థర్డ్‌వేవ్‌కు సిద్ధం.. నిలోఫర్‌లో మరో వెయ్యి పడకలు

ABN , First Publish Date - 2021-06-21T18:03:31+05:30 IST

కరోనా థర్డ్‌ వేవ్‌ ముప్పును ఎదుర్కొనేందుకు నిలోఫర్‌ ఆస్పత్రిలో

థర్డ్‌వేవ్‌కు సిద్ధం.. నిలోఫర్‌లో మరో వెయ్యి పడకలు

  • మూడు షెడ్ల నిర్మాణం
  • ముమ్మరంగా పనులు

హైదరాబాద్ సిటీ/మంగళ్‌హాట్‌ : కరోనా థర్డ్‌ వేవ్‌ ముప్పును ఎదుర్కొనేందుకు నిలోఫర్‌ ఆస్పత్రిలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. వెయ్యి పడకల సామర్థ్యం ఉన్న ఆస్పత్రిలో మరో వెయ్యి పడకలను సిద్ధం చేసేందుకు అధికారులు పనులు ప్రారంభించారు. కొవిడ్‌ థర్డ్‌వేవ్‌లో చిన్నపిల్లలపై ప్రభావం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందుస్తు చర్యల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఐదువేల పడకలను సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నిలోఫర్‌లో రెండు వేల పడకలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇటీవలే అదనంగా వంద మంచాలు ఆస్పత్రికి చేరుకోగా మరో రెండు వందల మంచాలను సోమవారం నాటికి ఆస్పత్రికి అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. 


ఆక్సిజన్‌ పైపులైన్‌ పనులు పూర్తి

ఇంటెన్సివ్‌ కేర్‌ బ్లాక్‌లో మొత్తం 500 పడకలు ఉండగా అదనంగా మరో 200 పడకలను ఏర్పాటు చేశారు. ఇందుకోసం పదిరోజుల క్రితం ప్రారంభించిన ఆక్సిజన్‌ పైపులైన్‌ పనులు శనివారం నాటికి పూర్తయ్యాయి. పాత భవనంలో మరో 200 పడకలు ఏర్పాటు చేసేందుకు ఆక్సిజన్‌ పాయింట్స్‌ ఏర్పాటు చేయించారు. రెండు రోజుల్లో ఈ పనులు పూర్తికానున్నాయి. మొత్తం 1400 పడకలు ఆస్పత్రిలో సిద్ధం చేసినట్లవుతుంది. పాత భవనం, ఇంటెన్సివ్‌ కేర్‌ బ్లాక్‌లలో ఉన్న ఆక్సిజన్‌ ప్లాంట్స్‌ ద్వారా అన్ని భవనాలకు ఆక్సిజన్‌ సరఫరా చేసేందుకు వీలుగా టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ ఇంజనీరింగ్‌ విభాగం అధికారులతో కలిసి ఆస్పత్రి సిబ్బంది పనులు ప్రారంభించారు. 


షెడ్ల పనులు ఎప్పటికి పూర్తయ్యేనో..

ఉస్మానియా ఆస్పత్రి ప్రాంగణంలో క్యూక్యూడీసీపై షెడ్డు నిర్మాణ పనులు చేపట్టి రెండేళ్లవుతున్నా ఇప్పటికీ పూర్తి కాలేదు. నిలోఫరల్‌లో ఏకంగా మూడు షెడ్లు నిర్మించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో ఒక్క షెడ్డు పనులు రెండేళ్లవుతున్నా పూర్తికాకపోతే నిలోఫర్‌లో మూడు షెడ్ల పనులు ఎప్పటికి పూర్తవుతాయో తెలియడం లేదని పలువురు అంటున్నారు. 


సిబ్బంది కోసం ప్రతిపాదనలు

నిలోఫర్‌ ఆస్పత్రిలో మరో 400 పడకలు రెండు మూడు రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండడంతో అందుకు తగ్గట్లు సిబ్బంది అవసరం ఉంటుందని ఉన్నతాధికారులకు పాలకవర్గం ప్రతిపాదనలు పంపింది. ప్రస్తుతం ఆస్పత్రిలో 274 మంది నర్సింగ్‌ స్టాఫ్‌తోపాటు పేషెంట్‌ కేర్‌, సెక్యూరిటీ 300 మంది, 4వ తరగతి ఉద్యోగులు దాదాపు 65, ఔట్‌ సోర్సింగ్‌ సంస్థ ద్వారా పనిచేస్తున్న వారు 200 మంది ఉన్నారు. మరో వెయ్యి పడకలను పెంచితే 150 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, 300 మంది నర్సులు 300 మంది పేషెంట్‌ కేర్‌ సెక్యూరిటీతోపాటు మరో 200 మంది వరకు సపోర్టింగ్‌ స్టాఫ్‌ అవసరమవుతారని పాలకవర్గం లేఖ రాసింది. త్వరలో వైద్యులను, సిబ్బందిని ఆస్పత్రికి పంపనున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 


పరీక్షల కోసం..

థర్డ్‌ వేవ్‌లో ఆస్పత్రికి వచ్చే చిన్నారుల పరీక్షల కోసం పరుగులు తప్పేలా లేదు. వైరస్‌ సోకిన చిన్నారులకు సీబీసీ, ఎల్‌ఎ్‌ఫటీ, ఆర్‌ఎఫ్‌టీ, సీఆర్‌పీ, డీ డైమర్‌, ఫ్యాబ్రినేజెన్‌, చెస్ట్‌ ఎక్స్‌రే, బ్లడ్‌ కల్చర్‌ తదితర పరీక్షలు చేయాలి.  డీ డైమర్‌, ఐఎల్‌6, సెర్‌ ఫెర్రిటిన్‌ తదితర పరీక్షలు నిలోఫర్‌లో లేకపోవడంతో తెలంగాణ డయాగ్నస్టిక్‌ సెంటర్‌కు రోగులను పంపాలని  ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మురళీకృష్ణ ఆదేశాలు జారీ చేశారు. దీంతో చిన్నారులను అంబులెన్స్‌లో నారాయణగూడలోని తెలంగాణ డయాగ్నస్టిక్స్‌ సెంటర్‌కు తీసుకెళ్లక తప్పదు. రెండు వేల పడకలు అందుబాటులోకి వచ్చిన తరువాత ఇదే పరిస్థితి ఉంటే చిన్నారులకు ఇబ్బందులు తప్పవని ఆస్పత్రి అధికారులే చర్చించుకోవడం గమనార్హం. ఎంఆర్‌ఐ స్కాన్‌ అవసరమైతే ఎంఎన్‌జే ఆస్పత్రికి పంపాల్సిందే. ఇంటెన్సివ్‌ కేర్‌ బ్లాక్‌లో సిటీస్కాన్‌ ఉండగా మరో సిటీ స్కాన్‌ ఏర్పాటు చేసేందుకు పనులు ప్రారంభించారు.  


షెడ్ల నిర్మాణం ఇక్కడ..

నిలోఫర్‌ ఆస్పత్రి పాత భవనం రెండో అంతస్తు, ఇన్సెంటివ్‌ కేర్‌ బ్లాక్‌ భవనం ఐదో అంతస్తు, ఓపీ భవనం ఐదో అంతస్తుపై మూడు షెడ్లను నిర్మించి 600 పడకలు ఏర్పాటు చేసేందుకు టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇటీవలే ఆయా భవనాల పటిష్ఠతకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అందజేయడంతో షెడ్ల నిర్మాణాలకు గ్నీన్‌ సిగ్నల్‌ వచ్చినట్లు సమాచారం.గోల్కొండ ప్రాంతంలోని ఆస్పత్రి వద్ద జరుగుతున్న పనులు పూర్తికాగానే నిలోఫర్‌లోని యుద్ధ ప్రాతిపాదికన షెడ్లను నిర్మించేందుకు అధికారులు పనులు ప్రారంభించనున్నారు. ఇంజనీరింగ్‌ విభాగంతోపాటు వైద్య శాఖకు సంబంధించిన అధికారులు ప్రతిరోజూ ఆస్పత్రికి వచ్చి షెడ్ల నిర్మాణాలకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2021-06-21T18:03:31+05:30 IST