రాజధానిపై మరో చట్టం! మరో నాటకం!

Dec 1 2021 @ 04:12AM

బంగారు నాణాన్ని సముద్రంలోకి విసరడానికి ఒక్క మూర్ఖుడు చాలు. వెయ్యిమంది మేధావులు కలిసి వెతికినా దాన్ని వెలికి తీయలేరు. ఆత్మవిమర్శ చేసుకొని తదనుగుణంగా సాగించని పరిపాలన ప్రజలకు పెనుశాపం, రాష్ట్రానికి మరణ శాసనం అవుతుంది. కేవలం అసూయతోనే అమరావతికి మరణ శాసనం రాయాలని చూస్తోంది నేటి ప్రభుత్వం.  


రెండేళ్లుగా మూడు రాజధానుల నిర్ణయాన్ని తెరపైకి తెచ్చి ప్రజల, రాష్ట్ర భవిష్యత్తుతో ఆడుకున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ, పాలనా వికేంద్రీకరణ వేర్వేరు. కానీ సీఎం జగన్‌ మొండిగా అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో బహుళ రాజధానుల విన్యాసాలు చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ జగన్ ప్రవచించే నీతుల కింద నిజం కప్పబడి ఉంది. లోగుట్టును ప్రజలే అర్థం చేసుకోవాలి. బాధ్యతాయుతమైన పౌరులు క్రియాశీలంగా వ్యవహరించకపోవడం వల్లనే అథములు పాలకులుగా అవతారమెత్తి అన్యాయమైన చట్టాలు చేసి అమరావతిని భ్రష్టుపట్టించారు. 


ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014కు భారత రాష్ట్రపతి ఆమోదముద్ర ఉంది. సెంట్రల్ ఏక్‌్టకు అనుగుణంగానే అప్పటి సీఎం చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సీఆర్డీఏ ఏక్ట్‌ను తీసుకువచ్చింది. రాష్ట్ర శాసనసభ దానిని ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇప్పటి సీఎం జగన్మోహన్‌రెడ్డి అప్పటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా దానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. రాజధానిగా అమరావతిని స్వాగతిస్తున్నానని సభలో ప్రకటించారు. ఏపీ రాజధానిగా అమరావతి నిర్ణయం ఆషామాషీగా, తూతూ మంత్రంగా జరిగింది కాదు. దీని వెనుక రాష్ట్రపతి ఆమోదం పొందిన పార్లమెంట్ ఏక్ట్ ఉంది. దీన్ని అనుసరించి కేంద్రప్రభుత్వం నిర్ణయించిన నిపుణుల కమిటీ ఉంది. ఆ కమిటీ చేసిన సిఫారసులు ఉన్నాయి. ఈ మేరకే రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నిర్ణయించింది. ఏపీ సీఆర్డీఏ ఏక్ట్ ప్రకారమే అమరావతికి భూ సేకరణ జరిగింది. 29,881 మంది రైతులు రాజధాని నిర్మాణానికి 34,322 ఎకరాలను స్వచ్ఛందంగా ఇచ్చారు. వారికి తగిన బెనిఫిట్స్ ఇవ్వడానికి గాను సీఆర్డీఏకు, రైతులకు మధ్య ఒప్పందం జరిగింది. 9.14(బి)లో 7వ పాయింట్, 18వ పాయింట్లలో అటు రైతులకు, ఇటు ప్రభుత్వానికి నష్టం వాటిల్లకుండా అవగాహన ఒప్పందం పకడ్బంధీగా జరిగింది. ఇంత సుదీర్ఘ కసరత్తు జరిగాక మూడు రాజధానులపై జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిజంగా తుగ్లక్ చర్యే తప్ప మరొకటి కాదు.


ఈ చట్టాన్ని రద్దు చేయాలన్నా, రాజధానిని మూడు ముక్కలు చేయాలన్నా కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఆర్టికల్ 254 ప్రకారం సెంట్రల్ ఏక్ట్ ఆల్వేస్ ప్రివైల్స్ ఓవర్ స్టేట్ ఏక్ట్ (రాష్ట్ర చట్టం కన్నా కేంద్ర చట్టానిదే ఎల్లప్పుడూ పైచేయి). కేంద్ర చట్టాన్ని అతిక్రమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకురావడమే తప్పు. అందుకే ఈ మూడు బిల్లులూ చెల్లవని కౌన్సిల్లో తెలుగుదేశం పార్టీ స్పష్టంగా చెప్పింది. అలాంటిది కేంద్ర చట్టానికి తూట్లు పొడిచారు. కౌన్సిల్ నియమాలను ఉల్లంఘించారు. రాజ్యాంగాన్ని తిరస్కరించారు. అందుకే రైతుల నుంచి, ప్రజాసంఘాల నుంచి, జేఏసీ నుంచి వందకు పైగా పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. కోర్టుల్లో జరిగిన వాదోపవాదాల్లో రాష్ట్ర ప్రభుత్వ అవకతవకలన్నీ బైటపడ్డాయి. దాంతో శృంగభంగం తప్పదని ఇప్పుడు ఈ మూడు బిల్లులను వెనక్కి తీసుకొన్నారు. అయితే ఈ సందర్భంగా అసెంబ్లీలోజగన్ మాట్లాడుతూ దీని స్థానంలో మరో సమగ్ర చట్టాన్ని తెస్తామని మరింత అయోమయానికి తెరతీశారు.


రాజధాని విధ్వంసం వల్ల అక్కడ భూములిచ్చిన రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. లక్షల కోట్ల రూపాయల విలువైన రాష్ట్ర సంపద మట్టిపాలైంది. దానితో పాటు 13జిల్లాలకు తీరని నష్టం జరిగింది. ఆయా ప్రాంతాల్లో పరిశ్రమలు పెట్టేందుకు పెట్టుబడులు రాకపోవడం వల్ల సంపద నష్టంతో పాటు, ఉపాధి అవకాశాలు కోల్పోయి యువతకు తీరని నష్టం జరిగింది. దీనంతటికీ జగన్ రెడ్డిదే బాధ్యత. జరిగిన తప్పిదాలకు చింతించకుండా, కించిత్ పశ్చాత్తాపం లేకుండా, మరో సమగ్ర చట్టాన్ని తెస్తాననడం జగన్ అవివేకానికి, అహంకారానికి, మొండితనానికి నిదర్శనం. మరో సమగ్ర చట్టం తేవాలంటే దానికీ కేంద్రం నుంచి అనుమతి కావాలి, దాన్ని పార్లమెంట్ ఆమోదించాలి, తర్వాత అది ఆర్టికల్ 111 ప్రకారం రాష్ట్రపతి ఆమోదాన్నీ పొందాలి. ఈ విషయం ఏపీ పునర్యవస్థీకరణ చట్టం సెక్షన్ 5(2), సెక్షన్ 6లలో స్పష్టంగా ఉంది. జగన్ రెడ్డి తేవాలనుకునే మరో చట్టానికి కేంద్రం అనుమతి కావాలంటే, ప్రధాని మోదీ అంగీకరించాలి, కేంద్రంలో అధికారపార్టీ బీజేపీ సుముఖంగా ఉండాలి. రాజధాని అమరావతికి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరగింది విదితమే. దాదాపు రూ.3వేల కోట్ల నిధులను రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇచ్చింది. అమరావతి ఆందోళనల్లో రాష్ట్ర బీజేపీ కూడా భాగస్వామి అయింది. ఆ ఉద్యమంలో పాల్గొనాలని కేంద్ర హోం మంత్రి వారిని ఆదేశించినట్లు మీడియాలో చూశాం. దేశంలో రాష్ట్రాల విభజనలో క్రియాత్మక భూమిక కేంద్ర హోం మంత్రిత్వ శాఖదేనని తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ రెడ్డి మరో చట్టానికి కేంద్రంలోని బీజేపీ మద్దతు ఇవ్వడం అనుమానమే.


న్యాయపరమైన చిక్కులున్నాయని తెలిసి కూడా మరో సమగ్ర చట్టాన్ని తెస్తాననడం ఉద్దేశపూర్వకంగా రాష్ట్రాన్ని మరింత భ్రష్టుపట్టించాలని చూడడమే. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ఆలోచన లేదు, పెట్టుబడులు రాబట్టే సమర్థత లేదు.  పైగా ప్రతి నిర్ణయంలోనూ రాజ్యాంగపరమైన అడ్డంకులను, న్యాయపరమైన చిక్కులను ఆయనే కొనితెచ్చుకుంటున్నాడు. న్యాయ వివాదాలు, రాజ్యాంగ వివాదాలే కాదు, సాంఘిక వివాదాలు, ప్రాంతీయ వివాదాలను రగిలించాలని చూస్తున్నాడు. రాజధాని రైతులకు జరిగిన అన్యాయం నిజానికి పెద్ద సాంఘిక వివాదం. సీఆర్డీఏకు, రైతులకు మధ్య ఒక ఒప్పందం జరిగింది. దానికి లీగల్ బైండింగ్ ఉంది. 34వేల ఎకరాలిచ్చిన 29గ్రామాల రైతులనే కాదు, మొత్తం 13జిల్లాలలో 16వేల గ్రామాలు, పట్టణాల ప్రజల ఆర్థిక స్థితిగతులను తన అడ్డగోలు నిర్ణయాలతో దెబ్బతీశారు జగన్. 


ఇక్కడ మరో ముఖ్యాంశం రాజకీయపరమైనది. అమరావతికి రాజధానిగా శాసనసభలో జగన్ రెడ్డి కూడా మద్దతు ఇచ్చారు. ఆయన పార్టీ ఆమోదంతోనే సభ రాజధానిగా అమరావతిని ఏకగ్రీవంగా ఆమోదించింది. అమరావతి నుంచి రాజ ధానిని మార్చమని, మూడు రాజధానులు ఏర్పాటు చెయ్యమని రాష్ట్రంలో ఎవ్వరూ అడగలేదు. జగన్ సీఎం అయ్యాక విశాఖపట్నానికి ఉన్న స్థాయి తగ్గిందే తప్ప పెరగలేదు. చరిత్రను చూస్తే మహమ్మద్ బీన్ తుగ్లక్ హయాంలో రాజధానిని ఢిల్లీ నుంచి దౌలతాబాద్‌కు, అక్కడ నుంచి మళ్లీ ఢిల్లీకి మార్చాడు. అప్పుడు రాజ్యానికీ ప్రజలకూ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం జరిగింది. జగన్ దుష్పరిపాలన కూడా ఇలాగే రాష్ట్రాన్ని చెండక తింటున్నట్లు కాగ్ తాజా నివేదికలు ఋజువు చేస్తున్నాయి.


అమరావతి కోసం కేంద్రం ఇచ్చిన నిధులు రూ.3వేల కోట్లతో జరిగిన అభివృద్ధి విధ్వంసానికి జగనే బాధ్యుడు. ఆ కోట్ల ధనాన్ని జగన్ రెడ్డి నుంచే రాబట్టాలి. రైతులతో సీఆర్డీఏ కుదుర్చుకున్న ఒప్పందం బ్రేక్ అయితే దానికిగాను రైతులకు చెల్లించాల్సిన నష్టపరిహారం కూడా ఆయన్నుంచే రాబట్టాలి. రైతులతో సీఆర్డీఏ కుదుర్చుకున్న అభివృద్ధి ఒప్పందం 9.14 (బి)లో 7వ పాయింటులో స్పష్టంగా ఏమున్నదంటే– పార్టీ నెం 2 (భూమి ఇచ్చిన రైతు) భూసమీకరణ పథకం నిమిత్తం షెడ్యూలులోని ఆస్తిని, ఒప్పందములోని ఇతర నిబంధనలకు లోబడి,  ఆ ప్రకారమే మార్పునకు వీలుకాని హక్కులతో ఎ షెడ్యూల్ ఆస్తిని ఇందుమూలముగా పార్టీ నెం 1కు (సీఆర్డీఏ) స్వాధీనము చేయడమైనది. పార్టీ నెం 2 (భూమి ఇచ్చిన రైతు) ఇందుమూలంగా పార్టీ నెం 1కు (సీఆర్డీఏ) సదరు షెడ్యూలులోని ఆస్తిలో ప్రవేశించుటకు, అభివృద్ధి చేయుటకు అధికారము ఇవ్వడమైనది. ఈ ఒప్పందం 18వ పాయింటులో ఏముందంటే– పార్టీ నెం 2 (భూమినిచ్చిన రైతు) షెడ్యూలులోని ఆస్తిపై అభివృద్ధి పనులను ఆపమని కోరకూడదు. అలాగే ఒప్పందంలోని ఏ షరతులనైనా పార్టీ నెం 1 (సీఆర్డీఏ) ఉల్లంఘిస్తే చట్టం కింద అర్హమైన నష్టపరిహారాలను పొందుటకు అర్హులై ఉంటారు. జగన్ రెడ్డి మూడు రాజధానులపై మళ్లీ తేవాలని అనుకుంటున్న కొత్త చట్టానికి కూడా ఒప్పందంలోని ఇవే షరతులు వర్తిస్తాయని గుర్తుంచుకోవాలి. దేశం మొత్తం వ్యతిరేకించిన మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకున్న మోదీ ప్రభుత్వ స్ఫూర్తి జగన్ రెడ్డి ప్రభుత్వంలో మచ్చుకి కూడా కనిపించకపోవడం శోచనీయం. ఆ విజ్ఞతే వుంటే రాజధానులపై మరో సమగ్ర చట్టం తెస్తానన్న ప్రకటన చేసేవారే కాదు.

యనమల రామకృష్ణుడు

శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.