటకపు వాగ్దానం వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసమే కదా?


అదే సమయంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన అనేక ప్రభుత్వ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని ఎందుకు భర్తీ చేయడం లేదు. ఈ భర్తీలను వెంటనే నింపాలని బీఎస్పీ డిమాండ్ చేస్తోంది. ఈ విషయమై పార్లమెంట్ లోపల, బయట ప్రత్యేక ప్రచారం నిర్వహిస్తాం. ఈ సమాజం నిరుద్యోగం, పేదరికం మూలంగా అత్యంత విచారంలో, దు:ఖంలో ఉన్నాయి. ప్రభుత్వం వీటి గురించి మౌనంగా ఉంది’’ అని అన్నారు.

Updated Date - 2022-06-14T23:27:29+05:30 IST