రాలిపోయిన మరో నిరుద్యోగి

ABN , First Publish Date - 2022-01-26T05:25:54+05:30 IST

రాలిపోయిన మరో నిరుద్యోగి

రాలిపోయిన మరో నిరుద్యోగి
ఖమ్మం సమీపంలో రైల్వే స్టేషన్‌ సమీపంలో పట్టాలపై సాగర్‌ మృతదేహం, సాగర్‌ (ఫైల్‌), బయ్యారంలో మృతదేహంతో ఆందోళన చేస్తున్న దృశ్యం

కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు.. స్వగ్రామంలో విషాదం

న్యాయం కోరుతూ ఆందోళనకు దిగిన విపక్షాలు

రూ.2లక్షల ఆర్థిక సాయం, ప్రభుత్వ ఉద్యోగ కల్పనకు ఉన్నతాధికారుల హామీ

వందలాది మంది జనం సాక్షిగా పూర్తయిన అంత్యక్రియలు

నా కొడుకు మృతికి ప్రభుత్వమే కారణం : తల్లిదండ్రులు భద్రయ్య, కళమ్మ


బయ్యారం, జనవరి 25 : ఉద్యోగాల నోటిఫికేషన్లు రావడం లేదన్న మనస్తాపంతో  మహబూబాబాద్‌ జిల్లా బయ్యారానికి చెందిన ముత్యాల సాగర్‌ (25) అనే నిరుద్యోగి మంగళవారం ఖమ్మంలో ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సాగర్‌ మృతితో ఆయన స్వగ్రామం బయ్యారం శోకసంద్రంలో మునిగిపోయింది. సాగర్‌ మృతదేహంతో బయ్యారంలో సాయంత్రం విపక్షాలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. మృతుడి కుటుంబానికి న్యాయం చేసేంత వరకు కదిలేది లేదని భీష్మించారు. అయితే అధికారులు రూ.2లక్షల ఆర్థిక సాయం, ప్రభుత్వ ఉద్యోగం కల్పస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. రాత్రి సాగర్‌ మృతదేహానికి బయ్యారంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. 


బయ్యారం గ్రామానికి చెందిన నిరుపేద కూలీ దంపతులు ముత్యాల భద్రయ్య-కళమ్మల కుమారుడు సాగర్‌ ఖమ్మం డీఆర్‌ఎస్‌ కళాశాలలో 2018-19లో బీఏ పూర్తి చేశాడు. ఎన్‌సీసీ విభాగంలో సీ సర్టిఫికెట్‌ పొందాడు. కొంతకాలంగా ఖమ్మంలో ఉంటున్న సాగర్‌ ప్రభుత్వ ఉద్యోగ నిమిత్తం ఎస్సై, కానిస్టేబుల్‌తో పాటు వివిధ విభాగాల్లో కోచింగ్‌ తీసుకుంటున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపనతో కొంత కాలంగా ఉద్యోగ నిమిత్తం ప్రిపేర్‌ అవుతున్నప్పటికీ నాలుగేళ్లుగా రాష్ట్రంలో ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్‌లు వెలువడకపోవడంతో తీవ్ర మనస్థాపం చెందిన సాగర్‌ ఖమ్మంలోని రైల్వే ట్రాక్‌పై బలవన్మరణానికి పాల్పడ్డాడు. 


హమాలీ పనిచేస్తూ..

బయ్యారం గ్రామానికి చెందిన ముత్యాల భద్రయ్య, కళమ్మ దంపతులకు ఇరువురు సంతానం. కుమార్తె సౌజన్యకు వివాహం చేయగా, సాగర్‌ ప్రస్తుతం సర్కారు ఉద్యోగం వేటలో ఖమ్మంలో కోచింగ్‌ తీసుకుంటున్నారు. హమాలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్న భద్రయ్య తన కొడుకు సాగర్‌ను కష్టపడి ఉన్నత చదువులు చదివించాడు. తండ్రి ఆశయానికి తగ్గట్టు సాగర్‌ కూ డా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపనతో కష్టపడుతున్నాడు. తల్లిదండ్రుల కష్టాన్ని గ్రహించిన సాగర్‌ వాళ్లకు కొంత భారం తగ్గించేందుకు అప్పుడప్పుడు పార్ట్‌టైమ్‌ వర్క్‌ చేస్తూ తన అవసరానికి అయ్యే ఖర్చులను సమకూర్చుకూర్చునేవాడు. అయితే రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ కాకపోవడంతో తీవ్ర వేదనకు గురయ్యాడు. దిక్కుతోచని స్థితిలో చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 


ప్రభుత్వమే కారణం..

తమ కుమారుడు సాగర్‌ ఆత్మహత్యకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమని సాగర్‌ తల్లిదండ్రులు భద్రయ్య, కళమ్మలు ఆరోపించారు. తమ కొడుకు మొదటి నుంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపనతో కష్టపడేవాడన్నారు. ప్రభుత్వమే నిరుద్యోగ రూపంలో పొట్టనపెట్టుకుందన్నారు. 


మృతదేహంతో ఆందోళన

బయ్యారం రామాలయం సెంటర్‌లో కాంగ్రెస్‌, బీజేపీ, సీపీఐ, న్యూడెమోక్రసీ, సీపీఎం, బీఎస్పీతో పాటు వివిధ కులసంఘాలకు చెందిన నాయకులు సాయ్రంతం సాగర్‌ మృతదేహంతో ఇల్లందు-మహబూబాబాద్‌ ప్రధాన రహదారిపై రెండు గంటలు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. సాగర్‌ మృతికి ప్రభుత్వమే కారణమంటూ నినదించారు. సాగర్‌ మృతికి ప్ర భుత్వమే బాధ్యత వహిస్తూ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం కల్పించడంతో పాటు రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డి మాండ్‌ చేశారు. అనంతరం మహబూబాబాద్‌ డీఎస్పీ సదయ్య, తహసీల్దార్‌ రంజిత్‌ రూ.2 లక్షల ఆర్థిక సాయంతో పాటు కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగానికి హామీ ఇవ్వడంతో విపక్ష నేతలు, కుటుంబ సభ్యులు శాంతించి ఆందోళన విరమింపజేశారు. విపక్ష నేతలు విజయసారథి, రామచంద్రయ్య, ఐలయ్య, జగ్గన్న, సూర్యం, ముసలయ్య, మధు, శ్రీను, వెంకటేశ్వర్లు, పాల్గొన్నారు. 


ఎంత మంది ఆత్మహత్య చేసుకోవాలి..?

ప్రభుత్వ పుణ్యమాని రాష్ట్రంలో ఇంకా ఎంత మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోవాలని పలువురు నిరుద్యోగులు నినదించారు. సాగర్‌ మృతదేహాం ఖమ్మం నుంచి బయ్యారం వచ్చిందని తెలుసుకున్న పలువురు నిరుద్యోగులు, సాగర్‌ మిత్రులు విపక్ష నేతలతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు. ఈ క్రమంలో పలువురు నిరుద్యోగులు మాట్లాడుతూ... నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్టాడి తెచ్చుకున్న స్వరాష్ట్రంలో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న తీరు ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రాష్ట్రంలో వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు జారీచేయాలని డిమాండ్‌ చేశారు.







Updated Date - 2022-01-26T05:25:54+05:30 IST