ఆంతర్యమేంటో?

ABN , First Publish Date - 2021-02-20T06:03:06+05:30 IST

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీకి ఈమారు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. గతంతో పోలిస్తే స్వతంత్ర అభ్యర్థుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

ఆంతర్యమేంటో?

ఎమ్మెల్సీ బరిలో పెరుగుతున్న అభ్యర్థులు

గుర్తింపు కోసమా? ఓట్ల చీలికా కోసమా?

నల్లగొండ, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీకి ఈమారు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. గతంతో పోలిస్తే స్వతంత్ర అభ్యర్థుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గత ఎన్నికలో 22 మంది అభ్యర్థులు పోటీపడగా, ప్రస్తుత ఎన్నికలకు ఇప్పటి వరకు 22నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల దాఖలుకు ఈనెల 23 వరకు గడువు ఉంది. 22న పంచమి, 23న చివరి రోజు కావడంతో నామినేషన్ల సంఖ్య పెరగనుంది. పోటీ చేసే అవకాశం, అర్హత అందరికీ ఉన్నా కొందరు గుర్తింపు కోసమే నామినేషన్లు దాఖలు చేస్తుండగా, ఓట్ల చీలిక కోసమే కొందరు పెద్దలు తెరవెనుక ఉండి స్వతంత్రులను ప్రోత్సహిస్తున్నారనే గుసగుసలు వినవస్తున్నాయి. అభ్యర్థుల సంఖ్య ఎక్కువైతే ఓటర్లు గందరగోళానికి గురై, ఓట్లు చీలి గెలుపునకు అవకాశం ఉంటుందని భావించే ఈ మంత్రాంగ నడిపిస్తున్నట్టు గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. మొదటి ప్రాధాన్య ఓటును ఓటరు ఇష్టం వచ్చినవారికి వేసి, రెండో ప్రాధాన్య ఓటును ప్రధాన పార్టీలు వేయించుకునే ప్రణాళికలో భాగంగానే స్వతంత్రులు పెరుగుతున్నట్టు కొందరు విశ్లేషిస్తున్నారు. అంతేగాక నామినేషన్‌కు డిపాజిట్‌ రూ.10వేలే ఉండటంతో తెర వెనుక పెద్దలు ఈకథ నడిపిస్తున్నారన్న ప్రచా రం ఉంది. సమాజంలో గుర్తింపు లభిస్తుందని కొందరు, ఏజెంట్‌, కౌంటింగ్‌ పాస్‌లు పెద్ద సంఖ్యలో అందుబాటులోకి వస్తాయని మరి కొందరు నామినేషన్లు దాఖలు చేస్తున్నట్లు సమాచారం. ప్రధాన పార్టీలకు సహకరించేలా డమ్మీ అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారని వినికిడి. స్వతహాగా ఆర్థిక బలం, గతంలో కీలక విభాగాల్లో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన వారుసైతం ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీలో నిలుస్తున్నారు. ప్రధానంగా నల్లగొండ, వరంగల్‌ జిల్లాల నుంచే అభ్యర్థుల సంఖ్య భారీగా ఉంది. ఈమారు అభ్యర్థుల సంఖ్య 40కి పెరిగే అవకాశం ఉందని ఓ ప్రధాన పార్టీ నుంచి బరిలో ఉన్న అభ్యర్థి వెల్లడించారు. పెద్దగా గుర్తింపు లేని వ్యక్తులు ప్రచారానికి ఇప్పటికే కోటి రూపాయల వరకు ఖర్చు చేయగా, తాను ప్రణాళిక ప్రకారం వెళ్తుండటంతో ఇప్పటి వరకు రూ.4లక్షలే ప్రచార ఖర్చు అయిందని ఆయన చెప్పారు.


ఎమ్మెల్సీ ఎన్నికకు వడివడిగా ఏర్పాట్లు

80 ఏళ్లు దాటిన వారికి పోస్టల్‌ బ్యాలెట్‌

ఉమ్మడి నల్లగొండ-వరంగల్‌-ఖమ్మం నియోజవర్గాలతో విస్తరించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ, ప్రారంభం కాగా, పోలింగ్‌ బూత్‌ల ఖరారు, భద్రత, సిబ్బందికి శిక్షణ వంటి ఏర్పాట్లు వడివడిగా సాగుతున్నాయి. ఈ ఎన్నికకు నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌పాటిల్‌ రిట్నరింగ్‌ అధికారిగా వ్యవహరిస్తున్నారు. 12 జిల్లాల పరిధిలో జనవరి 18న వెలువరించిన తుది జాబితా ప్రకారం 4,91,396 మంది పట్టభద్ర ఓటర్లు ఉన్నారు. కొవిడ్‌ నేపథ్యంలో వెయ్యి మంది ఓటర్లకు మించకుండా పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇలా మొత్తం 546 పోలింగ్‌ స్టేషన్లను ఇప్పటి వరకు అధికారికంగా ఖరారు చేశారు. రాజకీయ సమావేశాలు, ర్యాలీలు, రోడ్‌ షోలకు అనుమతుల కోసం నల్లగొండ జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేకుండానే అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు అనుమతులు ఇచ్చేలా రిటర్నింగ్‌ అధికారి పీజే.పాటిల్‌ నిర్ణయం తీసుకున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు వ్యయ నిబంధన లేకపోవడంతోపాటు, వ్యయ పరిశీలన బృందాలు, అభ్యర్థుల రోజు వారీ ఖర్చు నమోదు వంటివి ఉండవు. నామినేషన్ల ఉపసంహరణ ఈనెల 26న కాగా, 27 మధ్యాహ్నం నాటికి బ్యాలెట్‌ పేపర్లు ముద్రిస్తారు. ఎన్నికల నిర్వహణకు 3,500 మంది సిబ్బంది, భద్రతా ఏర్పాట్లకు 3వేల మంది పోలీసులను వినియోగించనున్నారు. దివ్యాంగులు, 80 ఏళ్లు దాటిన వారు మొత్తం 804 మంది ఓటర్లు ఉం డగా, వీరికి పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. బూత్‌ లెవల్‌ అధికారుల ద్వారా పోస్టల్‌ బ్యాలెట్లను ఓటర్లకు మార్చి2 వరకు అందజేస్తారు. వీరు మార్చి 14న పోలింగ్‌ కాగా ముందు రోజు అంటే 13వ తేదీ వరకు ఓటింగ్‌ చేసే అవకాశం ఉంది. పోలింగ్‌కు ఏడు నుంచి పది రోజుల ముందు కరోనా పాజిటివ్‌ వచ్చిన వారికి సైతం పోస్టల్‌ బ్యాలెట్‌ ఇస్తారు. అందుకు రిపోర్టులను సమర్పించాల్సి ఉంటుంది. 12 జిల్లాల పరిధిలో పోలింగ్‌ పూర్తికాగానే అదే రోజు అర్ధరాత్రి బ్యాలట్‌ బాక్సులు నల్లగొండకు చేర్చి, వేర్‌ హౌసింగ్‌ గోడౌన్‌లో భద్రపరిచేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక్కడే మార్చి 17న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి మార్చి 2న, 9న సిబ్బందికి శిక్షణ ఇస్తారు. 17 కీలక పనులు నిర్వహించే విభాగాలకు నోడల్‌ అధికారులను ఇప్పటికే నియమించారు. ప్రభుత్వ సెలవు రోజు మినహాయించి ఈనెల 23వ తేదీ సాయంత్రం 3గంటలవరకు నామినేషన్లు సమర్పించే అవకాశం ఉంది.


నాలుగో రోజు 10 నామినేషన్లు

నల్లగొండ టౌన్‌: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు నాలుగో రోజైన శుక్రవారం 10 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 16వ తేదీనుంచి నామినేషన్లను స్వీకరిస్తుండగా, ఇప్పటివరకు మొత్తం 22మంది నామినేషన్లు వచ్చాయి. తెలంగాణ జనసమితి అభ్యర్థి కోదండరాం, స్వతంత్ర అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న తరపున వారి ప్రతిపాదకులు నామినేషన్లు దాఖలు చేశారు. జయస్వరాజ్‌ పార్టీ తరపున హైదరాబాద్‌కు చెందిన కాసాని నర్సయ్య నామినేషన్‌ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా నల్లగొండకు చెందిన బొల్గూరి కిరణ్‌, యార్ల ఆశాజ్యోతి,  గాలెంక విజయ్‌, నందిపాటి జానయ్య, వరంగల్‌ జిల్లాకు చెందిన కడిమాల సురేష్‌, గడ్డ సదానందం, యాదాద్రి జిల్లాకు చెందిన గుండు సంజీవ్‌ నామినేషన్లు దాఖలు చేశారు.

Read more