నాగాలాండ్‌లో మరో తిరుగుబాటు సంస్థ ఏర్పాటు

ABN , First Publish Date - 2021-11-20T22:02:15+05:30 IST

నాగాలాండ్‌లో తిరుగుబాటు సంస్థలు పెరిగిపోతున్నాయి.

నాగాలాండ్‌లో మరో తిరుగుబాటు సంస్థ ఏర్పాటు

గువాహటి : నాగాలాండ్‌లో తిరుగుబాటు సంస్థలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఉన్న సంస్థలతో కేంద్ర ప్రభుత్వం పోరాడుతూ ఉంటే, కొత్తగా మరో సంస్థ పురుడు పోసుకుంది. నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (రిఫార్మేషన్) నుంచి కొందరు బయటపడి, మరో సంస్థను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఉన్నవాటిలో ఒకటి మినహా మిగిలిన సంస్థలన్నీ కేంద్ర ప్రభుత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. 


నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (రిఫార్మేషన్) నుంచి అకటో ఛోఫి నేతృత్వంలో కొందరు నేతలు బయటికొచ్చి, ప్రత్యేకంగా ఓ సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (రిఫార్మేషన్) అధ్యక్షుడు వై వాంగ్టిన్, అటో కిలోన్సెర్ (ప్రధాన మంత్రి) పి టిఖక్ సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో తాజా పరిణామాలపై విచారం వ్యక్తం చేశారు. తమ సంస్థ వైస్ ప్రెసిడెంట్ అకటో ఛోఫీని బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. తాము అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఛోఫీ తమతో కలిసి ఉండేందుకు అంగీకరించలేదని, విడిపోవాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. 


నాగాల తీవ్రవాద సంస్థలు దాదాపు 12 వరకు ఉన్నాయి. వీటిలో యుంగ్ ఆంగ్ గ్రూపు మయన్మార్ గడ్డపై నుంచి పని చేస్తోంది. దీనిలో మయన్మార్ నాగాలు ఉన్నారు. మిగిలిన గ్రూపులు కేంద్ర ప్రభుత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. 


ఛోపీ మాట్లాడుతూ, తమ గ్రూపులో 2,000 మందికి పైగా యాక్టివ్ మెంబర్స్ ఉన్నారన్నారు. తమతో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడంపై నిర్ణయం తీసుకోవలసినది కేంద్ర ప్రభుత్వమేనని చెప్పారు. తాను వేరుగా ఓ సంస్థను ఏర్పాటు చేయడానికి కారణం అధికార లాలస కానీ, వ్యక్తిగత ప్రయోజనాలు కానీ కాదన్నారు. కేవలం నాగాల ప్రయోజనాల కోసమే తాను ఈ సంస్థను ఏర్పాటు చేశానన్నారు. నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (రిఫార్మేషన్)లో కొందరికి నాగాల చరిత్ర గురించి తెలియదని, అందుకే వారంటే తనకు నచ్చదని తెలిపారు. 


Updated Date - 2021-11-20T22:02:15+05:30 IST