మరొకరు బలి

ABN , First Publish Date - 2021-05-07T04:24:38+05:30 IST

ఏనుగుల దాడిలో మరో ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఎప్పటిలాగే తన పొలంలో కూరగాయలు కోసుకు వచ్చి విక్రయించుకోవాలని భావించి... గురువారం పొలంలోకి వెళ్లిన మహిళా రైతును ఏనుగు పొట్టన పెట్టుకొంది. ఈ ఘటన కొమరాడ మండలం పాత కళ్లికోట గ్రామంలో చోటు చేసుకుంది.

మరొకరు బలి
అల్లాడ అప్పమ్మ (ఫైల్‌ ఫొటో)

ఏనుగుల దాడిలో మహిళ మృతి

కూరగాయల కోతకు వెళ్లి మృత్యువాత

పాత కళ్లికోటలో విషాదం

కొమరాడ, మే 6 : ఏనుగుల దాడిలో మరో ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఎప్పటిలాగే తన పొలంలో కూరగాయలు కోసుకు వచ్చి విక్రయించుకోవాలని భావించి... గురువారం పొలంలోకి వెళ్లిన మహిళా రైతును ఏనుగు పొట్టన పెట్టుకొంది. ఈ ఘటన కొమరాడ మండలం పాత కళ్లికోట గ్రామంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి స్థానికులు అందించిన వివరాలిలా ఉన్నాయి. పాత కళ్లికోట గ్రామ సమీపంలో ఉన్న కూరగాయల తోటకు గురువారం ఉదయం అల్లాడ అప్పమ్మ (69) వెళ్లింది. కూరగాయలు కోస్తుండగా ఏనుగు ఒక్కసారిగా దాడి చేసింది. దీంతో పొలంలోనే ఆమె కుప్పకూలిపోయింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్థులు సంఘటన స్థలానికి చేరుకునేసరికే అప్పమ్మ మృతి చెందింది. ఆమెకు ముగ్గురు కుమారులు. చిన్న కుమారుడు అప్పన్న వద్ద ఉంటూ పొలం పనుల్లో సాయంగా ఉంటోంది. ఏనుగుల గుంపు సంచరిస్తోందని గుర్తించలేకపోవడం వల్లే అప్పమ్మ ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఎస్‌ఐ జ్ఞానప్రసాద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

వీడని గజరాజులు

2018 సెప్టెంబరులో జిల్లాలోకి అడుగు పెట్టిన గజరాజులు ఇప్పటివరకు ఆరుగురిని పొట్టన పెట్టుకున్నాయి. కొమరాడ మండలానికి చెందిన వారు నలుగురు కాగా, జియ్యమ్మవలస మండలానికి చెందిన వారు ఇద్దరు మృత్యువాత పడ్డారు. 2019 జనవరి 12న కొమరాడ మండలం నాయుడువలసకు చెందిన నిమ్మక పకీరు, మే 21న జియ్యమ్మవలస మండలం చినకుదమకు చెందిన కె.కాశన్నదొర, డిసెంబరు 6న ఇదే మండలం బాసంగికి చెందిన గంట చిన్నమ్మి ఏనుగుల దాడిలో మృతిచెందారు. 2020 అక్టోబరు 29న కొమరాడ మండలం గుమడకు చెందిన యర్ర నారాయణరావు, నవంబరు 13న పరుశురాంపురం గ్రామానికి చెందిన రఘుమండల లక్ష్ముంనాయుడులను పొట్టన పెట్టుకున్నాయి. తాజాగా గురువారం ఉదయం  పాత కళ్లికోట గ్రామానికి చెందిన అల్లాడ అప్పమ్మ ఏనుగు దాడిలో ప్రాణాలు కోల్పోయింది.

ఈ ఘటనతో రైతులు పొలం పనులకు వెళ్లాలంటే గజగజలాడుతున్నారు. కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో ఏనుగుల సంచారం లేకపోవడంతో రైతులు పంట పొలాలకు వెళ్లి వస్తుండేవారు. నాలుగు రోజుల క్రితం మళ్లీ ఏనుగుల గుంపు రావడం, వచ్చిన వెంటనే మహిళపై దాడి చేసి హతమార్చడంతో ఈ ప్రాంతవాసులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఇదిలాఉండగా 8 ఏనుగులతో ఈ గుంపు  వచ్చింది. 2018 సెప్టెంబరులో అర్తాం సమీప పంట పొలాల్లో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను తాకి... ఒక ఏనుగు మృతి చెందింది. 2019 జనవరిలో దుగ్గి -  కళ్లికోట గ్రామాల మధ్య నాగావళి నది ఊబిలో మునిగి మరో ఏనుగు మృత్యువాత పడింది. 2020 ఆగస్టు 9న జియ్యమ్మవలస మండలం వెంకటరాజపురం సమీపంలో ఇంకో ఏనుగు మృత్యువాత పడింది. అయితే గతేడాది ఆగస్టులో ఒక గున్న ఏనుగు పుట్టింది. దీంతో ఆరు ఏనుగుల గుంపు ప్రస్తుతం సంచరిస్తోంది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

కొమరాడ, జియ్యమ్మవలస, గరుగుబిల్లి మండలాల్లో ఏనుగులు సంచరించే ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి రోజు సాయంత్రం 4 గంటల తరువాత, ఉదయం 7 గంటల ముందు పొలం పనులకు వెళ్లవద్దు. ఈ సమయంలోనే ఏనుగులు సంచరిస్తుంటాయి. గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఏనుగుల గుంపు నుంచి ఒక ఏనుగు విడిపోయి తెల్లవారి జామున కలుస్తుంది. దీనివల్ల మరింత ఇబ్బందికరంగా ఉంది.

- మురళీకృష్ణ, అటవీశాఖ అధికారి


Updated Date - 2021-05-07T04:24:38+05:30 IST