బ్యాంక్‌ ఆఫ్‌ బరోడానే దిక్కు

Published: Tue, 15 Mar 2022 03:53:45 ISTfb-iconwhatsapp-icontwitter-icon
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడానే దిక్కు

పౌరసరఫరాల కార్పొరేషన్‌కు మరో 500 కోట్ల అప్పు

అనుమతిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

ధాన్యం బకాయిలు చెల్లించేందుకేనా?


అమరావతి, మార్చి 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చాక బ్యాంకులన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులివ్వడానికి వెనకడుగు వేస్తున్నాయి. అయితే, ఒక్క బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా మాత్రం ఇంకా వైసీపీ ప్రభుత్వానికి వివిధ రకాలుగా అప్పులిస్తోంది. తాజాగా రైతులకు ధాన్యం కొనుగోలు బకాయిలు చెల్లించేందుకు పౌరసరఫరాల కార్పొరేషన్‌కు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుంచి రూ.500 కోట్లు అప్పు తెచ్చుకునేందుకు అనుమతిస్తూ ఆ శాఖ ఎక్స్‌అఫీషియో కార్యదర్శి గిరిజా శంకర్‌ సోమవారం ఉత్తర్వులిచ్చారు. ఈ అప్పును రైతులకు పెండింగ్‌ బకాయిలు చెల్లించేందుకు కార్పొరేషనే వాడుకుంటుందా? లేక ఎప్పట్లానే కార్పొరేషన్‌ ద్వారా ప్రభుత్వమే ఈ అప్పు తెస్తోందా? ప్రభుత్వమే తెస్తే రైతులకు ధాన్యం బకాయిలు చెల్లిస్తుందా? లేక తన సొంత అవసరాలకు వాడుకుంటుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే మూడేళ్ల నుంచి వైసీపీ సర్కార్‌ కార్పొరేషన్ల నుంచి భారీగా అప్పులు తెచ్చి సొంత అవసరాలకు వాడుతోంది. కేంద్ర పథకాల నిధులతోపాటు ఈఏపీ రుణాలను కూడా ప్రభుత్వం దారిమళ్లిస్తోంది కాబట్టి,  ఇప్పుడు పౌరసరఫరాల కార్పొరేషన్‌ తెచ్చే అప్పైనా రైతులకు చేరుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పౌరసరఫరాల కార్పొరేషన్‌కు రూ. 32,000 కోట్ల అప్పులున్నాయి. కొత్తగా ఇంకో రూ.500 కోట్లు పెరగనున్నాయి. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రూ.5,000 కోట్ల అప్పు తెచ్చుకునేందుకు వీలుగా పౌరసరఫరాల కార్పొరేషన్‌కు ఆర్థిక శాఖ అనుమతిస్తూ డిసెంబరు 7వ తేదీన ఉత్తర్వులిచ్చింది.


కానీ, రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ వ్యవహారం, ఆ కార్పొరేషన్‌ ద్వారా బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పులు రాజ్యాంగవిరుద్ధమంటూ కేం ద్రం లేఖ రాయడం, కోర్టులో కేసు దాఖలవడంతో ఎస్‌బీఐ సహా ఇతర బ్యాంకులన్నీ రాష్ట్రంలోని కార్పొరేషన్లకు అప్పులిచ్చేందుకు వెనక్కి తగ్గాయి. కానీ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా మాత్రం ఏపీకి అప్పులిచ్చేందుకు సిద్ధంగా ఉంటోంది. బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు మద్యంపై అమలయ్యే వ్యాట్‌లో సింహభాగాన్ని స్పెషల్‌ మార్జిన్‌ పేరుతో మళ్లించి, దాన్నే ఆదాయంగా చూపి రూ.40,000 కోట్ల అప్పులు తెచ్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఆ తర్వాత బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు అప్పులిచ్చేందుకు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా పెట్టిన షరతుల ప్రకారం ప్రభుత్వం చేతిలో ఉన్న మొత్తం మద్యం వ్యాపారాన్ని బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు బదిలీ చేశారు. అలాగే, ఏపీ రోడ్డు డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ నుంచి కూడా అప్పులు తెచ్చేందుకు వీలుగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ప్రభుత్వం ఎస్ర్కో ఖాతా తెరిచింది. పెట్రోల్‌, డీజిల్‌పై వసూలు చేసే సెస్‌ను ఈ ఖాతాకు మళ్లించడం ద్వారా వేలకోట్ల అప్పులు తేవాలనేది ప్రభుత్వ ఆలోచన. ఇలా రాష్ట్రంలో అప్పుల కోసమే ప్రభుత్వానికి పనిచేస్తున్న కార్పొరేషన్లకు అప్పులిచ్చేందుకు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ముందుకు రావడం చర్చనీయాంశంగా మారింది. ఏపీఎ్‌సడీసీకి ఎస్‌బీఐ భారీగా అప్పులివ్వడంతో పాటు, దగ్గరుండి ఇతర బ్యాంకులతోనూ అప్పులిప్పించింది. అ లాంటి ఎస్‌బీఐ ఇప్పుడు ఏపీఎ్‌సడీసీ మోడల్‌ కార్పొరేషన్లు రాజ్యాంగ విరుద్ధమని గ్రహించి దూరంగా ఉంటుండగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఎందుకు అప్పులిచ్చేందుకు ఉత్సాహం చూపుతోందో అర్థం కావడంలేదు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.