HYD : ప్రజల సొమ్ము.. ‘స్వీపింగ్‌’.. బల్దియాలో ఇదో దోపిడీ.. ఎవరూ పట్టించుకోరేం..!?

ABN , First Publish Date - 2021-12-21T14:30:25+05:30 IST

సొంత వాహనాలు కొనుగోలు చేస్తే నిర్వహణ వ్యయంలో పదో, పరకో తప్ప.. పెద్దగా దండుకునే...

HYD : ప్రజల సొమ్ము.. ‘స్వీపింగ్‌’.. బల్దియాలో ఇదో దోపిడీ.. ఎవరూ పట్టించుకోరేం..!?

  • అద్దెలో అవినీతి
  • వాహనాల విలువ కంటే రెట్టింపు
  • ఎవరి వాటాలు వారికే..
  • కమీషన్లకే ప్రాధాన్యం.. 
  • నాలుగైదేళ్లుగా రూ.130-150 కోట్లు ఖర్చు
  • ఆ మొత్తంతో పదుల సంఖ్యలో వాహనాలు కొనుగోలు చేసే అవకాశం

- స్విపింగ్‌ యంత్రాల (పెద్దవి) ధర కంపెనీని బట్టి రూ.35 లక్షల నుంచి రూ.50 లక్షలు 

- బాబ్‌కాట్‌ స్కిడ్‌ స్ర్టీట్‌ లోడర్‌ ధర రూ.18 లక్షల నుంచి రూ.20 లక్షలు


హైదరాబాద్‌ సిటీ : రోడ్లు ఊడ్చే వానాలకు అద్దె రూపంలో జీహెచ్‌ఎంసీ రెట్టింపు చెల్లిస్తోంది. స్వీపింగ్‌ యంత్రాలకు ఏటా రూ.1.13 కోట్లు, బాబ్‌కాట్లకు రూ.25 లక్షల వరకు ఖర్చు చేస్తోంది. ఒక ఏడాది అద్దెగా చెల్లించే మొత్తంతో రెండు యంత్రాలు కొనుగోలు చేసే వీలున్నా ఎందుకిలా, అంటే కమీషన్ల కక్కుర్తే కారణమన్న సమాధానం వినిపిస్తోంది. సొంత వాహనాలు కొనుగోలు చేస్తే నిర్వహణ వ్యయంలో పదో, పరకో తప్ప.. పెద్దగా దండుకునే అవకాశం ఉండదు. అదే ప్రైవేట్‌ వాహనాలను అద్దె ప్రాతిపదికన వినియోగిస్తే ప్రతి బిల్లులో 5 నుంచి 10 శాతం జేబులో వేసుకోవచ్చు. ఇదే సూత్రాన్ని కొందరు బల్దియా అధికారులు అమలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అద్దె వాహనాల వినియోగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ తతంగంలో సంస్థ ఉన్నతాధికారులతోపాటు, పాలకమండలిలోని కొందరి హస్తమూ ఉందన్న ప్రచారం జరుగుతోంది. రాజకీయ, అధికార ఒత్తిళ్ల నేపథ్యంలోనే అద్దె ప్రాతిపదికన స్వీపింగ్‌ యంత్రాల వినియోగం నిరాటంకంగా కొనసాగుతోంది.


వందల కోట్లు..

నగరంలోని ప్రధాన రహదారులపై అర్ధరాత్రి విధులు నిర్వహించే క్రమంలో పారిశుధ్య కార్మికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. కొందరు ప్రాణాలూ కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఆయా మార్గాల్లో యంత్రాలను వినియోగించాలని నిర్ణయించారు. గ్రేటర్‌లో ప్రస్తుతం 35 పెద్ద స్వీపింగ్‌ యంత్రాలు, 72 బాబ్‌కాట్లు (మినీ యంత్రాలు) రోడ్లు ఊడ్చేందుకు వాడుతున్నారు. ఇందులో జీహెచ్‌ఎంసీ స్వీపింగ్‌ యంత్రాలు 17 (పెద్దవి, చిన్నవి) ఉండగా, 18 అద్దె ప్రాతిపదికన పని చేస్తున్నాయి. బాబ్‌కాట్లు సంస్థవి మూడు, అద్దెకు నడుస్తున్నవి 69 ఉన్నాయి. 


ఒక్కో పెద్ద స్వీపింగ్‌ యంత్రానికి ఏటా రూ.1,13,33,250 చెల్లిస్తున్నారు. ఈ లెక్కన 18 యంత్రాలకు సంవత్సరానికి అవుతున్న ఖర్చు రూ.20.39 కోట్లు. 69 బాబ్‌కాట్లకు సంవత్సరానికి రూ.16 కోట్ల అద్దె చెల్లిస్తున్నారు. నాలుగైదేళ్లుగా నగరంలో స్వీపింగ్‌ యంత్రాల అద్దె వినియోగం పెరిగింది. ఇప్పటి వరకు అద్దె పేరిట రూ. 130-150 కోట్ల వరకు చెల్లింపులు జరిగాయని సంస్థ ఆర్థిక విభాగం వర్గాలు చెబుతున్నాయి. ఈ మొత్తంతో కనీసం 25 స్వీపింగ్‌ యంత్రాలు, 80 వరకు బాబ్‌కాట్లు కొనుగోలు చేయొచ్చు. కానీ ఆ దిశగా అధికారులు కనీస ఆలోచన చేయడం లేదు. వృథా అవుతోంది ప్రజాధనమే అనుకుంటున్నారో.. జేబులు నిండితే చాలనుకుంటున్నారో.. కానీ అద్దె వాహనాల వినియోగానికి అమితాసక్తి చూపుతున్నారు.


సెన్సార్లు లేవు.. పరిశీలన ఉండదు..

చాలా వరకు అద్దె స్వీపింగ్‌ యంత్రాలు సక్రమంగా పని చేయడం లేదు. వాహనాలకు ఉండే నాలుగు బుష్‌లు కిందకు దించి.. నిత్యం నిర్ణీత కిలోమీటర్లు తిరగాలి. అప్పుడే రహదారులపై ఉన్న దుమ్ము, ధూళి శుభ్ర మవుతుంది. మెజార్టీ యంత్రాలు ఒకటి, రెండు కంటే ఎక్కువ బుష్‌లు కిందకు దించడం లేదు. దీంతో ఎక్కడి దుమ్ము అక్కడే పేరుకుపోయి వాహనదారులకు ఇబ్బందికరంగా మారుతోంది. మూడేళ్ల క్రితం సరిగా స్వీపింగ్‌ చేయని యంత్రాలకు అప్పటి అదనపు కమిషనర్‌ పెనాల్టీ వేశారు. ఈ క్రమంలో వాహనాలకు జియో ట్యాగింగ్‌, బుష్‌లకు సెన్సార్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 


ఉన్నత స్థాయి ఒత్తిళ్ల నేపథ్యంలో సెన్సార్ల ఏర్పాటు కార్యరూపం దాల్చలేదు. జియో ట్యాగింగ్‌ కూడా పూర్తిస్థాయిలో పని చేయడం లేదని రవాణా విభాగం అధికారులే అంగీకరిస్తున్నారు. దీన్నిబట్టి జీహెచ్‌ఎంసీకి యంత్రాలను అద్దెకిచ్చే సంస్థల లాబీయింగ్‌ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉన్నతాధికారులూ యంత్రాల ద్వారా స్వీపింగ్‌ ఎలా జరుగుతుందన్నది కనీసం పరిశీలించడం లేదు. ప్రతి నెలా ఠంచనుగా బిల్లులు మాత్రం చెల్లిస్తున్నారు. ఇందులో ఎవరి వాటాలు వారికి వెళ్తున్నాయన్న ఆరోపణలున్నాయి.

Updated Date - 2021-12-21T14:30:25+05:30 IST