లైవ్‌లో మోడెర్నా టీకా తీసుకున్న ఆంథోనీ ఫౌసీ..

ABN , First Publish Date - 2020-12-23T21:28:46+05:30 IST

అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌసీ మంగళవారం లైవ్‌లో కొవిడ్ వ్యాక్సిన్ మోడెర్నా మొదటి డోసు తీసుకున్నారు.

లైవ్‌లో మోడెర్నా టీకా తీసుకున్న ఆంథోనీ ఫౌసీ..

వాషింగ్టన్: అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌసీ మంగళవారం లైవ్‌లో కొవిడ్ వ్యాక్సిన్ మోడెర్నా మొదటి డోసు తీసుకున్నారు. ఫౌసీతో పాటు యూఎస్ హెల్త్ సెక్రెటరీ అలెక్స్ అజార్, ఎన్ఐహెచ్ క్లినికల్ సెంటర్‌కు చెందిన మరో ఆరుగురు హెల్త్‌కేర్ వర్కర్లు వ్యాక్సిన్ వేయించుకున్నారు. " అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రోత్సహించేందుకే లైవ్‌లో టీకా తీసుకున్నాను. మహమ్మారిని నిలువరించాలంటే మన దగ్గర ఉన్న ఏకైక అస్త్రం టీకా. ఇది చాలా సమర్థమైంది, సురక్షితమైంది." అని ఫౌసీ అన్నారు. కాగా, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్.. ఫౌసీని చీఫ్ మెడికల్ అడ్వైజర్‌గా నియమించిన విషయం తెలిసిందే. సోమవారం డెలావర్‌లో బైడెన్ దంపతులు కూడా లైవ్‌లో ఫైజర్ టీకా తీసుకున్నారు. 


ఇదిలా ఉంటే.. ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లకు యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) అత్యవసర వినియోగానికి ఆమోదించింది. దీంతో గత సోమవారం అమెరికా.. ఫైజర్ వ్యాక్సినేషన్ ప్రారంభించింది. త్వరలోనే మోడెర్నాను కూడా కూడా ప్రజలకు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇక తాజాగా మోడెర్నా టీకా తీసుకున్న ఫౌసీ.. ఇది సురక్షితమైందని, ప్రభావవంతమైందిగా పేర్కొంటూ.. అవకాశం ఉన్న అందరూ తీసుకోవాలని సూచించారు.   



Updated Date - 2020-12-23T21:28:46+05:30 IST