పోడు పరిష్కారానికి ఇంకెన్నాళ్లు?

ABN , First Publish Date - 2022-05-29T09:54:41+05:30 IST

పోడు భూముల సమస్యల పరిష్కారానికి 2018 నుంచి వివిధ సందర్భాల్లో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ ఇది! సమస్య పరిష్కారానికి మంత్రి సత్యవతి రాథోడ్‌ నేతృత్వంలో క్యాబినెట్‌ కమిటీ...

పోడు పరిష్కారానికి ఇంకెన్నాళ్లు?

  • రాష్ట్రవ్యాప్తంగా 13 లక్షల ఎకరాల క్రమబద్ధీకరణకు 3.5 లక్షల దరఖాస్తులు
  • 6నెలలైనా చర్యలు చేపట్టని సర్కారు
  • ఇప్పుడు హద్దులు నిర్ణయించాలని ఆదేశం
  • కందకాలు తవ్వుతున్న అధికారులు
  • రైతులు, అధికారుల మధ్య మళ్లీ వివాదాలు


ఆసిఫాబాద్‌, మే 28 (ఆంధ్రజ్యోతి):

‘పోడు భూముల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తా! సంబంధిత అధికారులందరితో కలిసి వెళ్లి.. నేనే అక్కడ కుర్చీ వేసుకుని కూర్చుంటా! సమస్యలన్నీ పరిష్కరించి రైతులకు పోడు పట్టాలు ఇప్పిస్తా!’


.. పోడు భూముల సమస్యల పరిష్కారానికి 2018 నుంచి వివిధ సందర్భాల్లో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ ఇది! సమస్య పరిష్కారానికి మంత్రి సత్యవతి రాథోడ్‌ నేతృత్వంలో క్యాబినెట్‌ కమిటీ, సబ్‌ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. పలు సిఫారసులు చేస్తూ ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది కూడా. పోడు భూముల క్రమబద్ధీకరణకు విధి విధానాలు తయారు చేయాలని గత ఏడాది నవంబరు 8న ఆదేశించారు. నవంబరు 8 నుంచి డిసెంబరు 31 వరకూ దరఖాస్తులు కూడా స్వీ కరించారు. అధికారిక గణాంకాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా 13 లక్షల ఎకరాల క్రమబద్ధీకరణ కోరుతూ 3.5 లక్షల మంది గిరిజన, గిరిజనేతరులు దరఖాస్తు చేసుకున్నారు. అయినా, ఇప్పటి వరకూ ఈ సమస్యను పరిష్కరించలేదు. దరఖాస్తులను పరిశీలించలేదు. సరికదా.. అటవీ భూములకు హద్దులు గుర్తించి, కందకా లు, కంచెలు ఏర్పాటు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దాంతో, అధికారులు రంగంలోకి దిగారు.  


అటవీ భూముల్లో మళ్లీ ఘర్షణలు

వానాకాలం సాగుకు సమయం దగ్గర పడుతోంది. పోడు వివాదాలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. పోడు భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తులను పరిష్కరించకుండానే.. దానికి పూర్తి భిన్నంగా అటవీ సరిహద్దులను గుర్తించాలంటూ ప్రభుత్వం అంతర్గతంగా ఆదేశాలు ఇచ్చింది. దాంతో, ఆసిఫాబాద్‌ జిల్లాలో పలుచోట్ల రైతులు సాగు చేసుకుంటున్న భూములను అటవీ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. కందకాలు తవ్వి హద్దులు ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల పెంచికల్‌పేట మండలం కొండపల్లి అటవీ ప్రాంతంలో దుక్కి సిద్ధం చేసుకుంటున్న భూమిని స్వాధీనం చేసుకునేందుకు అటవీ శాఖ ప్రయత్నించడంతో ఆందోళనకు గురైన రైతు పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇటీవల బెజ్జూరు మండలంలోని ఓ గ్రామం లో కందకం తవ్వేందుకు ప్రయత్నించగా రైతులు అడ్డుకున్నారు. అధికారులకు, రైతులకు మధ్య గొడవలు జరిగాయి. సిర్పూరు (టి) మండలం మాలినిలో అటవీ శాఖ మహిళా ఉద్యోగిని, పోడు రైతులకు మధ్య ఘర్షణ తలెత్తింది. ఇతర అటవీ ప్రాంతాల్లోనూ ఇటువంటి ఘటనలు ఇటీవల చోటు చేసుకుంటున్నాయి.  ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని నాన్చేకొద్ది రైతులకు, అటవీ శాఖకు మధ్య ఘర్షణలు పెచ్చరిల్లే ప్రమాదం పొంచి ఉందని ఇంటెలిజెన్స్‌ వర్గాలు చెబుతున్నాయి.


 పోడు సాగు ఎ క్కువగా అటవీ ప్రాంత జిల్లాలైన ఆదిలాబాద్‌, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, వనపర్తి, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. వీటిలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోనే 2.59 లక్షల ఎకరాల్లో పోడు సాగు చేస్తున్నట్టు తేల్చారు. ప్రభుత్వం స్వీకరించిన దరఖాస్తుల్లోనూ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి రమారమి 70 వేల వరకు ఉన్నాయి. వీటిలో ఆసిఫాబాద్‌ జిల్లాకు సంబంధించి అత్యధికంగా 1.18 లక్షల ఎకరాలకు గాను 63.23 ఎకరాల్లో గిరిజనులు, 55.04 ఎకరాల్లో గిరిజనేతర రైతులు పోడు హక్కుల కోసం దరఖాస్తులు చేశారు. ఆదిలాబాద్‌ జిల్లాలో 62,266 ఎకరాలకు గాను 37,798 ఎకరాల్లో గిరిజనులు, 24,467 ఎకరాల్లో గిరిజనేతరులు దరఖాస్తు చేశారు. మంచిర్యాల జిల్లాలో 33,418 ఎకరాల గాను 13,587 ఎకరాల్లో గిరిజనులు, 19,830 ఎకరాల్లో గిరిజనేతరులు, నిర్మల్‌ జిల్లాలో 45,814 ఎకరాలకు గాను 30,700 ఎకరాల్లో గిరిజన రైతులు, 15,114 ఎకరాల్లో గిరిజనేతర రైతులు దరఖాస్తులు చేశారు. అయితే, అటవీ అంతర్భాగంలో ఉండే రైతాంగాన్ని ఖాళీ చేయించాలన్న ఆదేశంతోనే గిరిజనేతర రైతుల భూముల స్వాధీన ప్రక్రియను ప్రారంభించినట్టు అనుమానిస్తున్నారు. వారం, పది రోజుల్లో వానాకాలం సీజన్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో హరితహారం పేరిట అటవీ అధికారులు భూములు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించడం రైతుల్లో అలజడి సృష్టిస్తోంది. 


దశాబ్దాలుగా సాగు చేస్తున్నా 

దశాబ్దాలుగా మూడెకరాల పోడు భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నా. అటవీ అధికారులు మా భూములు స్వాధీనం చేసుకొని మొక్కలు నాటేందు కు చదును చేస్తున్నారు. వారంరోజుల క్రితం వ్యవసాయ పనులను అడ్డుకున్నారు. కాళ్లు పట్టుకొ ని వేడుకున్నా కనికరించలేదు. తీవ్ర మనస్తాపంతో పెట్రోలు పోసుకున్నా. న్యాయం చేయాలి.

- ఇస్తారి, పోడు రైతు, కొండపల్లి

Updated Date - 2022-05-29T09:54:41+05:30 IST