అమెరికా సాధారణ స్థితికి వచ్చేది అప్పుడే: ఆంథోనీ ఫౌసీ

ABN , First Publish Date - 2020-12-24T17:35:11+05:30 IST

ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ సాఫీగా సాగితే వచ్చే వేసవి నాటికి యూఎస్ సాధారణ స్థితికి రాగలదని అంటువ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌసీ చెప్పారు.

అమెరికా సాధారణ స్థితికి వచ్చేది అప్పుడే: ఆంథోనీ ఫౌసీ

వాషింగ్టన్: ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ సాఫీగా సాగితే వచ్చే వేసవి నాటికి యూఎస్ సాధారణ స్థితికి రాగలదని అంటువ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌసీ చెప్పారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఫౌసీ.. దేశంలో మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నందున ప్రజలు సాధ్యమైనంత వరకు ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. సెలవు రోజులు కావడంతో ప్రయాణాలు పెట్టుకునే యోచనలో ఉంటే మానుకోవాలని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో గుంపులుగా తిరగడం వైరస్ వ్యాప్తికి కారణం అవుతుంది కనుక ఈ సమయంలో సామాజిక దూరం పాటించడం చాలా ముఖ్యం అన్నారు. అలాగే ప్రస్తుత పరిస్థితిలో పెళ్లి, ఇతర శుభకార్యాల గురించి ఆలోచించకపోవడం మంచిదన్నారు. జూన్ లేదా జూలై నాటికి వివాహాలను నిర్వహించవచ్చని సూచించారు. ఎందుకంటే అప్పటికీ దేశంలో సాధారణ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందన్నారు. 


ఇక తన అంచనా ప్రకారం  ప్రాధాన్యత గల నర్సింగ్‌హోం రెసిడెంట్స్, హెల్త్‌కేర్ వర్కర్స్, క్రిటికల్ వర్కర్స్, వయో వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మార్చి, ఏప్రిల్ నాటికి టీకా తీసుకోవడం పూర్తి అవుతుందని పేర్కొన్నారు. అనంతరం ఏప్రిల్‌లో వ్యాక్సినేషన్‌పై తాను సూచించినట్లు ‘ఓపెన్ సీజన్’ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించాలని.. దాంతో టీకా తీసుకోవాలనుకునే సాధారణ జనం తమంతట తాముగా ముందుకు వచ్చి వ్యాక్సిన్ వేయించుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ ప్రాసెస్ కనుక సాఫీగా సాగితే సమ్మర్ చివరినాటికి దేశ జనాభాలో 70 నుంచి 85 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి అవుతుందని ఫౌసీ పేర్కొన్నారు. ఇదే జరిగితే దేశం మొత్తం రక్షణ గొడుగు కింద ఉన్నట్లేనని చెప్పారు. 


ఇక ఫైజర్, మోడెర్నా టీకాలు అత్యవసర వినియోగానికి రావడం పట్ల ఫౌసీ హర్షం వ్యక్తం చేశారు. సరియైన సమయంలో కొవిడ్ వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చిందన్నారు. కాగా, ఫౌసీ మంగళవారం లైవ్‌లో కొవిడ్ వ్యాక్సిన్ మోడెర్నా మొదటి డోసు తీసుకున్న విషయం తెలిసిందే. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రోత్సహించేందుకే తాను లైవ్‌లో టీకా తీసుకున్నట్లు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మహమ్మారిని నిలువరించాలంటే మన దగ్గర ఉన్న ఏకైక అస్త్రం టీకా అన్నారు. కనుక వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని తెలిపారు. టీకా చాలా సమర్థమైంది, సురక్షితమైందిగా ఫౌసీ తెలియజేశారు. ఇదిలా ఉంటే.. 10 రోజుల కింద ఫైజర్ వ్యాక్సినేషన్ ప్రారంభించిన అగ్రరాజ్యం ఇప్పటివరకు 10 లక్షల కంటే ఎక్కువ మందికి టీకాలు ఇవ్వడం పూర్తి చేసినట్లు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) డైరెక్టర్ రాబర్ట్ రెడ్‌ఫీల్డ్ బుధవారం చెప్పారు.    


Updated Date - 2020-12-24T17:35:11+05:30 IST