తొలుత పౌరాణిక, చారిత్రక చిత్రాలలో నటించిన ఏయన్నార్ ఆ తర్వాత తర్వాత సాంఘిక చిత్రాలకు వన్నె తీసుకొచ్చారు. శరత్ చంద్ర రాసిన దేవదాసు నవలను పలు భాషల్లో సినిమాలుగా రూపొందించారు. అయితే.. అన్ని భాషలలోకెల్లా విశేషమైన విజయానందుకున్న చిత్రంగా నాగేశ్వరరావు ‘దేవదాసు’ నిలిచింది. 1953లో వచ్చిన ఈ చిత్రంలో ఏయన్నార్ దేవదాసుగా జీవించారనే చెప్పాలి. 50, 60, 70 లలో రూపొందిన పలు ప్రేమకథా చిత్రాల్లో ప్రేమికుడిగా అపర ఖ్యాతిని సంపాదించారు అక్కినేని. ‘ప్రేమనగర్’, ‘ప్రేమాభిషేకం’, ‘మేఘసందేశం’ వంటి చిత్రాల్లో భగ్న ప్రేమికుడిగా అలరించారు. ఇక.. ‘మాంగల్యబలం’, ‘ఇల్లరికం’, ‘వెలుగునీడలు’ వంటి కుటుంబ కథా చిత్రాల్లోనూ.. ‘బాటసారి’, ‘డాక్టర్ చక్రవర్తి’ వంటి విలక్షణమైన పాత్రల్లోనూ ఒదిగిపోయిన ‘దసరా బుల్లోడు’ ఏయన్నార్.
రాముడు, రావణుడు వంటి పలు పౌరాణిక పాత్రలతో యన్.టి.ఆర్ మెప్పిస్తే.. పలువురు భక్తులు, కవులు పాత్రలతో ఏయన్నార్ ఆకట్టుకున్నారు. ‘మహాకవి కాళిదాసు’, ‘మహాకవి క్షేత్రయ్య’, ‘తెనాలి రామకృష్ణ’, ‘భక్త తుకారం’ వంటి చిత్రాలు నటసామ్రాట్ కి మంచి పేరు తీసుకొచ్చాయి. నటసామ్రాట్ నటజీవితంలో అవార్డులు, రివార్డులకు కొదవే లేదు. తెలుగు చిత్ర పరిశ్రమకు నాగేశ్వరరావు చేసిన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలతో గౌరవించింది. ఇంకా.. చిత్ర పరిశ్రమలో అత్యున్నతమైన రఘుపతి వెంకయ్య, దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాలు అక్కినేనిని వరించాయి. 1941 మొదలు.. 2014 జనవరి 22 న చనిపోయే వరకూ నటనను కొనసాగించారు నాగేశ్వరరావు. హాస్పిటల్ బెడ్ పై నుంచే తమ కుటుంబ చిత్రం ‘మనం’కు డబ్బింగ్ చెప్పారు ఏయన్నార్. తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నంతకాలం ఏయన్నార్ తెలుగు వారి మదిలో మెదులుతూనే ఉంటారు