సినిమా రివ్యూ : అంటే సుందరానికీ.. (Ante sundaraniki)

Published: Fri, 10 Jun 2022 14:59:10 ISTfb-iconwhatsapp-icontwitter-icon
సినిమా రివ్యూ : అంటే సుందరానికీ.. (Ante sundaraniki)

చిత్రం : అంటే సుందరానికీ.. (Ante sundaraniki)

విడుదల తేదీ : జూన్ 10, 2022

నటీనటులు : నానీ, నజ్రియా నజీమ్, నరేశ్, నదియా, రోహిణి, అళగన్ పెరుమాళ్, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, పృధ్వీరాజ్, మాస్టర్ విన్నీ, పవిత్రా లోకేశ్ తదితరులు

సంగీతం : వివేక్ సాగర్ 

ఛాయాగ్రహణం : నికేత్ బొమ్మి

ఎడిటర్ : రవితేజ గిరిజాల 

నిర్మాతలు : నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి

స్ర్కీన్ ప్లే - దర్శకత్వం : వివేక్ ఆత్రేయ

గత చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’ లో నేచురల్ స్టార్ నానీ సోషలిస్ట్‌గా, బెంగాలీ‌ రైటర్‌గా సీరియస్ రోల్ చేసి మెప్పించగా..దానికి పూర్తి విరుద్ధంగా.. తాజా చిత్రం ‘అంటే సుందరానికీ’ లో హిలేరియస్ కామెడీ పండించడానికి సిద్ధమయ్యాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన ఈ వెరైటీ లవ్ స్టోరీ ఈ రోజే (జూన్ 10) ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదలైంది. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ కథానాయికగా నటించిన ఈ సినిమా టీజర్, సింగిల్స్,ట్రైలర్ తో విడుదలకు ముందే విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. మరి ప్రేక్షకుల అంచనాల్ని ఈ సినిమా ఎంత వరకూ అందుకుంది? సుందరంగా నానీ ఏ స్థాయిలో నవ్వులు పంచాడు అనే విషయాలు రివ్యూలో చూద్దాం. (Movie Review)

కథ

సుందరం (నానీ) సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన యువకుడు. చిన్నప్పటి నుంచి ఆచారాలు, కట్టుబాట్ల మధ్య పెరుగుతాడు. దాని కారణంగా స్వేచ్ఛా జీవితాన్ని కోల్పోతాడు. చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన వల్ల సుందరానికి అమెరికా వెళ్ళాలని విపరీతమైన కోరిక. సముద్రం దాటడమే మహాపాపంగా భావించే అతడి తండ్రి (నరేశ్) దీనికి అడ్డుపడతాడు. అలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్న సుందరం జీవితంలోకి లీలా థామస్ (నజ్రియా నజీమ్) ఎంటరవుతుంది. చిన్నప్పటి నుంచి ఆమె అంటే ఇష్టం ఏర్పరుచుకుంటాడు సుందరం. అతడిపై ఆమెకూ ఇష్టం కలుగుతుంది. ఆ ఇష్టం ప్రేమకు దారితీస్తుంది. లీల క్రైస్తవ కుటుంబానికి చెందిన అమ్మాయి. ఇరువురి  కుటుంబాల ఆచార వ్యవహారాలు వేరు. అన్య మతస్తులతో స్నేహం అంటేనే మండిపడే ఈ రెండు కుటుంబాల పెద్దల్ని ఒప్పించీ ఆ ఇద్దరూ ఎలా ఒకటయ్యారు? ఆ క్రమంలో ఆ ఇద్దరూ ఆడిన నాటకం ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుంది? ఇంతకీ సుందరం అమెరికా కల నెరవేరిందా? అన్నదే మిగతా కథ. (Movie review)

విశ్లేషణ

రెండు వేరు వేరు మతాలకు చెందిన అమ్మాయి, అబ్బాయి ప్రేమలో పడడం, వీరి ప్రేమకు ఇంట్లోవారు అంగీకరించకపోవడం, వారిని ఎదిరించి ప్రేమజంట అష్టకష్టాలు పడడం.. చివరికి వారి ప్రేమను గెలిపించుకోవడం.. ఈ ఫార్ములాతో గతంలో ఎన్నో సినిమాలొచ్చాయి. అయితే ఆ సినిమాలన్నిటిలోనూ కామన్ పాయింట్ ఏంటంటే.. ఆ ఇద్దరూ తమ తల్లిదండ్రుల మనసు మార్చి. ప్రేమ కన్నా మతం గొప్పది కాదు అనే సందేశం ఇవ్వడం. అయితే వీటికి పూర్తి భిన్నంగా ‘అంటే సుందరానికీ’ కథాంశాన్ని రాసుకున్నాడు దర్శకుడు వివేక్ ఆత్రేయ. తమ మతం పట్ల ఇరువురి తండ్రులకు అంచెంచలమైన విశ్వాసం, గౌరవం ఉంటాయి. అలాంటి మైండ్ సెట్ ఉన్న వారి మనసు మార్చడం ఏ ప్రేమికులకైనా సాధ్యం కాదు. అందుకే సుందరం, లీల ఇద్దరూ కలిసి ఒక నాటకం ఆడి..  తమ తల్లిదండ్రులు ప్రేమకు ఒప్పుకొనేలా చేయగలగడమే ఈ సినిమా మెయిన్ పాయింట్. అందులో దర్శకుడు తన బ్రిలియన్సీని చూపించాడు. తమ పేరెంట్స్ ను ఒప్పించడానికి వారి పడే పాట్లు, తీసుకొనే నిర్ణయాలు ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తుతాయి. నిజం ఒకసారి చెబితే సరిపోతుంది. అదే అబద్ధం.. జీవితాంతంగా చెబుతునే ఉండాలి. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి కొన్ని వేల అబద్ధాలు ఆడుతూనే ఉండాలి. ఏదో ఒక రోజు ఆ అబద్ధమే నిజమై కూర్చుంటే.. ఆప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? అనే సత్యాన్ని ఈ సినిమాతో చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఆ ప్రయత్నంలో కావల్సినన్ని నవ్వుల్ని , కొన్ని ఎమోషన్స్ ను ప్రేక్షకులకు అందించాడు. సినిమా నిడివి దాదాపు మూడు గంటలు. దానివల్లఅసలు పాయింట్ లోకి రావడానికి దర్శకుడు చాలా టైమ్ తీసుకున్నాడు. 


ప్రథమార్ధమంతా.. నానీ చిన్నతనం ఎపిసోడ్, నజ్రియా చిన్నతనం ఎపిసోడ్స్ తో నిండిపోవడం.. పాత్రల పరిచయాలు, ఆ పాత్రల ఎస్లాబ్లిష్ మెంట్స్‌కు ఎక్కువ టైమ్ తీసుకోవడంతో పాటు.. సన్నివేశాల్లో  కాస్తంత ల్యాగ్ ఉంటుంది. అందుకే ఆ సన్నివేశాలన్నీ బోరింగ్‌గా అనిపిస్తాయి. అయితే సెకండాఫ్ నుంచి కథనాన్ని వేగంగా పరుగులు తీయించి, అద్భుతమైన కామెడీతో నడిపించాడు దర్శకుడు. ముఖ్యంగా నానీ, నరేశ్ ఇద్దరూ పోటీ పడి మరీ నవ్వించారు. సుందరం, లీల తమ తల్లిదండ్రుల్ని పెళ్ళికి ఒప్పించడానికి ఆడే నాటకం ప్రేక్షకులకు నవ్వుల్ని పంచడంతో పాటు వారిలో ఉత్కంఠతను కూడా రేకెత్తిస్తుంది. అలాగే.. ఆ సన్నివేశాలు ఎమోషనల్ గానూ కదిలిస్తాయి. ఒక దశలో అసలు ఆ ఇద్దరి పెళ్ళికీ వారి పేరెంట్స్ ఎలా ఒప్పుకుంటారు అనేది ప్రేక్షకులకు చాలా ఆసక్తిగా మారుతుంది. ఈ సన్నివేశాల దగ్గర దర్శకుడి ప్రతిభ ఏంటనేది తెలుస్తుంది. ప్రీక్లైమాక్స్ లో ఎవరూ ఊహించని ఒక ట్విస్ట్ ఇచ్చి.. క్లైమాక్స్ ను మరింత ఆసక్తిగా తీర్చిదిద్దాడు దర్శకుడు. ఈ మధ్యకాలంలో నానీ ఈ స్థాయిలో కామెడీ పండించిన చిత్రం లేదని చెప్పాలి. 


సుందరంగా నానీ.. సహజనటనతో చెలరేగిపోయాడు. తల్లిదండ్రుల ఛాదస్తంతోనూ, బాస్ వెటకారం మాటలతోనూ విసిగిపోయే యువకుడిగా అద్భుతంగా నటించాడు. లీలగా  నజ్రియా నజీమ్ నే ఎందుకు ఎంపిక చేశారో.. ఆమె నటన చూస్తే తెలుస్తుంది. సొంత గొంతుతో డైలాగ్స్ పలుకుతూ.. అద్భుతమైన హావభావాలు పలికిస్తూ ఆమెకూడా అదరగొట్టింది. ఇక సీనియర్ నరేశ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సుందరం తండ్రిగా ఆయన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నానీ తర్వాత ఆ రేంజ్ లో చెప్పుకోదగ్గ పాత్ర ఆయనదే. ఒక పక్క కామెడినీ, మరో పక్క ఎమోషన్స్‌ను పలికించి ఆ పాత్రకే వన్నె తెచ్చాడు. రోహిణి, నదియా, శ్రీకాంత్ అయ్యంగార్, రాహుల్ రామకృష్ణ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఇక నానీ చిన్నప్పటి పాత్రలో శేఖర్ మాస్టర్ కొడుకు.. మాస్టర్ విన్నీ బాగా నటించాడు. ఆ పాత్రకి అతడు చాలా యాప్ట్ గా కుదిరాడు. వివేక్ సాగర్ సంగీతం పర్వాలేదనిపిస్తుంది. పాటలు సో సోగా ఉన్నాయి. కెమేరా పనితనం మెప్పిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తానికి ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా బెటర్ ఆప్షన్.  (Movie Review)

ట్యాగ్ లైన్ : అంటే.. వినోదానికీ... 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International