మరో సువర్ణ ఘట్టం ముర్ము భారతం

ABN , First Publish Date - 2022-06-28T06:19:43+05:30 IST

భారత సార్వభౌమాధినేతగా ఒక ఆదివాసీ మహిళ చరిత్ర కెక్కనున్నారు. 2022 జూలై 25న 15వ భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయనున్నారు....

మరో సువర్ణ ఘట్టం ముర్ము భారతం

భారత సార్వభౌమాధినేతగా ఒక ఆదివాసీ మహిళ చరిత్ర కెక్కనున్నారు. 2022 జూలై 25న 15వ భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయం ఆ రోజున ప్రారంభం కానున్నది.


ద్రౌపది ముర్ము ఆదివాసీల్లో సంతాలీ తెగకు చెందినవారు. నిత్యపేదరికంలోనూ, ఫీజులు కట్టలేని స్థితిలో, సామాజిక సంక్షేమ హాస్టళ్లలో ఉండి చదువుకుంటూ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించిన విద్యాధికురాలు. ఆమెను ఎవరూ చేయిపట్టి నడిపించలేదు. తండ్రి, ఇద్దరు సోదరులు చదువుకున్నవారు కూడా కాదు. వివాహమైన తర్వాత కూడా భర్తను ఒప్పించి ఆమె సామాజిక స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. టీచర్‌గా ఉద్యోగం చేశారు. మంచి టీచర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆమె బోధించిన సబ్జెక్ట్‌లో విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకునేవారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. భారతీయ జనతా పార్టీ ఒకప్పుడు బలంగా లేని ఒడిషాలో ఆ పార్టీని నేటి స్థితికి తీసుకువచ్చిన వారిలో ఆమె అగ్రగణ్యురాలు. కౌన్సిలర్‌గా రెండుసార్లు పోటీ చేసి విజయం సాధించారు. రెండుసార్లు శాసన సభకు ఎన్నికయ్యారు. 9 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఉత్తమ శాసన సభ్యురాలిగా పురస్కారం పొందారు. ఒడిషాలో నాలుగు మంత్రిత్వ శాఖల్ని సమర్థంగా నిర్వహించారు. భర్త, ఇద్దరు కుమారులను కోల్పోయి కృంగిపోయినా కోలుకుని తిరిగి ప్రజాసేవలో నిమగ్నమయ్యారు. ఆధ్యాత్మికత, ప్రజాసేవా తత్పరతే ఆమెకు సాంత్వన చేకూర్చాయి.


జీవితంలో పదవుల కన్నా ప్రమాణాలు శాశ్వతమన్న ఒక ఉన్నత స్థాయి ఆలోచనా విధానాన్ని ద్రౌపది ముర్ము ఏర్పర్చుకున్నారు. ఏనాడూ ఆమె పదవులకోసం వెంపర్లాడలేదు. ఢిల్లీ వచ్చి నేతలను కలుసుకుని తనకు ఫలానా పదవి ఇవ్వమని కోరుకోలేదు. అయితే ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కాని, ఆయన సారథ్యంలో పనిచేసే వారికి గానీ నాయకుల గుణగణాలను గురించి ఎవరూ చెప్పనవసరం లేదు. మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ ప్రయోజనాలు, సమాజంలో నేతల ప్రాధాన్యత, వివిధ వర్గాలకు కల్పించాల్సిన ప్రాధాన్యం దృష్ట్యా దీర్ఘకాలిక దృష్టిలో యోచించి తీసుకుంటారు. ఎక్కడో ఒడిషాలో తనకు లభించిన పదవికి న్యాయం చేస్తూ పార్టీకోసం పనిచేస్తున్న ద్రౌపది ముర్మువంటి ఆదివాసీ మహిళ గురించి ఆయన ఏనాడో ఆలోచించారు. తాను అధికారంలోకి రాగానే 2015లో ఆమెను జార్ఖండ్ గవర్నర్‌గా నియమించారు. గత ఏడాది ముర్ము పదవీకాలం ముగిసింది. ఆ తర్వాత ఆమెను పార్టీలో ఏ పదవిలోనూ నియమించలేదు. సరిగ్గా ఏడాది తర్వాత ఆమె పేరును భారత రాజ్యాంగంలో అత్యంత ఉన్నతమైన రాష్ట్రపతి పదవికి పరిగణనలోకి తీసుకున్నారు.


దేశంలో విస్మృత వర్గాలకు న్యాయం జరగదేమో అనుకుంటున్న సమయంలో ఆ వర్గాలకు చెందిన ఒక మహిళకు ఈ అత్యున్నత పదవి కల్పించడం ఒక అసాధారణమైన నిర్ణయం. సమాజంలో అట్టడుగు వర్గాలకు న్యాయం చేయాలన్న దీనదయాళ్ ఉపాధ్యాయ సిద్ధాంతాన్ని ఔదలదాల్చిన నాయకుడు ప్రధాని మోదీ. ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా ఎంపిక చేయడం ద్వారా ప్రపంచానికి ఆయన ఒక సందేశం పంపారు. అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో ఆదివాసీలు సైతం స్వయం కృషితో ఉన్నత స్థాయికి ఎదిగే వాతావరణం ఉన్నదనే సత్యాన్ని ప్రపంచ ప్రజలకు ఆయన నిరూపించారు.


ద్రౌపది ముర్ముకు ముందు దళిత నేత అయిన రాంనాథ్ కోవింద్‌ను రాష్ట్రపతిగా ఎంచుకున్నప్పుడు కూడా మోదీ ఇదే విధంగా ఆలోచించారు. దళితుల్లో అత్యంత వెనుకబడిన, సమాజంలో అస్పృశ్యులుగా పరిగణించే కోరిలకు చెందిన రాంనాథ్ కోవింద్‌ను రాష్ట్రపతిగా నియమించడంలో మోదీ ప్రధాన పాత్ర పోషించారు. జీవితంలో ఎన్నో మెట్లు అతికష్టమ్మీద పైకి ఎక్కి న్యాయశాస్త్రం చదివి, సుప్రీంకోర్టులో ప్రాక్టీసు చేస్తూనే బిజెపి పట్ల అంకిత భావంతో పనిచేస్తున్న కోవింద్ ఆయన దృష్టిలో ఉన్నారు. బిజెపి అప్పటికే ఆయనను రెండుసార్లు రాజ్యసభకు పంపింది. మోదీ కేంద్రంలో పగ్గాలు చేపట్టగానే రాంనాథ్ కోవింద్‌ను బిహార్ గవర్నర్‌గా నియమించారు. ఆ తర్వాత రాష్ట్రపతి పదవికి ఆయన పేరును ప్రతిపాదించారు. మోదీ తీసుకున్న ఈ నిర్ణయం ఉత్తరప్రదేశ్‌లోనూ, దేశంలోనూ దళితుల్లోనూ, దళితుల్లో ఇంకా అట్టడుగు స్థాయిలో ఉంటూ అనేక అవమానాలకు గురవుతున్న వారిలో కలకలం రేపింది. రాజకీయాలంటే ఓటు బ్యాంకులని, కులతత్వ పార్టీలని నెలకొన్న అభిప్రాయం వారిలో దూరమైంది.


ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు అత్యంత ప్రతిభావంతుడైన నాయకుడనడంలో సందేహం లేదు. అందుకే పార్టీ ఆయనకు అన్ని విధాలా అంచెలంచెలుగా ఎదిగేందుకు అవకాశాలు కల్పించింది. ఎమ్మెల్యే నుంచి కేంద్రమంత్రి దాకా ఎదిగారు. ఆడ్వాణీ, వాజపేయి సభలకు పోస్టర్లు వేసిన స్థాయి నుంచి వారి మధ్యన కూర్చునే పార్టీ జాతీయ అధ్యక్షుడి వరకూ ఆయనకు అనేక పార్టీ పదవుల్లో అవకాశం లభించింది. వాజపేయి హయాంలో గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉండి గ్రామీణ సడక్ యోజనకు రూపకల్పన చేశారు. మోదీ హయాంలో పట్టణాభివృద్ధి, పేదరిక నిర్మూలన, గృహ నిర్మాణం, సమాచార ప్రసార శాఖల్లో కేబినెట్ మంత్రిగా ఉన్నారు. బిజెపిలో ఏ నాయకుడికీ దక్కని విధంగా ఆయనను నాలుగుసార్లు ఇతర రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ఎన్నుకున్నారు. చివరకు దేశంలో రెండవ అత్యున్నత రాజ్యాంగ పదవి అయిన ఉప రాష్ట్రపతి పదవిని కల్పించారు. రాజ్యసభ చైర్మన్‌గా ఆయన తన సమర్థతను నిరూపించుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వెంకయ్య సన్నిహితుడే. అయితే రాష్ట్రపతి పదవి విషయంలో మోదీ తన వ్యక్తిగత ఇష్టాయిష్టాలు, అభిమానాలకు అతీతంగా, సమాజ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించి ఆదివాసీలకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని వెంకయ్య నాయుడు సైతం హర్షించారు. ద్రౌపది ముర్మును సాదరంగా ఇంటికి ఆహ్వానించి ఆమెను మనసారా అభినందించారు. దేశ రాజకీయాల్లో వెంకయ్య ఒక విశిష్టమైన వ్యక్తి. పార్టీ ఉనికిలో లేనప్పుడు కూడా ఆయన వక్తగా, అధికార ప్రతినిధిగా, సమర్థుడైన నిర్వాహకుడుగా పేరుతెచ్చుకోవడం నాకు అనుభవం ఉన్నది. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడుగా ప్రతిపక్షాలను చీల్చిచెండాడిన వెంకయ్య అనేక సార్లు తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు. తన స్వంత రాష్ట్ర ప్రయోజనాలను ఆయన ఏనాడూ విస్మరించలేదు. రాష్ట్ర విభజన సమయంలో ఆయన రాజ్యసభలో అరివీర భయంకరుడుగా పోరాడి అనేక ప్రయోజనాలు సాధించారు. ఇవాళ లక్షల కోట్ల కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయంటే దాని వెనుక వెంకయ్య నిర్విరామ కృషి ఉందనే విషయాన్ని ఎవరూ కాదనలేరు. కాల ప్రవాహంలో వాజపేయి, ఆడ్వాణీ, ప్రమోద్ మహాజన్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ లాంటి హేమాహేమీలు కొట్టుకుపోకుండా తట్టుకుని రాజకీయాల్లో తమ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుని పార్టీకి మూల స్తంభాలుగా నిలిచారు. వెంకయ్య నాయుడు కూడా వారితో పాటు సమకాలీన భారత చరిత్రలో తనదైన ఘట్టాన్ని లిఖించారని సగర్వంగా చెప్పుకోవచ్చు.


వై. సత్యకుమార్

(బీజేపీ జాతీయ కార్యదర్శి)

Updated Date - 2022-06-28T06:19:43+05:30 IST