అంటు కట్టుట

Published: Mon, 28 Mar 2022 00:22:47 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అంటు కట్టుట

క్షామపీడితమైన మేధోసీమల మీద

కవిత్వ దయా మేఘపంక్తులు విహరింపనిద్దాం

హర్షం ధారాశుద్ధితో జోరుగ కురుస్తుంది


తలెత్తుకు నిలిచిన జడత్వ మహా పర్వతాన్ని

దీక్షగా ఢీకొంటున్న సృజనమేషాన్ని చూద్దాం

ఉన్నపళాన ఉత్సాహం రెప్ప విప్పుకుంటుంది


ఉత్త బోసి శుద్ధ వచన వదనాలనన్నింటినీ

ఉపమాదుల అలంకరణలు తృప్తిగా చేసుకోనిద్దాం

అభివ్యక్తి సౌందర్యం అదనంగా అలరారుతుంది


ఉత్తమ సాహితీ కేదారంలో యథేచ్ఛగా చేరిన

పరమచెత్త చెత్త కలుపుమొక్కల్ని నిర్దయగా పెరుకుదాం

కంటికింపు పంట కైతలు కొన్నైనా పరిమళిస్తాయి


అధ్యయనం ఒయాసిస్సును ఓ ఆశీస్సుగా

అన్నివేళల్లోనూ అందరమూ ఆస్వాదిద్దాం

విస్తరించిన మన ఎడారులు కూడా తడితో వికసిస్తాయి


లోలోపలి లోతుల్లో

నిరంతరం ప్రాణంతో తొణికిసలాడే

సెలయేళ్ళను వేళ్ళూనుకునేలా శ్రద్ధ వహిద్దాం

వాతావరణం కవనాద్యావరణంగా కనువిందు చేస్తుంది


మన మృదుల మంజుల హృదయానికి పదిలంగా

ఆఖరున అపురూపమైన వాక్యం అంటు కడదాం

అది తప్పక ఒక అద్భుత పద్యంగా పల్లవిస్తుంది

నలిమెల భాస్కర్‌


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.