మరో లేమన్‌ బ్రదర్స్‌!

Sep 21 2021 @ 00:25AM

  • దివాలా అంచుల్లో  చైనా రియల్టీ దిగ్గజం ఎవర్‌గ్రాండ్‌
  • మళ్లీ ఆర్థిక సంక్షోభం తప్పదా?
  •  గాల్లో దీపంలా రూ.22.12 లక్షల కోట్ల రుణాలు
  •  లబోదిబోమంటున్న బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, రిటైల్‌  ఇన్వెస్టర్లు 


బీజింగ్‌:  చైనాలో అతి పెద్ద రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ ఎవర్‌గ్రాండ్‌ దివాలా వార్తలు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లను కుదిపేస్తున్నాయి. దీంతో ఈ కంపెనీకి 30,000 కోట్ల డాలర్ల (సుమారు రూ.22.12 లక్షల కోట్లు) వరకు అప్పులిచ్చిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ప్రమాదంలో పడ్డాయి. నిన్నమొన్నటి వరకు మంచి పరపతి రేటింగ్‌ ఉన్న ఈ కంపెనీ రుణ పత్రాల్లో పెట్టుబడులు పెట్టిన రిటైల్‌ ఇన్వెస్టర్లూ లబోదిబోమంటున్నారు. వీరిలో కొంత మంది కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని చుట్టుముట్టి ఆత్మహత్యలకు సిద్ధమయ్యారు. 


‘ఎవర్‌గ్రాండ్‌’ ప్రస్థానం: హుయ్‌ కా యాన్‌ అనే వ్యక్తి 1996లో ‘హెంగ్డా గ్రూప్‌’ పేరుతో దక్షిణ చైనాలోని గాంగ్జౌ నగరంలో దీన్ని స్థాపించారు. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో అంచెలంచెలుగా ఎదిగిన ఈ కంపెనీ ప్రస్తుతం చైనాలోని 280 నగరాల్లో 1,300 రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులు నిర్మిస్తోంది. ఇందులో దాదాపు 800 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల్లో ఇళ్ల కోసం 15 లక్షలకు పైగా కొనుగోలుదారులు ముందే అడ్వాన్స్‌లు చెల్లించి ఫ్లాట్లు బుక్‌ చేసుకున్నారు.


కంపెనీ దివాలా తీస్తే వీరు కూడా తమ సొమ్ములపై ఆశలు వదులుకోవాల్సిందే. కాగా ఎవర్‌గ్రాండ్‌.. ప్రపంచంలో అత్యధిక అప్పులున్న కంపెనీగా ఉందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తు న్నాయి. ప్రస్తుతం సంస్థలో రెండు లక్షలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఒకవేళ కంపెనీ దివాలా తీస్తే వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది.


చైనా లేమన్‌ బ్రదర్స్‌ : 2008లో లేమన్‌ బ్రదర్స్‌  దివాలా తీయడంతోనే అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం తలెత్తింది. ఎవర్‌గ్రాండ్‌ దివాలా కూడా అలాగే చై.నా ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తుందని భావిస్తున్నారు. 


స్టాక్‌ మార్కెట్‌ ఢమాల్‌ : స్టాక్‌ మార్కెట్‌పై అప్పుడే ఎవర్‌గ్రాండ్‌ ప్రభావం కనిపిస్తోంది. చైనా, జపాన్‌ మార్కెట్లు సోమవారం సెలవు కావడంతో బతికి పోయాయి. హాంకాంగ్‌  స్టాక్‌ మార్కెట్‌ హాంగ్‌సెంగ్‌  మాత్రం మూడు శాతానికిపైగా పడిపోయింది. భారత మార్కెట్‌పైనా ఈ ప్రభావం కనిపించింది.



చైనా ఆదుకుంటుందా?


చైనాలో అనేక కంపెనీలు అప్పులకుప్పల్లా మారాయి. దీనికి చెక్‌ పెట్టేందుకు చైనా ప్రభుత్వం ఇటీవల పలు కొత్త నియంత్రణలు తీసుకొచ్చింది. దాంతో ఎవర్‌గ్రాండ్‌ వంటి కంపెనీలకు అప్పులు చెల్లించడం చాలా కష్టంగా మారింది. చైనా ప్రభుత్వం ఏదోలా ఆదుకుంటే తప్ప ఎవర్‌గ్రాండ్‌ ప్రస్తుత కష్టాల నుంచి గట్టెక్కే సూచనలు కనిపించడం లేదు. అయితే చైనా కమ్యూనిస్టు పార్టీ అధికార పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌లో ఒక వచ్చిన ఒక వ్యాసం అలాంటి ఆశలేమీ పెట్టుకోవద్దని స్పష్టం చేసింది. దీంతో ఎవర్‌గ్రాండ్‌ ఆర్థిక కష్టాల ప్రభావం ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.