మేయర్ గద్వాల ఆకస్మిక తనిఖీ.. ఆయన అవుట్!

ABN , First Publish Date - 2021-04-22T13:15:06+05:30 IST

మేయర్‌ గద్వాల్‌ ఆర్‌. విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీల్లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

మేయర్ గద్వాల ఆకస్మిక తనిఖీ.. ఆయన అవుట్!

  • మరో ఎస్‌ఎఫ్ఏ అవుట్‌
  • తొలగించాలని మేయర్‌ ఆదేశం
  • విధులకు రాని కార్మికుల వేతనాలు కాజేసినట్టు గుర్తింపు
  • పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీ

హైదరాబాద్‌ సిటీ : మేయర్‌ గద్వాల్‌ ఆర్‌. విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీల్లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పారిశుధ్య నిర్వహణలో అధికారులు, ఉద్యోగుల వైఫల్యంతో ఎక్కడి చెత్త అక్కడ పేరుకుపోవడమే కాదు.. విధులకు రాని కార్మికుల హాజరు, వారి వేతనాలు కాజేయడం వంటి అక్రమాలూ బయటపడుతున్నాయి. విధుల్లో నిర్లక్ష్యం, అక్రమాలకు పాల్పడుతున్నారన్న కారణాలతో తొలగించిన శానిటరీ ఫీల్డ్‌ అసిస్టెంట్ల సంఖ్య రెండుకు చేరింది. బుధవారం ఖైరతాబాద్‌ జోన్‌ పరిధిలోని శ్రీనగర్‌ కాలనీలో శానిటరీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ సాయిబాబాను విధుల నుంచి తొలగించాలని డీసీ, ఏఎంఓహెచ్‌లను ఆదేశించారు.


18 నెలలుగా ఇద్దరు పారిశుధ్య కార్మికులు విధులకు రాకపోయినా హాజరు వేస్తూ వారికి నెలకు రూ. 4 వేల చొప్పున ఇచ్చి మిగతా వేతనం తీసుకుంటున్నట్టు తేలడంతో చర్యలు తీసుకోవాలన్నారు. మేయర్‌ పర్యటన నేపథ్యంలో మంగళవారం కాచిగూడలో ఓ ఎస్‌ఎఫ్‌ఏను తొలగించారు. కొవిడ్‌ విజృంభణ నేపథ్యంలో పారిశుధ్య నిర్వహణను మెరుగుపర్చేందుకు స్పెషల్‌ శానిటేషన్‌ డ్రైవ్‌ నిర్వహించడంతోపాటు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. దీంతో మూడు రోజులుగా విజయలక్ష్మి నగరంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కృష్ణానగర్‌, ఇందిరానగర్‌, యూసు‌ఫ్‌గూడ, హైటెక్‌సిటీ, మాదాపూర్‌, వెంగళ్‌రావునగర్‌, ఎర్రగడ్డ ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్త తొలగించాలన్నారు.


మూసాపేట గూడ్స్‌ రోడ్డులోని ఫాతిమానగర్‌ ఎదురుగా నాలా వద్ద స్రాప్‌ షాపులో మెడికల్‌ వ్యర్థాలు ఆరు నెలలుగా అలాగే ఉన్నాయని స్థానికులు చెప్పడంతో వాటిని వెంటనే తొలగించి దుకాణం యజమానికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. బస్తీ దవాఖానాగా మార్చిన పాత రాజీవ్‌గాంధీనగర్‌ వార్డు ఆఫీస్‌ వద్ద చెత్త పేరుకుపోవడం చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ప్రాంతంలో గొడవపడి కార్మికురాలు విధులకు రావడం లేదని తన దృష్టికి రావడంతో అలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించారు. చెత్తతోపాటు డ్రైనేజీ, ఇతర సమస్యలను గుర్తించి సంబంధింత విభాగాల దృష్టికి ఎస్‌ఎఫ్‌ఏలు తీసుకెళ్లాలని, తద్వారా త్వరితగతిన పరిష్కారమయ్యే అవకాశం ఉంటుందని చెప్పారు.

Updated Date - 2021-04-22T13:15:06+05:30 IST