మదపుటేనుగు దాడికి మరో మహిళ బలి

ABN , First Publish Date - 2020-09-28T17:54:22+05:30 IST

రెండు రోజుల క్రితం కుప్పం మండలంలో బీభత్సం సృష్టించి బాలిక ప్రాణాలు తీసిన..

మదపుటేనుగు దాడికి మరో మహిళ బలి

ఇంకో రైతు పరిస్థితి విషమం

శాంతిపురం, గుడుపల్లె మండలాల్లో గజ బీభత్సం


కుప్పం/శాంతిపురం/గుడుపల్లె(చిత్తూరు): రెండు రోజుల క్రితం కుప్పం మండలంలో బీభత్సం సృష్టించి బాలిక ప్రాణాలు తీసిన ఒంటరి మదపుటేనుగు మరోసారి దాడికి తెగబడింది. ఒక మహిళ ప్రాణాలు తీయగా, మరో రైతును మరణం అంచులకు తోసేసింది. శాంతిపురం, గుడుపల్లె మండలాల్లో ఆదివారం వేకువజామున చోటు చేసుకున్న ఈ విషాద ఘటనలతో గ్రామీణ ప్రజలు భీతిల్లుతున్నారు. కోడి కూతకు ముందే నిద్రలేచి చేలవైపు అడుగులు వేస్తున్న కష్టజీవులే ఒంటరి ఏనుగుకు లక్ష్యంగా మారారు. ఈ ఏనుగు దాడి గురించి స్థానికులు చెప్పిన ప్రకారం.. శాంతిపురం మండలం సి.బండపల్లె సమీపంలోని రాళ్లపల్లెలో చేన్లవద్దే పాపమ్మ (60) కుటుంబం నివశిస్తోంది.


భర్త చనిపోగా.. ఇద్దరు కుమారుల్లో ఒకరు బెంగళూరులో కూలీ. మరొకరు ఇంటివద్దే ఉంటున్నారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఆమె ఇంటిని ఆనుకునే ఉన్న వరి చేలల్లోకి వెళ్లింది. అప్పటికే ఆ పరిసరాల్లోకి చేరిన ఒంటరి ఏనుగు, ఆమెను గమనించి దగ్గరికి వచ్చినా గమనించలేకపోయింది. ఒక్కసారిగా పాపమ్మపై ఏనుగు దాడి చేసి, కింద పడేసి కొద్దిదూరం ఈడ్చుకెళ్లంది. తొండంతో, కాళ్లతో తొక్కి బీభత్సం సృష్టించింది. ఈ దాడిలో పాపమ్మ అక్కడికక్కడే మృతి చెందింది.


గుడుపల్లెలో రైతు పరిస్థితి విషమం 

పాపమ్మను చంపేసిన ఒంటరి ఏనుగు గుడుపల్లె మండలం పొగురుపల్లె పంచాయతీ చింతర పాళ్యం చేరుకుంది. ఆ గ్రామానికి చెందిన రైతు నారాయణప్ప (59) తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో పనుల నిమిత్తం వరి చేను వద్దకు వెళ్లారు. అప్పటికే ఆ పొలంలోకి చేరిన ఏనుగు.. నారాయణప్పను గనించి రెచ్చిపోయింది. తొండంతో దాడి చేసి కింద పడేసి కాళ్లతో తొక్కింది. అప్పటికే చేలల్లోకి చేరిన సాటి రైతులు దీన్ని గమనించి, కేకలు పెడుతూ, డప్పులు కొట్టి తరమడంతో ఆ ఒంటరి ఏనుగు బిసానత్తం మీదుగా కర్ణాటక రాష్ట్రంలోకి వెళ్లిపోయింది.


కాగా, అటవీ, పోలీసుశాఖ అధికారులు సంఘటనా స్థలాలకు చేరుకున్నారు. పాపమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ నారాయణప్పను చికిత్స కోసం పీఈఎస్‌ ఆసుపత్రిలో చేర్చారు. ఏనుగు దాడిలో తలకు తీవ్ర గాయాలై స్పృహ కోల్పోయిన ఆయన పరిస్థితి విషమంగానే ఉన్నట్లు గ్రామస్థులు తెలిపారు. 


అదే ఏనుగు 

కుప్పం మండలం మల్లానూరు పంచాయతీ నడిమూరు కొట్టాలు గ్రామ పొలాల్లో ఈనెల 23న అర్ధరాత్రి దాటాక సోనియా అనే ఇంటర్‌ విద్యార్థినిపై దాడిచేసి తొక్కి చంపేసిన ఒంటరి ఏనుగే, ఇప్పుడు శాంతిపురం, గుడుపల్లె మండలంలో బీభత్సం సృష్టించినట్లు అధికారులు చెబుతున్నారు. దూరంనుంచి దాన్ని గమనించిన గ్రామీణులూ ఇదే విషయాన్ని నిర్ధారిస్తున్నారు. దాన్ని కట్టడి చేయడానికి, దూరంగా అడవుల్లోకి తరిమేయడానికి అటవీశాఖ ఆధ్వర్యంలో తీవ్ర ప్రయత్నాలు సాగుతున్నాయి. 


టీడీపీ ఆర్థిక సాయం 

ఒంటరి ఏనుగు దాడిలో మృతి చెందిన పాపమ్మ అంత్యక్రియల నిమిత్తం టీడీపీ తరఫున ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి పి.మనోహర్‌, ఇతర మండల నాయకులు తక్షణ సాయంగా రూ.7.5 వేలు అందించారు. ఆమె కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. 


రూ.10 లక్షలు పరిహారం చెల్లించాలి: చంద్రబాబు

మదపుటేనుగు దాడిలో మృతి చెందిన పాపమ్మ, సోనియా కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని టీడీపీ అధినేత, స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. తీవ్రంగా గాయపడ్డ నారాయణప్పకు చికిత్సకోసం రూ.3 లక్షలు చెల్లించాలని కోరారు. కుప్పం నియోజకవర్గంలో వరుసగా జరుగుతున్న మదపుటేనుగు దాడులపై ఆయన ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీకి లేఖ రాశారు. మదపుటేనుగు దాడులతో రైతుల ప్రాణాలే కాకుండా పంటలకూ తీవ్ర నష్టం వాటిల్లుతోదని ఆవేదన వ్యక్తం చేశారు.మదపుటేనుగును అడవుల్లోకి తరి మేయాలని, మళ్లీమళ్లీ జనావాసాల్లోకి చొరబడకుండా కందకాలు తవ్వి, సోలార్‌ ఫెన్సింగ్‌ వేయాలని ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. ఏనుగు దాడిలో మృతి చెందిన వారికి సంతాపం ప్రకటించి, వారి కుటుంబీకులకు సానుభూతి తెలిపారు. 




Updated Date - 2020-09-28T17:54:22+05:30 IST